Share News

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - May 20 , 2026 | 02:34 AM

కడలిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న దని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం
నమూనా చెక్కును అందజేస్తున్న మంత్రి స్వామి, ఎమ్మెల్యేలు జనార్దన్‌, విజయ్‌కుమార్‌, జేసీ కల్పనాకుమారి

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ స్వామి

వారి ఖాతాలకు సేవ పథకం నిధులు జమ

ఒంగోలు నగరం, మే 19 (ఆంధ్రజ్యోతి) : కడలిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న దని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మత్స్యకారుల సేవ పథకంలో బాగంగా వేట నిషేధ సమయంలో ఇచ్చే నిధులను వారి ఖాతాలకు మంగళవారం ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సముద్ర సంపదను పెంచే దిశగా వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా రూ.20వేలు ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. గతంలో ఈ భృతి రూ.10వేలు ఉండగా ప్రజా ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.20వేలకు పెంచిందని పేర్కొన్నారు. మత్స్యకారులు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పొందేందుకు వయోపరిమితి తగ్గింపు, సబ్సిడీపై డీజిల్‌, రాయితీలపై పడవలను ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. ఏటా ఏప్రిల్‌ 15వతేదీ నుంచి జూన్‌ 14వతేదీ వరకు చేపలు గడ్లు పెట్టి సంపద అభివృద్ధి చెందే ఈ రెండు నెలల పాటు వేటపై నిషేధం అమలు చేయడం వలన మత్స్యకారులకు మేలు చేకూరుతుందన్నారు. సముద్ర సంపద పెరిగితే వేట లాభదాయకండా ఉంటుందని తెలిపారు. జిల్లాలో 8,694 మందికి రూ.17.38 కోట్లను మత్స్యకారుల సేవ పథకం కింద బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమచేస్తుందన్నారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదన్నారు. సోనా బోట్ల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ మత్స్యకారులను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అన్నివేళలా మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను మత్స్యకారులు అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ పథకం కింద నమూనా బ్యాంకు చెక్‌ను మత్స్యకారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు పేరయ్య, ఒంగోలు ఏఎంసీ ఛైర్మన్‌ రాచగర్ల వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 02:34 AM