కొల్లగొడుతున్నారు!
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:14 AM
ఒంగోలు మండలం యరజర్ల పరిధిలోని కొండను గ్రావెల్ మాఫియా గుల్ల చేస్తోంది. అక్రమంగా తవ్వకాలు చేసి తరలిస్తోంది. దీంతో ఒంగోలు, కొత్తపట్నం గ్రామాలకు తాగునీటి సరఫరా జరిగే సాగర్ కాలువ కట్ట ధ్వంసమవుతోంది. ఈ విషయంపై ఇరిగేషన్‌శాఖ అధికారులు సాగర్ కాలువ కట్టపై గ్రావెల్ టిప్పర్లు తిరగకుండా ఉండేందుకు కందకాలు తవ్వారు.
యరజర్ల కొండ నుంచి జోరుగా గ్రావెల్ అక్రమ రవాణా
సాగర్ కాలువపై నుంచి రాకపోకలు
పూర్తిగా దెబ్బతింటున్న కట్ట
అధికారులు కందకాలు తీయించినా పూడ్చివేసిన అక్రమార్కులు
ఇరిగేషన్‌శాఖ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఒంగోలు(రూరల్), జనవరి24(ఆంధ్రజ్యోతి): ఒంగోలు మండలం యరజర్ల పరిధిలోని కొండను గ్రావెల్ మాఫియా గుల్ల చేస్తోంది. అక్రమంగా తవ్వకాలు చేసి తరలిస్తోంది. దీంతో ఒంగోలు, కొత్తపట్నం గ్రామాలకు తాగునీటి సరఫరా జరిగే సాగర్ కాలువ కట్ట ధ్వంసమవుతోంది. ఈ విషయంపై ఇరిగేషన్‌శాఖ అధికారులు సాగర్ కాలువ కట్టపై గ్రావెల్ టిప్పర్లు తిరగకుండా ఉండేందుకు కందకాలు తవ్వారు. అయినా లెక్కచేయని గ్రావెల్ మాఫియా ఆయా కందకాలు పూడ్చివేసి యాథావిధిగా తమ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఒంగోలు మండలం యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, టంగుటూరు మండలంలోని కొణిజేడు గ్రామాల పరిధిలో కొండ ఉంది. దీని చుట్టూ ఉన్న భూముల్లో అక్రమంగా గ్రావెల్ క్వారీయింగ్ చేసి ఒంగోలు నగరపరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు భారీగా తరలిస్తున్నారు. వాహనాల రాకపోకలకు సాగర్ కాలు వకట్టను ఎంచుకున్నారు. నిబంధనల ప్రకారం కాలువ కట్టపై గ్రావెల్ టిప్పర్లు తిరిగేందుకు అనుమతి లేదు. దీనిపై ఇరిగేషన్ అధికారులు టంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి రోజూ సుమారు 200 టిప్పర్లు గ్రావెల్‌తో తిరుగుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం మట్టి తవ్వకాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అయితే ఇక్కడ ఎలాంటి నిబంధనలు అమలు కావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.