శిక్షణ ఇచ్చారు.. మిషన్లు మరిచారు...!
ABN , Publish Date - Mar 09 , 2026 | 10:57 PM
మహిళలు స్వయంశక్తితో ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి సుమారు ఏడాది కావస్తున్నా మిషన్లు మంజూరు చేయడంలో అధికారులు విస్మరించారు.
మూడు నెలల టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 350 మంది మహిళలు
అవి పంపిణీ చేస్తేనే జీవనోపాధికి మార్గమంటున్న వైనం
పామూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : మహిళలు స్వయంశక్తితో ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి సుమారు ఏడాది కావస్తున్నా మిషన్లు మంజూరు చేయడంలో అధికారులు విస్మరించారు. పామూరు వెలుగు కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం(టైలరింగ్)సెంటర్‌ను గత ఏడాది జూలైలో ప్రారంభించారు. రెండు విడతలుగా సుమారు 350 మంది మహిళలు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందారు. మూడు నెలల శిక్షణ కాలం పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కార్పొరేషన్ ద్వారా కుట్టుమిషన్లు మంజూరు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని మహిళలు వాపోతున్నారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు పెద్దఎత్తున కుట్టుమిషన్లపై శిక్షణ ఇచ్చి పరికరాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అందుకు అర్హతున్న మహిళల నుంచి గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వారికి మూడు నెలలపాటు ప్రత్యేక క్యాంపు పెట్టి శిక్షణ ఇచ్చింది. కుట్టుశిక్షణ నేర్పించిన శిక్షకురాలికి సైతం నేటికి జీతం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయంపై మహిళలు ఎంపీడీవోను పలుమార్లు అడిగినా దాటవేత సమాధానం తప్పా సమస్యను పరిష్కరించే వారే కరువయ్యారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థికంగా బలపడాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం శిక్షణ ఇవ్వడం బాగున్నా మిషన్లను అందజేసినప్పుడే తమకు జీవనోపాధి లభిస్తుందని చెబుతున్నారు. ఈ విషయంపై బీసీ వెల్ఫేర్ ఈడీని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, ప్రభుత్వం మిషన్లు మంజూరు చేశాక పంపిణీ చేస్తామని చెప్పారు.