Share News

కరువుపై కదిలారు

ABN , Publish Date - Sep 23 , 2026 | 02:48 AM

ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం కదిలింది. సాధారణంగా సీజన్‌ ముగిశాక మొత్తం పరిస్థితిని అంచనా వేసి సహాయక చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభం నుంచి రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, ఆశించిన స్థాయిలో కృష్ణా నదిలో నీటి ప్రవాహం రాక పంటలు సాగు కాలేదు.

కరువుపై కదిలారు
ముండ్లమూరు మండలంలో ఎదుగుదల లేని కంది పంటను పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్న డీఏవో శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ సిబ్బంది

క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలకు ప్రభుత్వ ఆదేశం

కసరత్తు ప్రారంభించిన వ్యవసాయ శాఖ.. జిల్లా మొత్తం గుర్తింపు

మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికలు రూపొందిస్తున్న అధికారులు

నెలాఖరుకు కరువు ప్రాంతాలను ప్రకటిస్తానన్న మంత్రి అచ్చెన్నాయుడు

ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం కదిలింది. సాధారణంగా సీజన్‌ ముగిశాక మొత్తం పరిస్థితిని అంచనా వేసి సహాయక చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభం నుంచి రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, ఆశించిన స్థాయిలో కృష్ణా నదిలో నీటి ప్రవాహం రాక పంటలు సాగు కాలేదు. జిల్లాలోనూ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాలను గుర్తించి రబీ ఆరంభం నుంచే ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుకు అవసరమైన ఇన్‌పుట్స్‌ అందజేత, ఇతర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒంగోలు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కరువు నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో కరువు ప్రాంతాలను ప్రకటించి సహాయక చర్యలు చేపడితే ఈ వర్షాల అనంతరం రైతులు పంట సాగుకు ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రాథమికంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రభుత్వ స్థాయిలో పరిశీలించి మండలాల వారీగా ఎక్కడ కరువు తీవ్రత ఎలా ఉందో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఆ జాబితాలను జిల్లా లకు పంపించి వాటి ఆధారంగా క్షేత్రస్థాయి లో పరిస్థితులను పరిశీలించి పంటల సాగు, దిగుబడులపై ప్రభావం, ఇతరత్రా వివరా లతో నివేదికలను కోరింది. ఆ మేరకు ఆదేశా లు రెండు రోజుల క్రితం జిల్లా అధికారులకు అందాయి. తదనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థి తులపై వ్యవసాయ శాఖ అధికారులు పరి శీలన ప్రారంభించారు.

మొత్తమంతా తీవ్రంగానే కరువు

ప్రభుత్వం నుంచి వర్షపాతం నమోదు ఆధారంగా అందిన వివరాల ప్రకారం సింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లో మధ్యస్థంగా.. ఇతర అన్ని మండలాల్లో తీవ్రంగా కరువు ఉన్నట్లు సమాచారం. ఆయా మండలాల్లో 10శాతం గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అలాగే ఆ గ్రామాల్లో కనీసం ఐదు సర్వేనెంబర్లలో సాగైన పంటలను చూసి వాటి దిగుబడులను అంచనా వేయాలి. గతంలో ఆ గ్రామంలో సదరు పంట సాగైనప్పుడు వచ్చిన ఉత్పత్తిలో ఈసారి 33శాతం కన్నా తక్కువగా ఉంటే కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారు. అసలు పంటలు సాగు కాకపోయినా కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారు. జిల్లాలో పరిస్థితి చూస్తే ఏ ఒక్క ప్రాంతంలోనూ పంటలు ఈ సీజన్‌లో సరిగా సాగు కాలేదు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 55,774 హెక్టార్లు కాగా కేవలం 18శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. అంటే పదివేల హెక్టార్లలో కూడా పైర్లు పడలేదు. ప్రధానమెట్ట పంటలలో కంది 9.86శాతం, పత్తి 6.53శాతం, మొక్కజొన్న 54శాతం, సజ్జ 30శాతం, వరి 29శాతం విస్తీర్ణంలో సాగు కాగా వర్షాలు లేక అన్ని పంటలు ఎండిపోయి దిగుబడులు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. సోమ, మంళవారాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన పరిశీలనల్లోనూ ఇదే విషయాన్ని గుర్తించినట్లు సమాచారం.

18 మండలాల్లో తీవ్రం.. 10 చోట్ల మధ్యస్తం

జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై వ్యవసాయశాఖ ఒక అంచనాకు వచ్చింది. మొత్తం 28 మండలాలు జిల్లాలో ఉండగా 18 మండలాల్లో కరువు తీవ్రంగా, మరో 10 చోట్ల మధ్యస్తంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ సీజ న్‌లో నమోదైన వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి అంచనాలను పరిగణనలోకి తీసుకొని వాటిని అలా అంచనా వేశారు. తదనుగుణంగా ప్రభుత్వానికి కలెక్టర్‌ ద్వారా నివేదించనున్నారు. తీవ్ర కరువుగా గుర్తించిన మండలాల్లో మర్రిపూడి, కొండపి, మద్దిపాడు, పొన్నలూరు, సింగరాయకొండ, ఎస్‌ఎన్‌పాడు, తాళ్లూరు, జరుగుమల్లి, గుడ్లూరు, దర్శి, చీమకుర్తి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, టంగుటూరు, కందుకూరు, వీవీపాలెం, ఒంగోలు రూరల్‌, అర్బన్‌ ఉన్నాయి. మధ్యస్థంగా ఉలవపాడు, గుడ్లూరు, సంతమాగులూరు, అద్దంకి, బల్లికురవ, జె.పంగులూరు, కొత్తపట్నం, కొరిశపాడు, లింగసముద్రం మండలాలు ఉన్నాయి.

వచ్చేనెల 1న కరువు మండలాల ప్రకటన

జిల్లావ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితి ఉన్న విషయాన్ని నిర్ధారించుకున్న వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించగా మండలాల వారీ వివరాలను అందులో ఇప్పటికే మండల స్థాయి అధికారులు నమోదు చేశారు. వాటిని జిల్లాస్థాయిలో క్రోడీకరించి కరువుపై సమగ్ర నివేదికను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి వ్యవసాయశాఖ అధికారులు పంపించనున్నారు. ఇదిలాఉండగా వచ్చే నెల 1న రాష్ట్రంలో కరువు ప్రాంతాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వెల్లడించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులో ఆధునికీకరించిన పీడీసీసీ బ్యాంకు భవనాన్ని ప్రారంభించారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు వచ్చిందని దాని నుంచి రైతులను, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 02:48 AM