Share News

నమ్మి మోసపోయారు!

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:02 AM

వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మి సొంతిల్లు వస్తుందని ఆశపడి మోసపోయిన పేదలు నేడు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా భూకబ్జాలు చేయడం, వాటిని అమాయకులకు అంటగట్టడం యథేచ్ఛగా జరిగిపోయాయి. తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు అంటూ ఎరవేసి మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ. 3లక్షలు వసూలు చేసి, ఆపై మాయమయ్యారు. సిట్‌ అరెస్టులతో కొందరు జైలుపాలు కాగా, కొందరు తప్పించుకుతిరుగుతున్నారు. తీరా అసలు యజమానులు సీన్‌లోకి రావడంతో అక్రమాల బాగోతం బయటపడింది. ప్రస్తుతం ఒంగోలుకు ఉత్తరం వైపున కార్మికనగర్‌ పేరుతో ప్రైవేటు భూముల్లో వెలసిన ఇళ్లను హక్కుదారులు తొలగించడం ఇప్పడు వివాదంగా మారింది.

నమ్మి మోసపోయారు!
ఒంగోలులో కూల్చిన పేదల ఇళ్లు

వైసీపీ నిర్వాకం.. పేదలకు శాపం

తక్కువ ధరకు స్థలాల పేరుతో రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షలు వసూలు

భూఆక్రమణపై గతంలో సిట్‌ అరె్‌స్టలు

గృహాలు 60, నివసించేది 15 కుటుంబాలు

భూమి హక్కుదారులు రావడంతో వాస్తవం వెలుగులోకి..

వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మి సొంతిల్లు వస్తుందని ఆశపడి మోసపోయిన పేదలు నేడు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా భూకబ్జాలు చేయడం, వాటిని అమాయకులకు అంటగట్టడం యథేచ్ఛగా జరిగిపోయాయి. తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు అంటూ ఎరవేసి మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ. 3లక్షలు వసూలు చేసి, ఆపై మాయమయ్యారు. సిట్‌ అరెస్టులతో కొందరు జైలుపాలు కాగా, కొందరు తప్పించుకుతిరుగుతున్నారు. తీరా అసలు యజమానులు సీన్‌లోకి రావడంతో అక్రమాల బాగోతం బయటపడింది. ప్రస్తుతం ఒంగోలుకు ఉత్తరం వైపున కార్మికనగర్‌ పేరుతో ప్రైవేటు భూముల్లో వెలసిన ఇళ్లను హక్కుదారులు తొలగించడం ఇప్పడు వివాదంగా మారింది.

ఒంగోలు కార్పొరేషన్‌, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): ముక్తినూతలపాడు సర్వే నెం.185/1ఏ1, 186/1ఏ1లో 1986లో అప్పటి పంచాయతీ అధికారులు అధికారికంగా వెంచర్‌ వేసి, ప్లాట్లుగా అమ్మారు. ఒంగోలుతోపాటు విజయవాడ, నెల్లూరు, తెనాలి వంటి ప్రాంతాలకు చెందిన పలువురు వాటిని కొన్నారు. ఆయా ప్లాట్‌లు వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. 2018వ వరకు ఎలాంటి ఆక్రమణలు జరగలేదు. ఆ భూములపై2019 నుంచి 2023 మధ్య అంటే వైసీపీప్రభుత్వ హయాంలో కొందరి కన్నుపడింది. పేదలను ఆసరాగా చేసుకుని అక్రమంగా ఒక్కో ప్లాట్‌ను అమ్మకాలకు పెట్టారు. ప్లాట్‌కు రూ.2లక్షల నుం చి రూ.3లక్షల వరకు వసూలు చేయడమే కా కుండా పట్టా లు ఇస్తామని నమ్మబలికారు. ఇదిలా ఉండగా, కొందరికి గతంలో ఒంగోలు తహసీల్దారుగా చేసిన చిరంజీవి పేరుతో ఫోర్జరీ చేసిన పట్టాలు కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఈ భూఆక్రమణపై సిట్‌ అరెస్టులు

వైసీపీ హయాంలో ఖాళీస్థలాలు కనిపిస్తే కబ్జాలు చేశారు. భూమి రికార్డులు ఉన్నా అడ్డగోలుగా మార్చేశారు. భూమి యజమానులు బతికి ఉండగానే చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. నకిలీ రిజిస్ట్రేషన్లతో ఇష్టారాజ్యంగా దోచుకోవడం అప్పట్లో చర్చనీయాంశం కాగా, దీనిపై ప్రభుత్వం ఆలస్యంగా సిట్‌ వేసింది. అందులోనూ ప్రస్తుతం కార్మికనగర్‌గా పిలుచుకునే స్థలం కూడా ఆక్రమణకు గురైనట్లు సిట్‌ బృందం గుర్తించింది. ఈక్రమంలో భూకబ్జాలలో 14 మంది ఉన్నట్లు గుర్తించగా, అందులో12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అందులో ఇద్దరు నేటికి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆ కేసులోని ఒకరిద్దరు రిమాండ్‌ నుంచి వచ్చాక కూడా ఇటీవల కాలంలో మరికొందరి వద్ద డబ్బులు తీసుకుని స్థలాలు కేటాయించినట్ల సమాచారం. ప్రస్తుతం తమ వద్ద డబ్బులు తీసుకున్న వారు పత్తా లేకపోవడంతోపాటు పేదల పరిస్థితి దయనీయంగా మారింది.

పత్తాలేని వైసీపీ నేతలు

ప్రస్తుతం కార్మికనగర్‌గా పిలుచుకునే స్థలంలో సుమారు 60కిపైగా రేకులషెడ్లు వెలిశాయి. కొన్ని శాశ్వతంగా, మరికొన్ని తాత్కాలికంగా నిర్మించుకుని ఉంటున్నారు. అక్కడ ప్రస్తుతం 15 కుటుంబాల వారు మాత్రమే పూర్తిస్థాయిలో నివసిస్తున్నారు. తమ భూములు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించిన హక్కుదారులు వాటిని తొలగించి, తమ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పేదల భూములు పెద్దలు కబ్జా చేస్తున్నారంటూ ప్రచారాన్ని మొదలుపెట్టగా, భూమి హక్కుదారులు ఆ భూమి తమదేనంటూ తాము కొనుగోలు చేసిన నాటి నుంచి రిజిస్ట్రేషన్‌, లింక్‌ డాక్యుమెంట్లు బయటపెట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంచితే.. స్థలాలు పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేసిన వ్యక్తులు ప్రస్తుతం పత్తా లేకుండా పోవడంతోపాటు, లక్షలు ఖర్చుచేసి ఇల్లు నిర్మించుకున్న నిరుపేదలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వైసీపీ నేతల మాయమాటలు నమ్మి మోసపోవడంతో ఇప్పుడు డబ్బులు నష్టపోయి, ఇల్లు కోల్పోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


గృహాలు 60, నివాసితులు 15 కుటుంబాలు

2019 నుంచి ఆ భూమిలో ప్రస్తుతం 60 వరకు ఇళ్లు నిర్మాణం జరగ్గా అందులో 15 కుటుంబాలు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. మిగిలిన వారికి నగరంలో ఇళ్లు ఉన్నాయి. అప్పడప్పుడూ వచ్చి తమ ఇంటిని చూసుకుని వెళుతుండగా, అందులో కొందరు మూడు నుంచి ఐదు ప్లాట్లను తమ స్వాధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. ప్రత్యేకించి ఓ వృద్ధురాలికి ఇప్పటికే నేతాజీనగర్‌లో ఇల్లు ఉండగా దానిని అమ్ముకుని మరీ ఇక్కడ స్థలం కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో గృహప్రవేశం కూడా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో వ్యక్తి టైలరింగ్‌గా పనిచేస్తూ, నేటికీ సొంతిల్లు లేకపోవడంతో రూ.2లక్షలకే స్థలం రావడంతో అప్పుచేసి, మరీ చెల్లించారు. ప్రస్తుత ఇల్లులేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారికిఎలాంటి పట్టాలు, ఆధారాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షలు గుంజుకున్నవారు నేడు పత్తా లేకుండాపోవడంతో నమ్మి మోసపోయామని బాధితులు కన్నీరుపెడుతున్నారు. తమను నమ్మించిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయలని కోరుతున్నారు.

Updated Date - Feb 08 , 2026 | 12:02 AM