పండుగ తెచ్చిన త్యాగ‘ధనం’
ABN , Publish Date - Jun 30 , 2026 | 03:02 AM
వెలిగొండ నిర్వాసితుల నిరీక్షణకు తెరపడింది. ప్రాజెక్ట్ కోసం ఇళ్లు, భూములు, ఊళ్లను త్యాగం చేసిన వారి కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. మూడు దశాబ్దాలపాటు ఆందోళనలు, నిరసనలు చేసి తీవ్ర నిర్వేదంలో ఉన్న వారికి ఇప్పుడు ఉపశమనం కలిగింది.
వెలిగొండ నిర్వాసితులకు అందిన పరిహారం
బ్యాంకు ఖాతాల్లో పడుతున్న నగదు
తొలివిడత రూ.300 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం
2,351 మంది అకౌంట్‌లలో నేరుగా జమ
తోటివారితో సంతోషం పంచుకుంటూ
ముంపు గ్రామాల ప్రజల సంబరాలు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ
సోషల్ మీడియాలో సందేశాలు
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు
వెలిగొండ నిర్వాసితుల నిరీక్షణకు తెరపడింది. ప్రాజెక్ట్ కోసం ఇళ్లు, భూములు, ఊళ్లను త్యాగం చేసిన వారి కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. మూడు దశాబ్దాలపాటు ఆందోళనలు, నిరసనలు చేసి తీవ్ర నిర్వేదంలో ఉన్న వారికి ఇప్పుడు ఉపశమనం కలిగింది. ఎన్నో ఏళ్లుగా వారు ఎదురుచూస్తున్న పరిహారం నగదు బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు వచ్చిన సందేశాలను చూసి మురిసిపోతున్నారు. వెలిగొండను పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా తమ సమస్యను పరిష్కరించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై కొట్టారు.
మార్కాపురం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రజల మూడు దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి. ప్రజా ప్రభుత్వం వారి గోడును ఆలకించింది. నిర్వాసితులకు పరిహారం నగదును మంజూరు చేసింది. దాన్ని సోమవారం నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. గత వైసీపీ హయాంలో నిర్వాసితుల సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ పనులను వేగిరం చేసింది. పెండింగ్ పనులపై దృష్టి సారిం చి గత రెండేళ్లలో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తోంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల తరువాత నిర్వాసితుల్లో మళ్లీ నిరాశే కనిపించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల మొత్తం 7,225 మంది నిర్వాసితులకు పరిహారం కోసం అవసరమైన రూ.905 కోట్ల అదనపు బడ్జెట్‌ను కేటాయించినట్లు ప్రకటించింది. ఆ వెంటనే శనివారం సీఎం చంద్రబాబు వెలిగొండ వద్దకు వచ్చారు. తొలి విడత తక్షణమే రూ.300 కోట్లు విడుదల చేస్తూ 2,351 మందికి వీటిని జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం సెలవు అయినందున సోమవారం మీ ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. ఆ ప్రకారం సోమవారం ఉదయం నుంచే నగదు జమ అయిన ట్లు ఒక్కొక్కరి సెల్‌ఫోన్‌లకు సందేశాలు (మెసేజ్)లు వస్తున్నాయి. వాటిని చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేకుం డాపోయాయి. ఆర్‌అండ్‌ఆర్, వన్‌టైం సెటిల్మెంట్ కింద వివిధ విభాగాల్లో పరిహారంగా రూ.12,50,000, రూ.12,76,000, రూ.11,76,000, రూ.13,01,000 చొప్పున నిర్వాసితుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఉదయం నుంచే తోటివారితో వారికి నగదు పడిన ఆనందాన్ని చెప్పుకోవడం ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాలు పంపారు. కొన్నిచోట్ల ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రెండు రోజుల్లో అప్లోడ్ చేసిన అధికారులు
కేవలం రెండు రోజుల్లోనే నిర్వాసితుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజుతాండా, గొట్టిపడియ, రామలింగేశ్వరపురం, సాయినగర్, కృష్ణానగర్, అక్కచెరువు, లక్ష్మీపురం గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాల్లో 2,351 కుటుంబాలకు పరిహారం అందేలా అధికారులు కసరత్తు చేసి ప్రక్రియను పూర్తి చేశారు. సోమవారం నుంచి నిర్వాసితుల ఖాతాల్లో నగదు జమవుతోంది. ఏఏ గ్రామాల లబ్ధిదారులకు నగదు జమయ్యిందనే సమాచారం కోసం నిర్వాసితులు ఆరా తీస్తున్నారు. అయితే గ్రామాల వారీ నిర్వాసితుల వివరాలు అప్లోడ్ చేయకుండా తమకు సరైన ఆధారాలు ఇచ్చిన వారివి, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా ఉంటే అటువంటి వాటిని అప్లోడ్ చేశామని అధికారులు తెలిపారు. దీనిని బట్టి 11 గ్రామాల్లోని 2,351 మంది లబ్ధిదారులకు నగదు జమయ్యింది.
అధికారులను అభినందించిన ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్
నిర్వాసితుల కోసం మొత్తం రూ.905 కోట్లలో తొలివిడత రూ.300 కోట్లకు సరిపడా నిర్వాసితుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రకారం 2,351 మంది వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటే 2,450 మందివి నమోదు చేశారు. వీరందరికీ 300 కోట్ల 95 లక్షలు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. సకాలంలో నిర్వాసితుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన అధికారులను ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ ప్రశాంతి అభినందించారు.
సుంకేసులలో సందడి
వెలిగొండ నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ అయిన సందర్భంగా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. గ్రామానికి వెళ్లిన టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబుకు పూలతో స్వాగతం పలికారు. సీఎం చిత్రపటం పట్టుకొని డ్యాన్స్‌లు వేస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం పరిహారం ఖాతాల్లోకి జమచేయించిన ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎరిక్షన్‌బాబు ప్రజలను కోరారు. ఈ సంద ర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి నిర్వాసితులతో ఎరిక్షన్‌బాబు పాలాభిషేకం చేశారు.