అలా వదిలేశారు..!
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:39 PM
గత వైసీపీ పాలనలో సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ కమిటీలతో కాలం వెళ్లబుచ్చారు. దీంతో నాటి నామినేటెడ్ పాలక మండళ్లు, ఆయా సంస్థల పర్యవేక్షణాధికారులు ఇష్టానుసారం వ్యవహరించారు.
విచారణలు చేయరు.. చర్యలు తీసుకోరు!
వైసీపీ పాలనలో సహకార సంస్థల్లో భారీగా అక్రమాలు, అవకతవ కలు
ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కొన్ని వెలుగులోకి..
విచారణలకు ఆదేశం
ఉన్నతాధికారుల తీరుతో నీరుగారుతున్న వైనం
నేటికీ సహకారశాఖలో నాటి అధికారులదే హవా
ఎంక్వయిరీలపైనా వారిదే పరోక్ష పెత్తనం
అడుగు ముందుకు పడని డీసీసీబీలో సెక్షన్ 51
కోల్ సొసైటీపైనా కాలయాపన
డీసీఎంఎ్‌సలోనూ అదే తీరు
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న పాలకపక్ష పెద్దలు
ఒంగోలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ కమిటీలతో కాలం వెళ్లబుచ్చారు. దీంతో నాటి నామినేటెడ్ పాలక మండళ్లు, ఆయా సంస్థల పర్యవేక్షణాధికారులు ఇష్టానుసారం వ్యవహరించారు. విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడి భారీగా దోచేశారు. ఈ వ్యవహారాల్లో కొందరు ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషించారు. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు పసిగట్టి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన సహకారశాఖ జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. తమ వాటాలు తాము పొంది అక్రమాలకు ఊతం ఇచ్చేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
డీసీసీబీలో భారీగా దోచేశారు!
అత్యంత కీలకమైన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో గత వైసీపీ పాలనలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్నది నిర్వివాదాంశం. ఈ విషయాన్ని 2024-25లోనే జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై జిల్లాలో, రాష్ట్రంలో పెద్ద రచ్చే జరిగింది. చివరకు ఉన్నతాధికారులు సీఎంవో ఆదేశాలతో తలొగ్గి ప్రాథమిక విచారణ చేయించాలని నాటి కలెక్టర్ అన్సారియాకు సూచించారు. అప్పట్లో ఆమె ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించారు. ఆ కమిటీ సమగ్ర విచారణ చేసి అనేక అవినీతి, అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇచ్చింది. సుమారు రెండు వేల పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి 2024 నవంబరులో అప్పటి కలెక్టర్ అన్సారియా పంపించారు. తక్షణం సెక్షన్ 51 విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి అధికారులు కాలయాపన చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు, ఇతర రూపాలలో ఒత్తిళ్లతో గత ఏడాది ఫిబ్రవరిలో సెక్షన్ 51 విచారణకు ఆదేశాలు ఇచ్చారు. నేటికీ ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాలేదు.
డీసీఎంఎ్‌సలో రూ.3.50కోట్లు స్వాహా
డీసీఎంఎ్‌సలోనూ నాటి వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల స్వాహా జరిగింది. పర్యవేక్షించాల్సిన అప్పటి సహకారశాఖ అధికారులు వాటాలు తీసుకొని వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.3.50 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నట్లు గతంలోనే ఆడిటర్లు గుర్తించారు. అప్పట్లో ఒకసారి 51 విచారణ చేపట్టగా నాటి విచారణాధికారులు అక్రమాలను కప్పిపుచ్చారు. తిరిగి అందిన ఫిర్యాదులతో గత నెలలో మరోసారి ప్రస్తుత కలెక్టర్ రాజాబాబు సెక్షన్ 51 విచారణకు ఆదేశించారు. అది కూడా ముందుకు సాగడం లేదు.
కోల్ సొసైటీలో అనుమతులు లేకుండానే అన్నీ..
రాష్ట్రస్థాయి సంస్థగా, ఒంగోలు కేంద్రంగా ఉన్న కోల్ సొసైటీది మరో కథ. సహకారశాఖ అధికారులు అనుమతులు, పర్యవేక్షణలు లేకుండా ఏకంగా రెండు విడతలు ప్రైవేటు అధికారి నేతృత్వంలో ఎన్నికలు జరిగి పాలకవర్గం ఎన్నికైనట్లు రికార్డులు సృష్టించుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయాల డిపాజిట్లు విత్‌డ్రా చేసుకున్నారు. కొత్తగా బ్యాంకులో రుణాలు తీసుకొని భవనాలు నిర్మించి ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చారు. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన నాటి సహకారశాఖ అధికారులు అందిన కాడికి దండుకొని మిన్నకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్ చేసిన వారు విషయాన్ని గుర్తించి నివేదించినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా కోల్ సొసైటీపై కొందరు హైకోర్టును అశ్రయించడంతో ఉన్నతస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సహకారశాఖ అధికారులు కదిలారు. ప్రస్తుతం కూడా అక్రమాలు నిగ్గు తేల్చే విధంగా కాకుండా కాలయాపన చేసేలా వారి చర్యలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముందుకు సాగని సెక్షన్ 51 విచారణ
డీసీసీబీపై విచారణాధికారి నియామకం విషయంలో హైడ్రామా నడిచింది. విచారణలో కఠినంగా వ్యవహరిస్తారన్న పేరున్న అధికారిని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సూచించగా కాలయాపన చేసి తాము చెప్పినట్లు నడుచుకునే అధికారిని నియమితులుగా చేసుకోవడంలో నాటి వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సహకారశాఖ అధికారులు సఫలమయ్యారు. ఫలితంగా డీసీసీబీలో ప్రారంభించిన సెక్షన్ 51 విచారణ అడుగు ముందుకు పడటం లేదు. నాలుగు మాసాలలో విచారణ పూర్తి చేయాలని తొలుత ఆదేశించి మరో రెండు నెలలు పొడిగించినా ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. నాటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని విమర్శలు ఎదుర్కొంటున్న బ్యాంకులోని ఉద్యోగుల కనుసన్నల్లోనే విచారణ ప్రక్రియ సాగుతుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.