బరితెగించారు!
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:08 AM
గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు భూముల్లో చేపల చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. రిజర్వాయర్ ఒడ్డున ఉన్న తమ్మవరం, అనమనమూరుల్లో పెద్దఎత్తున వీటిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సుమారు 80 ఎకరాల్లో పనులు జరుగుతు న్నాయి.
గుండ్లకమ్మ ముంపు భూముల్లో యథేచ్ఛగా చేపల చెరువులు
ఎత్తిపోతల పథకాల నుంచి నీళ్లు
ఇప్పటికే అక్రమంగా 400 ఎకరాల్లో సాగు
మేతగా కోళ్లవ్యర్థాల వినియోగం
కాలుష్యనీరంతా రిజర్వాయర్‌లోకి..
కన్నెత్తిచూడని అధికారులు
మేదరమెట్ల, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు భూముల్లో చేపల చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. రిజర్వాయర్ ఒడ్డున ఉన్న తమ్మవరం, అనమనమూరుల్లో పెద్దఎత్తున వీటిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సుమారు 80 ఎకరాల్లో పనులు జరుగుతు న్నాయి. భారీ ఎక్స్‌కవేటర్‌లతో రెండు నెలల నుంచి పనులు చేస్తున్నప్పటికీ ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఎర్రబాలెం, అనమనమూరు, తమ్మవరం, మణికేశ్వరం గ్రామాల్లో గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను ఆనుకొని దాదాపు 400 ఎకరాలలో చేపల చెరువులు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు ప్రాంతం నుంచి వలస వచ్చిన కొందరు మత్స్యకారులు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని లక్షలు వెచ్చించి ముంపు భూములలో చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. ముంపులో భూములు కోల్పోయిన రైతుల వద్ద ఎకరాకు రూ.30 వేలు కౌలు ఒప్పందం చేసుకుంటున్నారు. కొందరు గుండ్లకమ్మలో కూడా చెరువులు తవ్వుతున్నారు. ఇప్పటికే ఉన్న చెరువుల్లో చుట్టు పక్కల పట్టణాల నుంచి కోళ్ల వ్యర్థాలను తెచ్చి చేపలకు మేతగా వేస్తున్నారు. చేపలు పట్టే సమయంలో ఈ చెరువులలోని నీటిని గుండ్లకమ్మ రిజర్వాయర్‌లోకి వదిలేస్తున్నారు. ఒంగోలు పట్టణంతోపాటు 140 గ్రామాలకు గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. ఇంత జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదు. కొత్తగా వేసిన చెరువులలో కొన్నింటిని వ్యవసాయ భూములకు సాగు నీరు అందించే ఎత్తిపోతల పథకాల నుంచి నింపుతున్నారు. సాగునీటి పథకాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉన్నందున ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రిజర్వాయర్ పొడవునా ఉన్న యర్రబాలెం, అనమనమూరు, తమ్మవరం, మణికేశ్వరం తదితర గ్రామాలలో అక్రమంగా నిర్మించిన చేపల చెరువులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.