Share News

అలా వదిలేశారు!

ABN , Publish Date - Mar 08 , 2026 | 03:38 AM

మార్కెట్‌లో ధాన్యం ధరలు ఒక్కసారిగా దిగజారాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నిలిపివేయడంతో ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. సివిల్‌ సప్లయీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్లను ఫిబ్రవరి 21 నుంచి నిలిపివేశారు.

అలా వదిలేశారు!
కల్లాల్లో ధాన్యాన్ని బస్తాలకు ఎత్తుతున్న కూలీలు

రబీ పంట గురించి పట్టించుకోని అధికారులు

దిగజారిన ధాన్యం ధరలు

సివిల్‌ సప్లయీస్‌ కేంద్రాల్లో నిలిచిపోయిన కొనుగోళ్లు

ఇదే అదనుగా తగ్గించి కొంటున్న వ్యాపారులు

ఆందోళన చెందుతున్న రైతులు

భారీగా నష్టాలు

మార్కెట్‌లో ధాన్యం ధరలు ఒక్కసారిగా దిగజారాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నిలిపివేయడంతో ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. సివిల్‌ సప్లయీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్లను ఫిబ్రవరి 21 నుంచి నిలిపివేశారు. రబీ సీజన్‌లో పండిన పంట గురించి ఇంకా నిర్ణయం తీసుకోకపో వడం అందుకు కారణమైంది. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వారు చెప్పిన ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

దర్శి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొను గోలు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 21 నాటికి 13,840 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో దర్శి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో ఏడువేల టన్నులు సేకరించారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఆరంభించిన ఈ కొనుగోలు కేంద్రాలు ఫిబ్రవరి 21 నుంచి నిలిచిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ఖరీఫ్‌ సీజన్‌లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయకముందు ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసిన విషయం విదితమే. కేంద్రాలు ఆరంభించిన తర్వాత ఊహించని విధంగా ధరలు పెంచారు.

దగా చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు

ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ రకం ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,792, సాధారణ రకం రూ.1,777 మద్దతు ధరగా నిర్ణయించింది. ఖరీఫ్‌లో కేంద్రాల్లో ఆమేరకు కొనుగోలు చేశారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు కూడా అదే ధర ఇచ్చారు. ఇప్పుడు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు మళ్లీ రైతులను దగా చేస్తున్నారు. సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ప్రతిసారీ కేంద్రాల ఏర్పాటులో తీవ్రజాప్యం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం ప్రైవేటు వ్యాపారులకు వరంగా మారుతోంది. ప్రస్తుతం రబీ సీజన్‌లో పండించిన సాధారణ రకం ధాన్యాన్ని వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఎంటీయూ 1010 రకాన్ని రూ.1,400, ఎంటీయూ 1156 రకాన్ని రూ.1400, సీఆర్‌ 1009 రకాన్ని రూ.1300కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సాధారణ రకానికి ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.1,777కు కొనుగోలు చేయాల్సి ఉండగా బస్తాకు రూ.300 పైగా తగ్గించి ఇస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

కేంద్రాల్లో కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

రబీ సీజన్‌లో పండిన ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ఖరీఫ్‌ సీజన్‌లో ప్రారంభించిన కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తారా, లేక మళ్లీ తాజా ఉత్తర్వులతో ఆరంభిస్తారా అన్న విషయంపై స్పష్టత లేదు. ఖరీఫ్‌ సీజన్‌ కొనుగోళ్లు పూర్తవడంతో ప్రస్తుతం కొనుగోళ్లు నిలిపివేశామని నిర్వాహకులు చెబుతున్నారు. రబీ సీజన్‌లో పంట ముమ్మరంగా రైతులు ఇళ్లకు చేరుతున్నప్పటికీ సివిల్‌ సప్లయీస్‌ అధికారులు నిర్లక్ష్యవైఖరి అవలంబించటం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని గుర్తించి కేంద్రాల్లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 03:38 AM