అర మిలియన్ కూడా కొనడం లేదు!
ABN , Publish Date - Jul 11 , 2026 | 02:59 AM
దక్షిణాది పొగాకు మార్కెట్ నామమాత్రంగానే సాగుతోంది. నిత్యం వందలాది బేళ్లు వేలంకు వచ్చి సాయంత్రం వరకు హడావుడితో ఉండాల్సిన కేంద్రాలు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే వెలవెలబోతున్నాయి.
నామమాత్రంగా పొగాకు వేలం
రోజువారీ 0.40 నుంచి 0.49 మిలియన్ కిలోల లోపే కొనుగోలు
నోబిడ్‌లకు పడని బ్రేక్
నాలుగుచోట్ల 45శాతానికిపైగా బేళ్లు వెనక్కి
ఒంగోలు జూలై 10 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్ నామమాత్రంగానే సాగుతోంది. నిత్యం వందలాది బేళ్లు వేలంకు వచ్చి సాయంత్రం వరకు హడావుడితో ఉండాల్సిన కేంద్రాలు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే వెలవెలబోతున్నాయి. వచ్చే బేళ్లలో ఇంచుమించు సగం తిరస్కరణలు జరుగుతున్నాయి. వాటిలో 90శాతం అధికారులు సూచించిన ధరకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక నోబిడ్ అయ్యేవే ఉంటున్నాయి. నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పొగాకు వేలాన్ని పరిశీలిస్తే కొనుగోళ్లు ఎంత పేలవంగా ఉంటున్నాయో అర్థమవుతుంది. గత నాలుగు రోజుల్లో దక్షిణాదిలోని 11వేలం కేంద్రాల్లోనూ కలిపి రోజువారీ అర మిలియన్ కిలోల పొగాకు కూడా కొనుగోలు కాకపోవడం మార్కెట్ పరిస్థితిని పట్టిచూపుతోంది. ధరలు ఎలా ఉన్నా అసలు కొనుగోళ్లు సాగకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
మూడు నెలలైనా వేగం లేదు
ఈ సీజన్ వేలం ప్రారంభమై మూడు మాసాలు గడిచింది. మరో నెలరోజుల్లో వచ్చే సీజన్ పంట సాగుకు నార్లు పోస్తారు. ఇలాంటి సమయంలో సాధారణంగా ఒక్కో వేలం కేంద్రానికి రోజువారీ వెయ్యి బేళ్లకు తగ్గకుండా వస్తుంటాయి. వాటిలో 90శాతం కొనుగోళ్లు జరగడం, ఒక్కోచోట మధ్యాహ్నం మూడు గంటల వరకు వేలం ప్రక్రియ కొనసాగుతూ హడావుడి వాతావరణం ఉంటుంది. అలా రోజుకు దక్షిణాదిలో సుమారు ఒకటిన్నర మిలియన్ కిలోల పంట కొనుగోలు జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏఒక్క వేలం కేంద్రంలోనూ ఆ పరిస్థితి లేదు. కొనుగోళ్లు నామమాత్రంగానే ఉంటున్నాయి. దక్షిణాదిలోని 11 కేంద్రాలు కలిపి ఈ వారంలో సోమవారం మినహా ఒక్క రోజు కూడా ఐదువేల బేళ్లు వేలంకు అనుమతించిన పరిస్థితి లేకపోగా వచ్చిన వాటిలోనూ సగం రకరకాల కారణాలతో వెనక్కి వెళ్తున్నాయి. దీంతో అర మిలియన్ కిలోల పంట కూడా కొనుగోలు జరగడం లేదు. ఈనెల 6న రెండు రీజియన్లలోని 11 కేంద్రాలకు కలిపి 6,460 బేళ్లను వేలానికి తీసుకురాగా 3,984ను కొనుగోలు చేశారు. 2,476 బేళ్లు 38.32శాతం తిరస్కరణలు జరిగాయి. అలా ఆ రోజున 0.53 మిలియన్ కిలోల కొనుగోలు జరిగింది.
నామమాత్రంగా కొనుగోళ్లు
మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఒక్క రోజు కూడా ఐదువేల బేళ్లు వేలంకు తెచ్చిన పరిస్థితి లేకపోగా వస్తున్న వాటిలో 40శాతం వెనక్కి వెళ్తున్నాయి. దీంతో కొనుగోళ్లు నామమాత్రంగా మారాయి. మంగళవారం 0.44 మిలియన్లు, బుధవారం 0.47 మిలియన్ కిలోల కొనుగోలు జరగ్గా గురు, శుక్రవారాల్లో మరింత తగ్గింది. ఈ రెండు రోజులు సగటున 0.40 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ ప్రకారం చూస్తే సోమవారం 5.30లక్షల కిలోలు కొనుగోలు చేస్తే గురు, శుక్రవారాల్లో నాలుగు లక్షల కిలోల వంతున మాత్రమే కొన్నారు. మరోవైపు నోబిడ్‌లకు ఏమాత్రం బ్రేక్‌లు పడటం లేదు. శుక్రవారం మార్కెట్‌లో కూడా 32శాతం నోబిడ్ అయ్యాయి. అది ఎస్‌బీఎస్ రీజియన్‌లో ఇంచుమించు 40శాతంగా ఉంది. అత్యధికంగా టంగుటూరులో 53.18శాతం నోబిడ్ కాగా ఒంగోలు-2లో 50శాతం, వెల్లంపల్లిలో 48.93శాతం, కనిగిరిలో 45.66శాతం, ఒంగోలు-1లో 35.87శాతం, కందుకూరు-2లో 33.43శాతం నోబిడ్ అయ్యాయి. ధరలు తగ్గి గిట్టుబాటు కాక దిగాలు చెందుతున్న రైతులకు అసలు కొనుగోలు జరగకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.