లక్ష్మీనరసింహుని కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:04 AM
భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న పృఽథులగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం మంగళవారం అర్ధరాత్రి కమనీయంగా జరిగింది.
కల్యాణానికి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
లక్ష్మీనరసింహుని నామస్మరణంతో మారుమోగిన పృథులగిరి
మర్రిపూడి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న పృఽథులగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం మంగళవారం అర్ధరాత్రి కమనీయంగా జరిగింది. స్వామి కల్యాణానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి తిలకించి పులకించిపోయారు. ఈఏడాది చంద్రగ్రహణం కారణంగా కల్యాణం చాలా ఆలస్యంగా మొదలైంది. సంప్రోక్షణ అనంతరం లక్ష్మీనరసింహస్వామివార్ల ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై ఉంచి మాడవీధులలో ఊరేగించారు. ప్రహ్లాద వరద గోవిందా, జయలక్ష్మీ జయనారసింహా అంటూ భక్తుల జయజయ ద్వానాలతో పృథులగిరులు పిక్కటిల్లాయి. ఆలయ అర్చకులు నారాయణం మారుతీ అర్చకులు, పరాంకుశం సాయిఆచార్యులు, శాస్త్రోక్తంగా కల్యాణ తంతు జరిపించారు. బరూరిసోదరులు ఉభయదాతలుగా వ్యహరించారు. ఈసందర్భంగా దేవాలయాన్ని, సోపానమార్గాన్ని రంగురంగుల విద్యుత్‌దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో పృధులగిరి నూతనశోభను సంతరించుకుంది. అనంతరం తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.