Share News

తీరనున్న దాహార్తి

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:49 AM

తాగునీటి అవసరాల కోసం సాగర్‌ నుంచి విడుదల చేసిన నీరు సాఫీగా వనరులకు చేరుతోంది. మరో నాలుగు రోజుల్లో డ్యాం నుంచి సరఫరా నిలిపివేయనున్నారు. ఈనేపథ్యంలో ఎగువన ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్‌లో నిల్వ చేసిన నీరు, డ్యాం నుంచి దిగువ వరకు ప్రధాన కాలువలో ఉండే ప్రవాహంతో జిల్లాలోకి మరో పది రోజులు సరఫరా ఉంటుంది.

తీరనున్న దాహార్తి

తాగునీటి వనరులకు చేరుతున్న సాగర్‌ జలాలు

నాలుగు రోజుల క్రితం జిల్లాలోకి ప్రవేశం

రామతీర్థం రిజర్వాయర్‌కు తొలి ప్రాధాన్యం

అదేసమయంలో దర్శికి ఎగువన ఉన్న

ఎస్‌ఎస్‌ ట్యాంకులను నింపుతున్న అధికారులు

తర్వాత నోటిఫైడ్‌ తాగునీటి చెరువులు,

ఒంగోలులోని ఎస్‌ఎస్‌ ట్యాంకులకు నీరు

అద్దంకి బ్రాంచి కాలువ పరిధిలో తొలుత దిగువన

ఉన్న పర్చూరు నియోజకవర్గానికి సరఫరా

మరో మూడు నెలలు తాగునీటికి భ రోసా

తాగునీటి అవసరాల కోసం సాగర్‌ నుంచి విడుదల చేసిన నీరు సాఫీగా వనరులకు చేరుతోంది. మరో నాలుగు రోజుల్లో డ్యాం నుంచి సరఫరా నిలిపివేయనున్నారు. ఈనేపథ్యంలో ఎగువన ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్‌లో నిల్వ చేసిన నీరు, డ్యాం నుంచి దిగువ వరకు ప్రధాన కాలువలో ఉండే ప్రవాహంతో జిల్లాలోకి మరో పది రోజులు సరఫరా ఉంటుంది. ఈలోపు రామతీర్థం, ఎస్‌ఎస్‌ ట్యాంకు లతోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని 222 నోటిఫైడ్‌ చెరువులు నింపేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొన్నిచోట్ల నాన్‌నోటిఫైడ్‌ చెరువులకు కూడా నీటిని పెట్టే అవకాశం ఉంది. దీని వలన రానున్న మూడు మాసాలపాటు ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు తాగునీటి కొరత తీరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒంగోలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక తాగునీటి చెరువులు అడుగంటిపోయాయి. దీంతో దాహం కేకలు పెడుతున్న ఉమ్మడి జిల్లా ప్రజల కోసం ప్రభుత్వం విడుదల చేసిన సాగర్‌ నీరు క్రమంగా వనరుల్లోకి చేరుతోంది. ఉమ్మడి జిల్లాలో 222 నోటిఫైడ్‌ చెరువులు, పలు పట్ట ణాలకు నీరందించే ఎస్‌ఎస్‌ ట్యాంకులు ఉన్నా యి. గతనెల 25న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో దాహార్తిని తీర్చేందుకు సాగర్‌ కుడి కాలువకు నీరు విడుదల చేశారు. తొలుత దిగువన ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్‌ను నింపి తర్వాత దిగువకు వదలారు. సాగర్‌ కుడి ప్రధాన కాలువ ఉమ్మడి జిల్లాల సరిహద్దు అయిన 85/3 వద్దకు నాలుగు రోజుల క్రితం నీరు చేరింది. ఈ కాలువ పరిధిలో దిగువన ఉన్న రామతీర్థంను కొంతమేర నింపి ఆతర్వాత ఆ రిజర్వాయర్‌కు ఎగువన, దిగువన ఉన్న చెరువులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

అన్ని ఎస్‌ఎస్‌ ట్యాంకులకూ నీరు

బహుళ గ్రామాలకు నీరిచ్చే సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను కూడా నింపాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ నేప థ్యంలో రెండు, మూడు రోజులుగా ఇటు రామతీర్థం రిజర్వాయర్‌తోపాటు దర్శికి ఎగువన త్రిపురాంతకం వరకు ఉన్న సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకులకు నీరు పెడుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా సరిహద్దు 85/3 వద్ద సుమారు 1,839 క్యూసెక్కుల నీరు వస్తుండగా అక్కడి నుంచి మార్కాపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నీరు అందించే ఎస్‌ఎస్‌ ట్యాంకులకు 90 క్యూసెక్కులు, దర్శి ప్రాంతంలోని ఎస్‌ఎస్‌ ట్యాంకులకు మరో 70 క్యూసెక్కులు వెళ్తోంది. ఒంగోలు బ్రాంచి కాలువకు సుమారు 1,284 క్యూసెక్కులు వస్తోంది. దర్శి బ్రాంచి కాలువ పరిధిలో ఉన్న పమిడిపాడు మేజర్‌, రజానగరం మేజర్లకు నీటిని ఆపి రామతీర్థానికి ఇస్తున్నారు.

మరో నాలుగు రోజుల తర్వాతే..

రామతీర్ధం రిజర్వాయర్‌ సామర్థ్యం 1.50 టీఎంసీలు కాగా డెడ్‌స్టోరేజీ 0.260 టీఎంసీలు. ప్రస్తుతం రామతీర్థానికి 1,088 క్యూసెక్కులు వస్తుండగా 0.639 టీఎంసీల నీరు చేరింది. రిజర్వాయర్‌లోకి కనీసం ఒక టీఎంసీ చేరేంత వరకూ నింపి తర్వాత ఇటు దిగువన, అటు ఎగువన ఉండే ప్రఽకాశంలోని 145, మార్కాపురం జిల్లాలో ఉన్న 14 చెరువులను నింపనున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే రామతీర్థంలోకి ఒక టీఎంసీ నీరు చేరి చెరువులకు ఇవ్వాలంటే మరో నాలుగు రోజులు పట్టవచ్చు. అయితే రామతీర్థం ఎగువన దర్శి నుంచి త్రిపురాంతకం వరకు బహుళ గ్రామాలకు అలాగే మార్కాపురం, పొదిలి, దర్శి, వైపాలెం వంటి పట్టణాలకు నీరందించే 12 ఎస్‌ఎస్‌ ట్యాంకులు ఉండగా వాటికి మోటార్ల ద్వారా నీటిని పెడుతున్నారు.

మరో పదిరోజులే వస్తాయి..

సాగర్‌ ప్రధాన కాలువల ద్వారా మరో పది రోజులు మాత్రమే జిల్లాలోకి నీరు వస్తుంది కనుక అధికారలుఉ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలాఉండగా జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గం, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గాలకు అద్దంకి బ్రాంచి కాలువ ద్వారా సాగర్‌ నీరు వస్తోంది. ఆ కాలువ పల్నాడు జిల్లాలోని చేజర్ల వద్ద ప్రధాన కాలువ నుంచి చీలుతుంది. 18/0 మైలు వద్ద అద్దంకి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఆ కాలువ పరిధిలో రెండు నియోజకవర్గాల్లో 63 నోటిఫైడ్‌ చెరువులు ఉన్నాయి. ప్రస్తుతం ఏబీసీ 18/0 వద్ద 790 క్యూసెక్కుల నీరు వస్తుండగా తొలుత దిగువ ప్రాంతంలోని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇచ్చి అక్కడి చెరువులకు నీరు పెడుతున్నారు. అద్దంకి పరిధిలోని చెరువులను శుక్రవారం నుంచి నింపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Updated Date - Sep 04 , 2026 | 02:49 AM