చిన్నారిని మింగేసిన కిటికీ
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:29 PM
జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు.. చాలాకాలం తరువాత పుట్టింటికి వెళుతున్నామన్న సంతోషం, అలాగే చెల్లి నిశ్చితార్థం కావడంతో బంధువులతో సంతోషంగా గడపాలని వచ్చిన ఓ వివాహితకు తీరని శోకం మిగిలింది. ఈ హృదయ విదారక సంఘటన వేటపాలెం మండలం నాయినిపల్లిలో చోటుచేసుకుంది.
ఆడుకుంటున్న బాలుడి తలపై పడిన వైనం
తీవ్ర రక్తగాయాలతో మృత్యువాత
పెళ్లింట తీవ్ర విషాదం
నాయినపల్లిలో ఘోరం
వేటపాలెం(చీరాల), ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు.. చాలాకాలం తరువాత పుట్టింటికి వెళుతున్నామన్న సంతోషం, అలాగే చెల్లి నిశ్చితార్థం కావడంతో బంధువులతో సంతోషంగా గడపాలని వచ్చిన ఓ వివాహితకు తీరని శోకం మిగిలింది. ఈ హృదయ విదారక సంఘటన వేటపాలెం మండలం నాయినిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాయినిపల్లికి చెందిన వైష్ణవి, ఇంకొల్లు మండలం కొనికి గ్రామానికి చెందిన శ్రీకాంత్ దంపతులు. భర్త హైదరాబాదులోని ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి దేవాన్(5), మరో చిన్నారి బాబు సంతానం. వచ్చే శనివారం చెల్లి నిశ్చితార్థం కావడంతో భర్తకు వీలుకాకపోవడంతో వైష్ణవి తన ఇద్దరు పిల్లలతో మంగళవారం రాత్రి హైదరాబాదులో బయలుదేరి ఉదయాన్నే ఇంటికి చేరింది. అందరితో సంతోషంగా గడిపేలోపే సుమారు రెండు గంటల వ్యవధిలోనే ఇంటిపైకి వెళ్లిన దేవాన్ష్ పక్కన గోడకు ఆనించి ఉన్న మూడు అరల కిటికీపైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు అది నేలవాలడంతో చిన్నారి తలపై అమాంతంగా పడింది. దీంతో తీవ్ర రక్త గాయాలతో బిగ్గరగా కేకలు వేసి కుప్పకూలాడు. ఈ సంఘటనతో బోరున విలపించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
రెండు రోజుల్లో వస్తా నాన్నా..
బిడ్డ మరణంతో హాస్పిటల్ వద్ద కుప్పకూలిన తల్లి వైష్ణవి తన తండ్రిని హత్తుకుని బోరున విలపించింది. రెండు రోజుల్లో వస్తానన్నాడు. ఇప్పుడు నా కొడుకు ఎక్కడని భర్త అడిగితే ఏం సమాధానం చెప్పాలి ? బిడ్డా నాన్నకు ఫోన్ చేద్దాంలే అయ్యా.. నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా.. అంటు దగ్ధహృదయంతో హాస్పిటల్ వద్ద విలపిస్తున్న తల్లి రోదనతో హాస్పిటల్ దద్దరిల్లింది. ఈ సంఘటన చూస్తున్న వారందరి కళ్లు చెమర్చాయి.