Share News

నోటీసులిచ్చినా లెక్కచేయరు!

ABN , Publish Date - Aug 13 , 2026 | 02:57 AM

దర్శి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లను కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మెతకవైఖరి అవలంబిస్తుండటంతో అక్రమార్కులు లెక్కచేయడం లేదు. నోటీసులిచ్చినా పట్టించుకోకుండా ఆన్‌లైన్‌ విక్రయాలు యథేచ్ఛగా చేస్తున్నారు.

నోటీసులిచ్చినా లెక్కచేయరు!
అగ్రహారం వద్ద అక్రమంగా వేసిన లేఅవుట్‌

దర్శి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు

అనుమతి లేకుండా యథేచ్ఛగా విక్రయాలు

వివాదాస్పద అమ్మకాలతో కేసుల నమోదు

అక్రమార్కుల పట్ల అధికారుల మెతక వైఖరి

దర్శి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి) : దర్శి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లను కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. మెతకవైఖరి అవలంబిస్తుండటంతో అక్రమార్కులు లెక్కచేయడం లేదు. నోటీసులిచ్చినా పట్టించుకోకుండా ఆన్‌లైన్‌ విక్రయాలు యథేచ్ఛగా చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 400 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అంచనా. అధికశాతం మంది కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారు. విజయవాడ, గుంటూరుతోపాటు దర్శిలో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఏజెంట్ల ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా మాయచేసి విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన కస్టమర్లను ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సుల్లో అక్రమ లేఅవుట్ల వద్దకు తీసుకొచ్చి అద్భుత ప్రదేశమని వారికి మాయమాటలు చెప్పి ప్లాట్లు అంటకడుతున్నారు. కనీస అనుమతులు కూడా లేకుండా లేఅవుట్లు వేసి విచ్చలవిడిగా విక్రయిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు విపలమవుతున్నారు.

అమ్మకాల్లోనూ మోసాలు

అక్రమార్కులు కొన్నిచోట్ల తమకు సంబంధం లేని భూమిని కూడా విక్రయించి దగా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకొని మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కురిచేడు మండలం గంగదొనకొండ వద్ద ఒకవ్యాపారి శ్రీగంధం మొక్కలు వేసి ప్లాట్ల రూపంలో విక్రయించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు శ్రీగంధం మొక్కల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నమ్మబలికి సంబంధం లేని భూమిని రిజిస్టర్‌ చేశారు. ఆ మహిళ ఏడాది తర్వాత మొక్కలు చూసుకునేందుకు ఇక్కడకు రాగా అసలు విషయం బయటపడింది. రిజిస్ర్టేషన్‌ చేసిన భూమి వద్దకు వెళ్లగా ఇతరులు వచ్చి ఈ భూమి తమకు చెందిందని చెప్పటంతో ఆ మహిళ అవాక్కయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా అగ్రహారం వద్ద వేసిన అక్రమ లేఅవుట్ల వద్ద గొడవ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని విక్రయాలను నిలుపుదల చేశారు. దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ మండలాల్లో కూడా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సంబంధిత అధికారులు నోటీసులిచ్చినా వ్యాపారులు లెక్కచేయడం లేదు. తమకు ఏమీ కాదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఉన్నతాధికారులు ఏకారణం చేతనో ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. అక్రమ లేఅవుట్లకు సంబంధించి అప్రూవల్‌ చేసుకునేందుకు ఎవరూ దరఖాస్తులు చేసుకోలేదని అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అక్రమాలను కట్టడి చేయకుంటే ఇంకా అనేకమంది అమాయకులు మోసపోయే ప్రమాదముంది.

Updated Date - Aug 13 , 2026 | 02:57 AM