Share News

రిజర్వు ఫారెస్ట్‌లో ఇంటి దొంగలు

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:44 AM

అటవీ శాఖలో ఇంటిదొంగలు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి ఇష్టారాజ్యంగా సామాజిక వనాలను నరికేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీఎస్‌ఎస్‌ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో అక్రమం వెలుగులోకి వచ్చింది.

రిజర్వు ఫారెస్ట్‌లో ఇంటి దొంగలు
కటింగ్‌ చేసి వదిలేసిన జామాయిల్‌ దుంగలు

వందల ఎకరాల్లో జామాయిల్‌ చెట్ల నరికివేత

210 టన్నుల కర్ర తరలింపు

రవాణాకు సిద్ధంగా ఉన్న మరో 200 టన్నులు

తనకేమీ తెలియదని బుకాయిస్తున్న సెక్షన్‌ అధికారి

వీఎస్‌ఎస్‌ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి అక్రమం

ఉలవపాడు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : అటవీ శాఖలో ఇంటిదొంగలు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి ఇష్టారాజ్యంగా సామాజిక వనాలను నరికేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీఎస్‌ఎస్‌ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో అక్రమం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొల్లూరుపాడు బీట్‌ కరేడు పంచాయతీ పరిధిలోని ఆకుతోట సంఘం, బాలకోటయ్య సంఘం వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్‌) రిజర్వు ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో జామాయిల్‌ నరికి తరలిస్తున్నారు. వీఎస్‌ఎస్‌ కమిటీ భాగస్వామ్యంతోనే ఫారెస్ట్‌లోని జామాయిల్‌ చెట్లను కొట్టాలి. కాగా ఆకుతోట ఎస్టీ సంఘం వీఎస్‌ఎస్‌ పరిధిలో సుమారు 85 హెక్టార్లలోని జామాయిల్‌ కోతకు వచ్చింది. రెండు రోజులుగా కమిటీ సభ్యులకు తెలియకుండానే అటవీ అధికారులు జామాయిల్‌ చెట్లు నరికి ఆగమేఘాలపై తరలించే కార్యక్రమం చేపట్టారు. ఇదేవిషయమై రిజర్వు ఫారెస్ట్‌ ఇన్‌చార్జ్‌ సెక్షన్‌ అధికారి సుభానీని ప్రశ్నించడంతో తనకు తెలియదని బుకాయించాడని సభ్యులు చెప్తున్నారు. దీంతో వీఎస్‌ఎస్‌ కమిటీ సభ్యులు బుధవారం కావలిలోని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి సౌజన్య కలిసి విషయం తెలిపారు. ఆమె ఆదేశాలతో నరికేసిన జామాయిల్‌ను అక్కడే వదిలేశారు.

ఎలాంటి పర్మిట్లు, అనుమతులు లేకుండానే..

రిజర్వు ఫారెస్ట్‌లోని జామాయల్‌ చెట్ల నరికివేతకు సంబంధించి అనుమతులు, కర్ర తరలింపునకు పర్మిట్లు అవసరం ఉంది. దీనికితోడు వీఎస్‌ఎస్‌ సభ్యులకు తెలియజేయాలి. కానీ ఇవేమీ జరగలేదు. ఇదే విషయాన్ని వీఎస్‌ఎస్‌ చైర్మన్‌ చౌటూరి కోటేశ్వరరావుని ప్రశ్నించగా ఆకుతోట సంఘం వీఎస్‌ఎస్‌ పరిధి చూపించాలని మాత్రమే ఫారెస్ట్‌ అధికారులు అడిగారని చెప్పారు. రిజర్వు ఫారెస్ట్‌లోని ప్రతిచెట్టుపై వీఎస్‌ఎస్‌ సభ్యులకు హక్కు ఉంటుంది. ఆకుతోట సంఘం వీఎస్‌ఎస్‌లో 15మందితో కూడిన కమిటీతో కలిపి మొత్తం 332 మంది సభ్యులు ఉన్నారు. అమాయక గిరిజనులు కావడంతో పర్మిట్‌ లేని వాహనాల్లో నరికిన చెట్లను అప్పటికప్పుడే బయటకు తరలిస్తున్నారు. పర్మిట్‌ ఉన్న వాహనాలలో తరలిస్తేనే వీఎస్‌ఎస్‌ కమిటీకి అమ్మకాలలో వాటా వస్తుంది. ఇప్పటికే సుమారు 210 టన్నుల జామాయిల్‌ను తరలించారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. ఇంకా మరో 200 టన్నుల నరికిన జామాయిల్‌ను తరలించాల్సి ఉంది. వీఎస్‌ఎస్‌ కమిటీ సభ్యులు అడ్డం తిరగడంతో నరికిన జామాయిల్‌ కర్రను అక్కడే వదిలేశారు. పర్మిట్లు, అనుమతులకు సంబంధించిన కాగితాలు చూపించాలని కమిటీ సభ్యులు అడిగినా ఫారెస్ట్‌ అధికారులు సమాధానం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం అమ్మిన ధరలో సగం వీఎస్‌ఎస్‌ కమిటీకి చెల్లించాల్సి ఉంటుంది. పర్మిట్‌ ఉన్న వాహనాలలో మాత్రమే తరలించాలి అప్పుడు మాత్రమే వారికి న్యాయం జరిగనట్లు అవుతుంది. లేదంటే అధికారుల సొంత జేబుల్లోకి వెళుతుందని, అందుకుగాను వీఎస్‌ఎస్‌ చైర్మన్‌తో కుమ్మకుఅయ్యారని కమిటీలోని సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

కూలీలకు తెలియక నరికేశారు

సౌజన్య, కావలి ఆర్‌ఎఫ్‌వో

ఆకుతోట ఎస్టీ సంఘం వీఎస్‌ఎస్‌ సభ్యులు లేవనెత్తిన విషయాలపై కావలి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సౌజన్యను ఫోన్‌లో వివరణ అడగ్గా.. తొలుత బాలకోటయ్య సంఘం వీఎస్‌ఎస్‌ వరకు అనుమతులు తీసుకున్నామని చెప్పారు. కూలీలు తెలియక ఆకుతోట సంఘం వీఎస్‌ఎస్‌ పరిధిలోని జామాయల్‌ చెట్లను కూడా నరికేసి తరలించారన్నారు. స్థానికుల ఫిర్యాదుతో చెట్ల నరికివేతను నిలిపేశామని వివరించారు. అనుమతులు, పర్మిట్‌, టన్నులకు పలికిన ధరలకు సంబంధించిన వివరాలు వీఎస్‌ఎస్‌ కమిటీ సభ్యులకు చూపించారా అని ప్రశ్నించగా లేదని చెప్పారు.

Updated Date - Sep 04 , 2026 | 02:44 AM