దాహం.. దాహం..
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:09 AM
జిల్లా అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా అడుగంటిన నీటి వనరులు దర్శనమిస్తున్నాయి. నీరు లేక, నిర్వహణ సరిలేక తాగునీటి పథకాలు పనిచేయని పరిస్థితి నెలకొంది.
అడుగంటిన వనరులు.. పనిచేయని పథకాలు
జిల్లావ్యాప్తంగా తాగునీటికి ఇక్కట్లు
సాగర్ నీటి విడుదలపై లేని స్పష్టత
మరింత జటిలంకానున్న సమస్య
జిల్లా అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా అడుగంటిన నీటి వనరులు దర్శనమిస్తున్నాయి. నీరు లేక, నిర్వహణ సరిలేక తాగునీటి పథకాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. ఆగస్టు ముగింపునకు వచ్చినా జిల్లాలో సరైన వర్షం కురవకపోవడంతో తాగు, ఇతర అవసరాల కోసం సాగర్ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే సాగర్ నీటి సరఫరాపై ఇంతవరకూ ఉన్నతస్థాయిలో స్పష్టత కరువైంది. దీంతో నీటి విడుదల ఎప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. దీనివల్ల రానున్న పక్షం రోజుల్లో సమస్య మరింత జటిలం కానుంది.
ఒంగోలు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా అత్యధిక చోట్ల ప్రస్తుతం నీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు, అద్దంకి, చీమకుర్తి పట్టణాలతోపాటు 519 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక ప్రాంతాలకు సాగర్ నీరే ప్రధాన వనరు. దీని ఆధారంగా భారీ రక్షిత నీటి పఽథకాలు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, కొన్నిచోట్ల గ్రామస్థాయి లేదా రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక పథకం ఉన్నాయి. సాధారణ వాడకానికి బోర్లు, చెరువులు, ఇతరత్రా వనరులు ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో వర్షాలు కురిసి వనరులకు నీరు చేరడంతోపాటు సాగుకు సాగర్ నీరు ఇచ్చే క్రమంలో ముందుగా తాగునీటి చెరువులను నింపుతారు. అలా ఆగస్టు ఆఖరు నాటికి జిల్లా అంతటా చెరువులు, ఎస్‌ఎస్ ట్యాంకులు అన్నింటిలోనూ అందుబాటులో నీరు ఉంటుంది. భూగర్భ జలం కూడా పెరుగుతుంది.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం
ఈ ఏడాది ఎల్‌నినో దెబ్బతో వర్షాలు లేకపోవడంతో చెరువులు, వాగులు, వంకలలో నీరు చేరలేదు. భూగర్భ జలం కూడా అడుగంటింది. ఇక సాగర్ నీరు కూడా విడుదల కాలేదు. ఒకవైపు వర్షాలు లేక ఎండలు, వేడి గాలుల తీవ్రతతో నీటి వాడకం పెరిగింది. ఇలాంటి సమయంలో ఏ ఒక్క వనరులోనూ నీరు సరైన స్థాయిలో లేదు. వ్యవస్థాపరంగా గ్రామీణ ప్రాంతాలలో చూస్తే జిల్లాలోని 519 పంచాయతీల పరిధిలో 3.75 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 15 లక్షల మంది జనాభా ఉన్నారు. వారి నీటి అవసరాల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షణలో 31 భారీ సామూహిక రక్షిత, 881 గ్రామ అలాగే మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఉండే స్కీంలు, 299 డైరెక్టు పంపింగ్ స్కీంలు, 12,522 బోర్లు ఉన్నాయి. అలాగే సాగర్, గుండ్లకమ్మల ఆధారంగా 184 నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. భారీ పఽథకాల కోసం ఆయా ప్రాంతాల్లో సాగర్ నీరు ఆధారంగా పెద్దస్థాయి ఎస్‌ఎస్ ట్యాంకులు ఉండగా పట్టణాలలోను అలాగే వనరులు ఉన్నాయి.
పనిచేయని నీటి పథకాలు
వర్షాలు లేక ఒకవైపు, సాగర్ నీరు రాక మరోవైపు వనరులు అడుగంటిపోవడంతో పలు పథకాలు పనిచేయడం లేదు. తాగునీటి అవసరాల కోసం గత మే ఆఖరులో సాగర్ జలాలను జిల్లాకు ఇచ్చారు. ఈ నెల తొలిపక్షంలోనే ఇవ్వాల్సి ఉంది. అయితే ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వ పేచీలతో నీరు విడుదల కాలేదు. దీనిపై సోమవారం కేఆర్‌ఎంబీ సమావేశం జరిగినా స్పష్టత రాలేదు. జిల్లాలో ఆ నీటి ఆధారంగా ఉన్న వనరులను పరిశీలిస్తే 145 చెరువులలో దాదాపు 20 అడుగంటిపోయాయి. మరో 25లో నామమాత్రంగా మిగిలిన వాటిలో 50శాతంలోపు నీరు ఉంది. అలాగే కొన్ని ఎస్‌ఎస్ ట్యాంకులు పూర్తిగా అడుగంటిపోగా మరికొన్నింటిలో అరకొరగా నీరు కనిపిస్తోంది. ఇక దాదాపు నాలుగు వేల చేతి పంపులు నీరు లేక మొరాయించాయి. దాదాపు 250 చిన్న, మధ్యతరహా రక్షిత నీటి పథకాలు పనిచేయడం లేదు. ఈ ప్రభావంతో లక్షలాది మంది గ్రామీణ ప్రజలు తాగేందుకే కాక సాధారణ వాడకానికి కూడా నీరు దొరక్క ఇబ్బందిపడుతున్నారు.
దర్శి ప్రాంతంలోనూ నీటి సమస్య
దర్శి నియోజకవర్గంలో పూర్తిగా సాగర్ నీరే ఆధారం కాగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో నీటి కొరతతోపాటు పఽథకాల నిర్వహణ కూడా సరిలేక ఈ పరిస్థితి ఏర్పడింది. సుమారు 129 గ్రామాలకు నీరందించే దర్శి ఎన్‌ఏపీ పఽథకం అస్తవ్యస్తంగా మారి సగం గ్రామాలకు కూడా నీరు అందడం లేదు. కురిచేడు మండలంలో 14 గ్రామాలకు నీరు అందించే అట్లుపల్లి రిజర్వాయర్ అడుగంటింది. ఫిల్టర్ బెడ్‌లు కూడా సరిలేక నీటి పరఫరా జరగడం లేదు. దొనకొండ మండలంలో 28 గ్రామాలను నీరందించే చందవరం-1 ట్యాంకులో నీరున్నా పథకం నిర్వహణ లేక పక్షంరోజులకు పైగా నీటి సరఫరా జరగడం లేదు. తాళ్లూరు మండలంలోనూ మూడు రోజులకు ఒకసారి మొక్కుబడిగా నీటి సరఫరా జరుగుతోంది. గుండ్లకమ్మ ఊటబావిలో నీరు లభ్యత లేక బొమ్మనంపాడు, జార్లపాలెం, చెరువుకొమ్ముపాలెంకు సరఫరా ఆగింది. సంతమాగులూరు మండలం ఏల్చూరు, గురిజేపల్లి, కొమ్మాలపాడు చెరువులు అడుగంటాయి.
అడుగంటిన నీటి వనరులు
ఎస్‌ఎన్‌పాడు మండలంలో 12 చెరువులు ఉండగా ఒక్క ఎస్‌ఎన్‌పాడు మినహా మిగతా అన్నింటిలోనూ నీరు అడుగంటింది. చీమకుర్తి మండలంలోని పలు గ్రామాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొండపి ప్రాంతంలో చూస్తే మాకేరులో నీరు లేక దాని ఆధారంగా ఉన్న మర్రిపూడి మండలంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పాలేరు, ముసిలలో నీటి ప్రవాహం లేక పథకాలు పనిచేయడం లేదు. కందుకూరు ప్రాంతంలో కందుకూరు. ఉలవపాడు మండలాల్లో ఇబ్బంది లేకున్నా రాళ్లపాడు రిజర్వాయర్ ఆధారంగా ఉన్న మూడు భారీ పఽథకాల పరిధిలో ఉన్న 90 గ్రామాలకు కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఆ పఽథకాలలో నీరు అడుగంటడంతోపాటు చేపలు పట్టడం, ఫిల్టరేషన్ సరిలేని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.
ఒంగోలులో ట్యాంకర్లతో సరఫరా
ఒంగోలు నగరంలో ఎస్‌ఎస్ ట్యాంకులు అడుగంటే పరిస్థితి ఏర్పడింది. నగరంలో మూడు రోజులకు ఒకసారి నీరు ఇస్తుండగా పలు ప్రాంతాల్లో సరఫరా సరిగా ఉండటం లేదు. ఇక నగరంలోని సగం కాలనీల్లో నీటి సరఫరా చేసే పైపులైన్లు సరిలేక ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. నిత్యం 200 ట్యాంకర్లతో నగరంలో నీటి సరఫరా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాలలో ఉండగా తక్షణం సాగర్ నీరు సరఫరా చేయకుంటే రానున్న వారం, పది రోజులలో జిల్లాలో నీటి సమస్య జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.