Share News

చినుకు.. కినుక

ABN , Publish Date - Jul 21 , 2026 | 03:16 AM

జిల్లాలో చినుకు జాడ కరువైంది. కీలక సమయంలో పంటల సాగు ముందుకు కదలనంటోంది. ఉష్ణోగ్రతలు దడపుట్టించే స్థాయి నుంచి నాలుగైదు డిగ్రీలు తగ్గడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజానీకానికి వరుణుడు మాత్రం నిరాశనే కలిగిస్తున్నాడు.

చినుకు.. కినుక
మద్దిపాడు సమీపంలో దుక్కులు కూడా దున్నని పొలం

ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం

నెలన్నర గడిచినా 4 శాతమే పైర్లు

తొలకరి పైర్లకు ముగిసిన గడువు

పశుగ్రాసం కూడా వేయలేని దుస్థితి

కంది, పత్తి వంటి కీలక మెట్ట పంటలకూ ప్రతికూలమే

జిల్లాలో చినుకు జాడ కరువైంది. కీలక సమయంలో పంటల సాగు ముందుకు కదలనంటోంది. ఉష్ణోగ్రతలు దడపుట్టించే స్థాయి నుంచి నాలుగైదు డిగ్రీలు తగ్గడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజానీకానికి వరుణుడు మాత్రం నిరాశనే కలిగిస్తున్నాడు. నాలుగైదు రోజులుగా ఎక్కువ సమయం ఆకాశం మబ్బులు పట్టి ఆశలు రేకెత్తిస్తుండటం తప్ప చినుకు రాలడం లేదు. సాధారణంగా ఈ సమయంలో చిరుజల్లులు పడుతూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. అలాంటిది ఈనెలలో ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా జిల్లాలో మంచి వర్షం కురిసిన దాఖలాలు లేవు. ఆ ప్రభావం ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్రంగా పడింది. పంటల సాగు పడకేసింది.

ఒంగోలు, జూలై 20 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో ఎండల తీవ్రత తగ్గినప్పటికీ చినుకు రాలనంటోంది. గత వారంలో అత్యధిక ప్రాంతాల్లో ఏకంగా 40 డిగ్రీలకుపైన గరిష్ఠ ఉష్ణోగ్రతల నమోదుతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు నాలుగైదు రోజులుగా మారిన వాతావరణంతో కాస్తంత ఉపశమనం పొందారు. అయితే ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమై నెలన్నర గడిచినా పట్టుమని పది శాతం విస్తీర్ణంలో కూడా పైర్లు పడిన పరిస్థితి లేదు. ఎల్‌నినో ప్రభావంతో చినుకు కినుక వహించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మే ఆఖరు నుంచే జిల్లాలో తొలికరి పైర్లుగా పిలిచే నువ్వు, సజ్జ, పెసర వంటి వాటిని విత్తుతారు. జూన్‌ ఆరంభం నుంచి కీలక ఖరీఫ్‌ పంటల సాగు ప్రారంభమవుతుంది. ఈ సమయానికి కంది, పత్తి, ఇతరత్రా పంటలు ముమ్మరంగా సాగువుతుంటాయి. అలాంటిది ఈ ఏడాది నెలకొన్న వాతావరణంతో పరిస్థితి తారుమారైంది.

అనుకూలించని వాతావరణం

జిల్లాలో జూన్‌లో 57.0 మి.మీ సగటు వర్షపాతం కాగా 44 మి.మీ నమోదైంది. అలా 24శాతం తక్కువ కావడమే కాక కురిసిన వర్షం కూడా పెద్దగా అనుకూలించ లేదు. జూలైలో 87.0 మి.మీ సాధారణ వర్ష పాతం కాగా ఇంతవరకూ ఎక్కడా చినుకుపడిన దాఖలాలు లేవు. ఆ ప్రభావం పంటల సాగుపై తీవ్రంగా పడింది. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 55,774 హెక్టార్లు కాగా కంది, పత్తి, మొక్కజొన్న, సజ్జ, వరి, నువ్వు, మినుము వంటివి ఏవీ ఇప్పటి వరకూ సాగు కాలేదు. తొలకరి పైర్లుగా పిలిచే సజ్జ, నువ్వు, పెసర వంటివి సుమారు ఆరేడు వేల హెక్టార్లలో వేస్తారు. వాటిని విత్తడం ఈపాటికే పూర్తికావాలి. అయితే వర్షాలు లేక తొలకరి పైర్లు సాగు కాలేదు. జొన్న, పిల్లిపెసర, ఇత రత్రా పశుగ్రాస పంటలు, జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను కూడా ఈసారి రైతులు వేయలేక పోయారు.

ఖరీఫ్‌ సాగు అంతంతమాత్రమే

ఈ సమయంలో ఖరీఫ్‌ ప్రధాన పంటలైన కంది, పత్తితోపాటు మొక్కజొన్న, మినుము పంటల సాగు ముమ్మరంగా జరగాల్సి ఉంది. వర్షాలు లేక అసలు ముందుకు కదలడం లేదు. జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 25వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో కంది వేస్తారు. అందులో ఈ సమయానికి సగం విస్తీర్ణంలో పూర్తవుతుంది. అలాంటిది ఎక్కడా విత్తుపడిన పరిస్థితి లేదు. ఇక సుమారు 7వేల హెక్టార్లలో పత్తి సాగు కావాల్సి ఉండగా 136 హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారు. అలాగే సుమారు వెయ్యి హెక్టార్లలో వరి, 360 హెక్టార్లలో మొక్కజొన్న, 529 హెక్టార్లలో శనగ వంటివి కలిపి మొత్తం ఈ సీజన్‌లో ఇప్పటివరకు 2,451 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. అంటే ఈ సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణంలో ఇప్పటివరకు కేవలం 4.40శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. అదేసమయంలో నాలుగైదు రోజుల క్రితం వరకూ ఉన్న తీవ్ర వేడి వాతావరణంతో సాగైన పంటలు కూడా ఎదుగుదల లేకుండా ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. నెలాఖరులోపు మంచి వర్షాలు కురిస్తే తప్ప ఈ సీజన్‌లో కరువు తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 21 , 2026 | 03:16 AM