దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:54 PM
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. దివ్యాంగశక్తి పథకం కింద బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. దివ్యాంగశక్తి పథకం కింద బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం దేశం మొత్తం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ వసతిని కల్పించినట్లు చెప్పారు. దివ్యాంగుల సంక్షేమం కోసం వారిలో ఆత్మస్థైర్యం నెలకొల్పి వారిని ప్రోత్సహించటం జరుగుతుందన్నారు. సదరం కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి దివ్యాంగ సర్టిఫికెట్‌లు మంజూరు చేస్తారన్నారు. తప్పుడు దివ్యాంగ సర్టిఫికెట్‌లు పుట్టించిన వారిని గుర్తించి వాస్తవ దివ్యాంగులకు మరింత మేలు చేకూర్చటం జరుగుతుందన్నారు. తొలుత దివ్యాంగులకు ఉచిత టిక్కెట్‌ను ఇచ్చి ఆర్టీసీ డిపో నుంచి అమరావతి ప్రాంగణం వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ కార్య క్రమంలో ఆర్టీసి డీఎం షయనాబేగం, తహసీల్దార్ జయలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ శ్రీదర్, ఆర్డీవో శివరామిరెడ్డి, నాయకులు సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్టీఆర్), కొండాకృష్ణారెడ్డి, మారుతీకుమార్‌గుప్తా, రాచమల్ల శ్రీనివాసలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు అశోక్‌రెడ్డి పాలాభిషేకం
గిద్దలూరు టౌన్ : దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ఆర్థికంగా మేలు చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం గిద్దలూరు ఆర్టీసీ డిపో ఆవరణలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈపథకం దివ్యాంగుల కుటుంబ ఆర్థిక స్థోమతను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి మేలు చేస్తుందన్నారు. అంతేకాక వారి ప్రయాణ ఖర్చులను తగ్గించడంలో ఉపయోగ పడుతుందన్నారు. స్ర్తీ శక్తి పథకం అమలుతో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కన్నా ముందున్నదని తెలిపారు. అనంతరం దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం కింద అశోక్‌రెడ్డి పాస్‌లను అందచేశారు. అనంతరం వారితో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఆయన కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి బోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, తహసిల్దార్ ఆంజనేయరెడ్డి, డిపో మేనేజర్ మౌనిక, యూనియన్ నాయకులు చక్రపాణియాదవ్, మాజీ సర్పంచ్ దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ప్రయాణం దివ్యాంగులకు వరం : జేసీ
మార్కాపురం వన్‌టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగులకు వరమని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 శాతం వికలత్వం ఉన్నవారందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. జిల్లాలో 18 వేల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారిని గుర్తించి వారికి ఉచిత ప్రయాణం రద్దు చేస్తామన్నారు. దివ్యాంగులకు ఇంటి స్థాలాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ లావణ్య, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు వక్కలగడ్డ మల్లికార్జునరావు, ఒంగోలు పార్లమెంటరీ కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకట రెడ్డి, మాజీ కౌన్సిలర్ కనిగిరి బాలవెంకట రమణ పాల్గొన్నారు.
దివ్యాంగుల అభివృద్ధే లక్ష్యం : ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం : దివ్యాంగుల అభివృద్ధే సీఎం చంద్రబాబు ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం వైపాలెం ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించి అర్హులైన వారికి ఉచిత బస్సు పాసులను అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్‌ను పెంచారని, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాలకు అవకాశం కల్పించారని తెలిపారు. అనంతరం వైపాలెం నుంచి త్రిపురాంతకం అమ్మవారి దేవాలయం వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ మంజునాథరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, ఉప డిపో మేనేజర్ ధనలక్ష్మి, టీడీప మండల అధ్యక్షుడు చిట్యాలవెంగళరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.