Share News

నాడిపట్టే వారేరి!

ABN , Publish Date - May 07 , 2026 | 02:39 AM

ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని గిరిజనులకు వైద్య సేవలు అందడం లేదు. నాడిపట్టి చూసే నాథుడు కరువయ్యాడు. ముఖ్యంగా మండల కేంద్రానికి సుమారు 60 కి.మీ దూరంలో ఉన్న పాలుట్ల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.

నాడిపట్టే వారేరి!
వైద్యం అందడంలేదంటూ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేస్తున్న గిరిపుత్రులు (ఫైల్‌)

పాలుట్లకు 40కి.మీ దూరంలో పీహెచ్‌సీ

చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్న వైద్యులు

అప్పుడప్పుడూ క్యాంపులకే పరిమితం

అత్యవసరం అయితే 60కి.మీ దూరంలోని ఎర్రగొండపాలెంకు రావాల్సిందే..

మరికొన్ని తండాల్లోనూ అదే పరిస్థితి

పట్టించుకోని అధికారులు

ఐటీడీఏ పీవో, ఎస్టీ కమిషన్‌ ముందు ఇటీవల గోడువెళ్లబోసుకున్న గిరిపుత్రులు

శ్రీశైలం ఐటీడీఏ పీవో పీవీఎస్‌ నాయుడు గత నెల 16వ తేదీన తన సిబ్బందితో కలసి ఎర్రగొండపాలెం మండలంలోని నెక్కంటి, ఇష్టకామేశ్వరి, పాలుట్ల గూడేల పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. చెంచు, ఇతర గిరిజన కుటుంబాలతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లోని గిరిపుత్రులు తమకు వైద్యం అందడంలేదని మొరపెట్టుకున్నారు. డాక్టర్లు రావడం లేదని, మందులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సొల్లా బొజ్జిరెడ్డితోపాటు సభ్యులు గతనెల 26తేదీన పాలుట్ల గిరిజన గూడెంను సందర్శించారు. అక్కడే రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా గిరిపుత్రులు ప్రధానంగా వైద్యం సమస్యను ప్రస్తావించారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వారు లేరని వాపోయారు.

ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని గిరిజనులకు వైద్య సేవలు అందడం లేదు. నాడిపట్టి చూసే నాథుడు కరువయ్యాడు. ముఖ్యంగా మండల కేంద్రానికి సుమారు 60 కి.మీ దూరంలో ఉన్న పాలుట్ల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ గూడేనికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైనప్పటికీ అది దాదాపు 40కి.మీ దూరంలోని గంజివారిపల్లిలో ఉంటుంది. పాలుట్ల గిరిజనులు అక్కడికి వచ్చి వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి నెలకొంది. అత్యసరమైతే ఎర్రగొండపాలెం రావాల్సి వస్తోంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, అటవీమార్గం కావడంతో కనీసం ఐదు గంటలు సమయం పడుతోంది. దీంతో అత్యవసర చికిత్స అందక మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇతర గూడేల్లోనూ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి సరైన వైద్యం, మందులు అందక అల్లాడుతున్నారు.

ఎర్రగొండపాలెం రూరల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పాలుట్ల పంచాయతీలో 450 కుటుంబాలు ఉన్నాయి. అందులో 300 కుటుంబాలు చెంచులు, 150 కుటుంబాలు సుగాలీలు ఉంటారు. వీరికి వైద్యం అందడం గగనంగా మారింది. విష జ్వరాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది. పాలుట్ల గిరిజన గూడేనికి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మంజూరు చేసినప్ప టికీ అక్కడికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దాన్ని 40 కి.మీ దూరంలో ఉన్న గంజివారి పల్లెలో ఏర్పాటు చేశారు. ఇద్దరు వైద్యులు, 10 మంది సిబ్బందిని కేటాయించారు. అయితే వారు మొక్కుబడిగానే సేవలు అందిస్తున్నారు. వైద్యులు కార్యస్థానంలో కాకుండా ఎర్రగొండ పాలెంలో ఉంటున్నారు. చుట్టపుచూపుగా పీహెచ్‌సీకి వచ్చి వెళ్తున్నారు. గంజివారిపల్లిలో ఏర్పాటు చేసిన పాలుట్ల పీహెచ్‌సీ పరిధిలోకి పాలుట్లతోపాటు నెక్కంటి, పొన్నలబైలు, ఇష్టకామేశ్వరి గిరిజన గూడేలు వస్తాయి. వీటి పరిధిలో విస్తృంగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించాల్సిన వైద్యాధికారులు మొక్కుబడిగా ఇకట్రెండు గూడేల్లో ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారు. పాలుట్లలో నెలకు ఒక్క శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గిరిజన గూడేల్లో క్షయ కేసులు అధికంగా ఉంటాయి. దీనికితోడు అక్కడి జనం తరచూ విషజ్వరాల బారినపడుతుంటారు. సకాలంలో వారికి వైద్యం అందకపోవడంతో రోజుల తరబడి మంచానికి పరిమితమవుతున్నారు. క్షయ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

అత్యవసరమైతే ఎర్రగొండపాలెంకు..

పాలుట్లలోని చెంచులు, సుగాలీలు అత్యవసర వైద్యం అవసరమైతే 60కి.మీ దూరంలో ఉన్న ఎర్రగొండపాలెం వైద్యశాలకు రావాల్సి వస్తోంది. ఆ గూడెం నుంచి అటవీమార్గంలోనే ప్రయాణించాలి. వాహన సౌకర్యం అసలు ఉండదు. దీంతో ఒకరిద్దరి వద్ద ఉన్న జీపుల్లోనో, ట్రాక్టర్లలోనో వైద్యశాలకు తరలిస్తున్నారు. అందుకు సుమారు ఐదు గంటలపైనే సమయం పడుతోంది. దీంతో అత్యవసర చికిత్స అందక మార్గమధ్యంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మూడు జిల్లాలకు ఒకటే జీపు

ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని నల్లమల అటవీప్రాంతంలో ఉన్న గిరిజన గూడేలకు ఐటీడీఏ అధికారులు ఒక జీపును కేటాయించారు. దాన్ని ఎర్రగొండపాలెంలో ఉంచారు. మూడు జిల్లాల్లోని చెంచు గూడేలలో ఎక్కడ ఎవరికి ఏ అత్యవసరం వచ్చినా సమాచారం ఇస్తే ఈ ఒక్క వాహనమే దిక్కయ్యింది. ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. ఈనేపథ్యంలో గతంలో ఐటీడీఏ, మాజీ ఎంపీ కలిసి పాలుట్లకు ప్రత్యేక వాహనం ఇచ్చారు. డీజిల్‌, డ్రైవర్‌కు జీతం ఇచ్చేందుకు నిధులు లేకపోవడంతో ఆ వాహనాన్ని ప్రస్తుతం ఒంగోలులోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి తరలించారు. దాతలు ముందుకు వచ్చి వాహనాన్ని సమకూర్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు వైద్యశాఖపై వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పాలుట్లకు సరైన వైద్యసేవలు అందించాలని పాలుట్ల,, ఇతర ప్రాంతాల చెంచు గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - May 07 , 2026 | 02:39 AM