Share News

గ్యాస్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:26 PM

ఇరాన్‌- అమెరికాయ, ఇజ్రాయెల్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వినియోగదారులకు వంట గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా అన్నిచర్యలను పటిష్టంగా చేపట్టామని కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు.

గ్యాస్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు

కలెక్టర్‌ రాజాబాబు వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : ఇరాన్‌- అమెరికాయ, ఇజ్రాయెల్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వినియోగదారులకు వంట గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా అన్నిచర్యలను పటిష్టంగా చేపట్టామని కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో సోమవారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో వంట గ్యాస్‌ నిల్వల పరిస్థితి, సరఫరా, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యలను వివరించారు. యుద్ధపరిస్థితుల కారణంగా గ్యాస్‌ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయనే సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో గృహ వినియోగదారులకు అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో గ్యాస్‌ నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో 5,51,759 డొమిస్టిక్‌ సిలిండర్లు ఉండగా మార్కాపురం జిల్లాలో 3,22,279 డొమెస్టిక్‌ ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో 39 ఏజెన్సీలు, మార్కాపురం జిల్లా పరిధిలో 25 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా రోజుకు సగటున 9,875 సిలిండర్లు అవసరం ఉండగా డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు జేసీ సంబంధిత డీలర్లతో సమావేశమవుతూ దిశా నిర్దేశం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఎలాంటి అపోహలు,ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Updated Date - Mar 16 , 2026 | 11:26 PM