Share News

ఇంట్లో అద్దెకు నమ్మకంగా ఉంటూ చోరీ

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:16 PM

ఇంట్లో అద్దెకు ఉంటూ వృద్ధురాలిని నమ్మించి దొంగతనానికి పాల్పడిన భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్దనరాజు చెప్పారు.

ఇంట్లో అద్దెకు నమ్మకంగా ఉంటూ చోరీ
మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, పక్కన డీఎస్పీ, సీఐలు

ఒంగోలులో భార్యాభర్తలు అరెస్టు

రూ.26.50 లక్షల విలువైన సొత్తు రికవరీ

ఒంగోలు క్రైం, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి) : ఇంట్లో అద్దెకు ఉంటూ వృద్ధురాలిని నమ్మించి దొంగతనానికి పాల్పడిన భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్దనరాజు చెప్పారు. ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు... స్థానిక వేణుగోపాలస్వామి వీధిలో నివాసం ఉండే బండారు వెంకటనారాయణవరప్రసాద్‌ అతని భార్య ఉప్పుతోళ్ల మహాలక్ష్మిలు దేవుడుచెరువులోని పేలాయుదం రమణమ్మ ఇంటిని మూడు నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న వృద్ధురాలు రమణమ్మను భార్యాభర్తలు నమ్మించారు. ప్రణాళిక ప్రకారం ఆమె ఇంట్లో ఉన్న బంగారం దొంగలించేందుకు సిద్ధమయ్యారు. గత నెల 21న రమణమ్మ ఇంట్లో ఉన్న సమయంలో భార్యాభర్తలు దేవుడి ప్రసాదం పెడతామని చెప్పి పిలిచారు. ఆమె ప్రసాదం తిన్న తరవాత టీ ఇస్తామని చెప్పి కూర్చోబెట్టారు. ఆ సమయంలో టీ పొడి కోసం బయటకు వెళ్లి నేరుగా మొదటి అంతస్తులోని రమణమ్మ నివాసంలోకి వెళ్లి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలను భార్యాభర్తలు అపహరించారు. అప్పటి నుంచి వెంకటనారయణ వరప్రసాద్‌ అతని భార్య మహాలక్ష్మిలు కనిపించలేదు. మంగళవారం కొప్పోలు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇరువురిని ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ వెకటేశ్వరరావు, సీసీఎస్‌ సీఐ కమలాకర్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొని వారి వద్ద 175 గ్రాముల బంగారం, 850 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. వాటి విలువ రూ.26,50,000 ఉంటుందన్నారు. వారి ఇరువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి ఇరువురు దొంగలను పట్టుకొని సొత్తును రికవరీ చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Updated Date - Aug 18 , 2026 | 11:16 PM