Share News

మొక్కల పేరుతో మెక్కేశారు!

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:27 AM

అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీల్లో అవినీతి పెరుగుతోంది. మొక్కల మాటున పెద్దఎత్తున నిధుల దోపిడీ జరుగుతోంది. గత వైసీపీ హయాంలో ఆపార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై భారీ మొత్తంలో బొక్కేశారు.

మొక్కల పేరుతో మెక్కేశారు!
తాడివారిపల్ల్లెలోని అటవీశాఖ నర్సరీ

అటవీశాఖ నర్సరీల్లో అక్రమాలు

తాడివారిపల్లిలో మొక్కలు పెంచకుండానే నిధులు డ్రా

అధికారుల చేతివాటం... రూ.4లక్షలు స్వాహా

గతంలోనూ వైసీపీ నేతలతో కుమ్మక్కై భారీగా నిధుల దోపిడీ

తర్లుపాడు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీల్లో అవినీతి పెరుగుతోంది. మొక్కల మాటున పెద్దఎత్తున నిధుల దోపిడీ జరుగుతోంది. గత వైసీపీ హయాంలో ఆపార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై భారీ మొత్తంలో బొక్కేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం లోనూ వారు అదే పంథాను కొనసాగి స్తున్నారు. మొక్కలు పెంచకుండానే పెంచినట్లు రికార్డుల్లో చూపి రూ.లక్షలు దండుకుం టున్నారు. ఒక్క తాడివారిపల్లి నర్సరీలోనే రూ.4లక్షలు మెక్కేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కలుజువ్వలపాడు గ్రామంలోని నర్సరీలోనూ వైసీపీ నాయకుడు, అక్కడ అటవీ అధికారి కలిసి రూ.3.20లక్షలు దుర్వినియోగం చేశారు. తుమ్మలచెరువు నర్సరీలో కూడా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించేందుకు మండలంలోని తుమ్మలచెరువు, కలుజువ్వలపాడు, తాడివారిపల్లెలో సోషల్‌ ఫారెస్ట్‌ ఆధ్వర్యంలో నర్సరీలు ఉన్నాయి. వీటిలో పలు అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. మొక్కలు పెంచినట్లు రికార్డుల్లో నమోదు చేసుకొని రూ.లక్షలు దండుకుంటున్నారు. గతంలో కొందరు అధికారులు వైసీపీ నాయకులతో అంటకాగి అవినీతికి పాల్పడ్డారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి బెరుకూ లేకుండా నిధులను బొక్కేస్తున్నారు. సామాజిక వనాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌లుగా వైసీపీకి చెందిన వారే కొనసాగుతుండటంతో అవినీతికి అంతులేకుండా పోయింది. తాడివారిపల్లి నర్సరీలో మొక్కలు పెంచకుండానే పెంచినట్లు రికార్డులు సృష్టించి రూ.4,01,200 బొక్కేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాడివారిపల్లి అటవీ నర్సరీలో 2005లో 6లక్షల మొక్కల పెంచేందుకు రూ.10లక్షల ఉపాధి నిధులు మంజూరు చేశారు. కానీ ఆ శాఖ అధికారులు అసలు మొక్కలు పెంచకుండానే గతేడాది జూన్‌లో ఒక వర్క్‌ ఐడీ పేరుతో మొక్కలు పెంచినట్లు రూ.2,00,575 నిధులు డ్రా చేశారు. మరో మూడు నెలల తర్వాత మరో వర్క్‌ ఐడీతో రూ.2,00,616 ఆ శాఖలో పనిచేస్తున్న బీట్‌ వాచర్‌ కొప్పుల జాలారెడ్డి పేరుతో నిధులు డ్రా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అవన్నీ సామాజిక వనాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ తీర్మానం మేరకు చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇటీవల గ్రామస్థులు జాలారెడ్డిని సంవత్సరం నుంచి మొక్కల పెంచకుండా నిధులు ఎలా డ్రా చేశావని నిలదీశారు. దీంతో కంగుతున్న ఆయన ఉన్నతాధికారుల ఒత్తిడి వలనే ఎవరికీ తెలియకుండా నిధులు డ్రా చేసినట్లు ఒప్పుకున్నారు.

ప్రజాప్రభుత్వంలోనూ కొనసాగుతున్న అక్రమాలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అటవీ నర్సరీల మాటున పెద్దఎత్తున నిధుల దోపిడీ జరిగింది. సామాజిక వనాల అభివృద్ధి కమిటీల చైర్మన్‌లుగా వైసీపీకి చెందిన వారు ఉండటంతో అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలోనూ వారే కొనసాగుతుండటంతో కొన్నిచోట్ల వారితో కలిసి, మరికొన్ని చోట్ల అధికారులే అంతా తామై అక్రమాలకు పాల్పడుతున్నారు. గతేడాది కలుజువ్వలపాడులోని హైటెక్‌ నర్సరీలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. అక్కడి అధికారి బుడ్డపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పనులు చేసినట్లు చూపి అతని ద్వారా గత ఏడాది జూన్‌ 25న రూ.3,20,000 నిధులను డ్రా చేయించారు. ఆ నర్సరీలో కూడా నామమాత్రంగా మొక్కలు పెంచుతూ నిధులను బొక్కేస్తున్నారు. తుమ్మలచెరువు నర్సరీలో కూడా ఇలాగే వైసీపీ నాయకుల పేర్లతో బిల్లులు పెట్టుకుంటూ అధికారులు, వైసీపీ నాయకులు పంచుకుంటున్నారు. మండలంలోని 3 నర్సరీలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి అవకతవకలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 24 , 2026 | 02:27 AM