ఆ పసిమొగ్గలు విధి వంచితులు
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:48 AM
రెక్కాడితే గాని డొక్కా డని పేద కుటుంబం వారిది. పెళ్లి అయిన కొద్దికాలానికే పుట్టిన ఆడ బిడ్డకు తలసీమియా వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆ పసిమొగ్గను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తర్వాత మగ బిడ్డ పుట్టినప్పటికీ ఆ సంతోషం ఎంతోకాలం లేదు.
జన్యులోపంతో పది నెలల నాగకార్తీక్
తలసీమియాతో బాధపడుతున్న నాలుగేళ్ల శ్రీపున్నాగ
పేద కుటుంబానికి పెద్ద కష్టం
దాతల సాయం కోసం ఎదురుచూపులు
ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు
ముండ్లమూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రెక్కాడితే గాని డొక్కా డని పేద కుటుంబం వారిది. పెళ్లి అయిన కొద్దికాలానికే పుట్టిన ఆడ బిడ్డకు తలసీమియా వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆ పసిమొగ్గను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తర్వాత మగ బిడ్డ పుట్టినప్పటికీ ఆ సంతోషం ఎంతోకాలం లేదు. ఆ బిడ్డకు జన్యులోపం ఉందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రుల మనోవేదనలో పడిపోయారు. మండ లంలోని ఉమామహేశ్వర అగ్రహారం గ్రామానికి చెందిన కోడిగ నాగేశ్వరరావు, రాజేశ్వరి దంపతుల కుమార్తె కోడిగ శ్రీపున్నాగ (4)కు పుట్టిన ఏడాదికే తలసీమియా సోకింది. ఆ బిడ్డను కాపాడుకొనేందుకు అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడకు వెళ్లినా ఇది నయం కాని వ్యాధి అని, జీవితాంతం అలాగే ఉంటుందని చెప్పారు. దీంతో ఆ కు టుంబం ఒక్కసారిగా ఢీలాపడిపోయింది. 20 రోజులకు ఒకసారి చిన్నా రికి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అలా ఉండగానే పది నెలల క్రితం మగబిడ్డకు రాజేశ్వరి జన్మనిచ్చింది. ఆ బిడ్డ నాగకార్తీక్‌కు కూడా జన్యులోపం ఉండటంతో అద్దంకి, ఒంగోలుతోపాటు గుంటూరు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ప్రతిరోజూ మందులు వాడాలని వైద్యులు చెప్పారు. దీంతో ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇద్దరు బిడ్డలకు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఆ కుటుంబం మానసికంగా కుంగిపోయింది. కూలిపనికి పోతేగాని కుటుంబం గడవని పరిస్థితి. దీంతో ఇద్దరు పిల్లల వద్ద తల్లి రాజేశ్వరి ఉండాల్సి వస్తోంది. భర్త నాగేశ్వరరావు పనికి వెళ్లి తెచ్చే కూలి డబ్బుతోనే పిల్లలకు వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. కనీసం ప్రభుత్వం చిన్నారి పున్నాగకు అనారోగ్య పింఛన్ మంజూరు చేస్తే ఆ నగదుతోనైనా 20రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకునే పరిస్థితి ఉంటుందని, అధికారులు ఆదుకోవాలని నాగేశ్వరరావు వేడుకుంటున్నారు. మొదట పున్నాగకు ఒంగోలు, గుంటూరు, విజయవాడతోపాటు తమిళనాడు రాష్ట్రం రాయవేలూరులోని సీఎంసీలాంటి ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ఆ చిన్నారికి 20రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిందేనని అక్కడి డాక్టర్లు స్పష్టంగా చెప్పారు. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. దాతలు సాయం చేయదలిస్తే సెల్: 8688268451 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నెంబరు 594610027550538, ఐఎఫ్‌సీ కోడ్ యూబీఐఎన్‌ఓసీజీ7999కు నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.