ఆ ఊళ్లకు ఎన్నికలు లేవు!
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:16 AM
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమవడంతో సుంకేసుల, గొట్టిపడియ, అక్కచెరువు, లక్ష్మీపురం, కృష్ణానగర్, ఆర్ఎల్ పురం, సాయిరాం నగర్, కలనూతల, చింతలముడిపి, గుండంచర్ల, కాటంరాజుతాండా గ్రామాలను ప్రజలు ఖాళీ చేశారు.
ఓటుకు దూరంగా వెలిగొండ నిర్వాసితులు
జిల్లాలో తగ్గిన నాలుగు పంచాయతీలు, ఒక ఎంపీటీసీ స్థానం
ముంపు గ్రామాలు కావడంతో ఖాళీ చేసి వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు
మార్కాపురం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమవడంతో సుంకేసుల, గొట్టిపడియ, అక్కచెరువు, లక్ష్మీపురం, కృష్ణానగర్, ఆర్ఎల్ పురం, సాయిరాం నగర్, కలనూతల, చింతలముడిపి, గుండంచర్ల, కాటంరాజుతాండా గ్రామాలను ప్రజలు ఖాళీ చేశారు. వాటిలోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. వారికి పునరావాసం కోసం 7 చోట్ల కాలనీలను ఏర్పాటు చేసింది. అందులో వారు ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంది. నిర్వాసితులంతా ప్రస్తుతం మార్కాపురం పట్టణంతోపాటు పలు గ్రామాలకు వలస వెళ్లి తాత్కాలికంగా నివాసముంటున్నారు. ఆయా గ్రామాల్లోని మొత్తం 11 పోలింగ్ కేంద్రాల పరిధిలో 9,829 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం గ్రామాలే లేకుండా ఓటర్లంతా ఎక్కడెక్కడో ఉండటంతో వీరి ఓట్లు ఈ ఎన్నికల్లో వినియోగించుకునే అవకాశం లేదని అధికారికంగా ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. అందులోని నాలుగు పంచాయతీలు, ఒక ఎంపీటీసీ స్థానం మినహా మిగిలిన వాటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి గెజిట్ ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారులకు పంచాయతీరాజ్శాఖ నుంచి ఆదేశాలు అందాయి.
ఎన్నికలు లేని పంచాయతీలు ఇవీ..
ఇప్పటి వరకు గొట్టిపడియ, అక్కచెరువు తాండా కలిపి ఒక గ్రామ పంచాయతీగా కొనసాగాయి. అవి ఇప్పుడు లేకపోవడంతో ఆ పంచాయతీకి ఎన్నిక లేకుండాపోయింది. కలనూతల, చింతలముడిపి గ్రామాలు ఒక పంచాయతీ.. గుండంచర్ల, కాటంరాజుతాండా ఒక పంచాయతీ, సుంకేసుల పంచాయతీ ఇవన్నీ ఇప్పుడు వెలిగొండ నీటితో ముంపునకు గురవడం, ప్రజలు ఖాళీ చేసి వెళ్లడంతో వాటికి ఇప్పుడు ఎన్నికలు లేవు. అర్ధవీడు మండలంలోని మాగుటూరు పంచాయతీలో లక్ష్మీపురం, కృష్ణనగర్ ఉండేవి. ఇప్పుడు ఈ రెండు గ్రామాల ఓటర్లు లేకుండా కేవలం మాగుటూరు మాత్రమే పంచాయతీగా ఉంటుంది. సాయిరాంనగర్, రామలింగేశ్వరపురం కలిపి కాకర్ల పంచాయతీలో ఉండేవి. ఇప్పుడు ఆ రెండు గ్రామాల ఓటర్లు లేకుండా కాకర్ల ఒక్కటే గ్రామ పంచాయతీగా కొనసాగుతుంది. ఎంపీటీసీల విషయానికొస్తే గుండంచర్ల, కలనూతల కలిపి ఒక ఎంపీటీసీ స్థానం ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోతోంది. మిగిలిన వాటిలో సుంకేసుల, పుచ్చకాయలపల్లి గ్రామాలు కలిపి ఒక ఎంపీటీసీ ఉండేది. ఇప్పుడు సుంకేసుల ఓటర్లు లేకుండా పుచ్చకాయలపల్లి వరకు ఒక ఎంపీటీసీగా కొనసాగనుంది. గొట్టిపడియ, కోలభీమునిపాడు, జంగమేశ్వరపురం కలిపి ఎంపీటీసీ స్థానం ఉండగా అందులో ఇప్పుడు గొట్టిపడియ ఓటర్లు లేకుండా ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి.
కొత్త పంచాయతీలుగా నోటిఫై చేసి ఎన్నికలు
ముంపునకు గురవుతున్న 11 గ్రామాల ఓటర్లతో కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆతర్వాత నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం 7 చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటవుతున్నాయి. నిర్వాసితులంతా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవి పూర్తయిన తర్వాత కొత్తగా పునరావాస కాలనీలకు ఒక పేరు పెట్టి తీర్మానాలు చేసి వాటిని ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ పేరుతో పంచాయతీగా ఆ కాలనీ గుర్తించబడిన తరువాత అక్కడి ఓటర్లను నోటిఫై చేసి వారందరికీ అక్కడ ఓటు హక్కు కల్పిస్తారు. ఆ తర్వాత కొత్త పంచాయతీలుగా ఇవి రూపుదిద్దుకుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ జరిగేందుకు కొంత కాలం పడుతుంది. అప్పటివరకు ఈ ఓటర్లు వేచి చూడాల్సిందే.