Share News

వైస్‌ చైర్మన్‌ పదవి.. బిగ్‌ టైట్‌

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:16 PM

అద్దంకి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం గట్టిపోటీ నెలకొంది. పలువురు కౌన్సిలర్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికి పలువురు మంత్రి రవికుమార్‌ను కలిసి తమ మనసులో మాటను చెప్పారు. మున్సిపాలిటీకి ఒక వైస్‌ చైర్మన్‌తో పాటు ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు.

వైస్‌ చైర్మన్‌ పదవి.. బిగ్‌ టైట్‌

అద్దంకి మున్సిపాలిటీలో ఆ పదవి ఎవరికి దక్కేనో..

ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

మంత్రి రవికుమార్‌ను కలిసి విన్నపాలు

కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికలోనూ సామాజిక సమతూకానికే ప్రాధాన్యం

అద్దంకి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి) : అద్దంకి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం గట్టిపోటీ నెలకొంది. పలువురు కౌన్సిలర్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికి పలువురు మంత్రి రవికుమార్‌ను కలిసి తమ మనసులో మాటను చెప్పారు. మున్సిపాలిటీకి ఒక వైస్‌ చైర్మన్‌తో పాటు ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో సామాజిక వర్గాల వారీగా పరిగణనలోకి తీసుకొని నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా వైస్‌ చైర్మన్‌ పదవికి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

అద్దంకి మేజర్‌పంచాయతీగా ఉన్నప్పుడు, నగరపంచాయతీగా, మున్సిపాలిటీగా మారిన తరువాత వైస్‌ చైౖర్మన్‌గా ఆర్యవైశ్యులకు అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు వైస్‌ చైర్మన్‌లు కావటంతో ఆర్యవైశ్యులకు ఒకటి, బీసీలకు ఒకటి కేటాయించారు. గతంలో 20 వార్డులు ఉండగా ప్రస్తుతం 32 వార్డులకు పెరిగాయి. దీంతో ఆశావహుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఎన్నికల్లో టీడీపీ, జనసేనల నుంచి 29 మంది గెలిచారు. ఇప్పటికే సుమారు 10 మంది కౌన్సిలర్‌లు తమ సామాజికవర్గం నేతలను, శ్రేయోభిలాషులను తీసుకొని మంత్రి రవికుమార్‌ను కలిశారు. చైర్మన్‌ జనరల్‌ కావటంతో కమ్మ, కాపు, ఆర్యవైశ్య సామాజిక వర్గాల నుంచి పలువురు పోటీపడ్డారు. ఆ సందర్భంలో చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరిన రంగిశెట్టి వెంకటసాంబశివరావు(లహరి) చైర్మన్‌గా అవకాశం ఇవ్వలేని పరిస్థితులలో వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని మంత్రిని కోరినట్లు తెలుస్తుంది. దీనికితోడు అద్దంకి మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పుడు వార్డు మెంబర్‌గా పనిచేసి ఉండటం, నగరపంచాయతీ, మున్సిపాలిటీగా మారిన తరువాత లహరీ సతీమణి సుభాషిణి రెండుసార్లు కౌన్సిలర్‌గా అదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలలో కూడా అదే ప్రాంతం నుంచి లహరి కౌన్సిలర్‌గా గెలుపొందారు. వరుసగా నాలుగుసార్లు అదే ప్రాంతంలో భారీ మెజార్టీలతో భార్యాభర్తలు గెలుపొందటం విశేషం. అదే సమయంలో కాపు సామాజిక వర్గం కావటం కలిసి వచ్చే అంశంగా మారింది.


గత ఆనవాయితీ కొనసాగేనా?

ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చుండూరి మురళీసుధాకరరావుకు శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా ఇవ్వటం, అదే సామాజికవర్గానికి చెందిన మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిన్ని లక్ష్మీశ్రీనివాసరావుకు రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆర్యవైశ్య సామాజకవర్గం నుంచి శ్రీనివాసరావు కోడలు చిన్నిమానస 19వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గత ఆనవాయితీ ప్రకారం ఆర్యవైశ్య సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తే మానసకు వైస్‌ చైర్మన్‌ దక్కవచ్చు. ఒకే కుటుంబంలో రెండు పదవులు విషయం పరిగణనలోకి తీసుకొని పక్కన పెట్టే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎస్సీ సామాజికవర్గానికి అవకాశం ఇస్తే గత మున్సిపల్‌ ఎన్నికలలో టీడీపీ తరఫున మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి కౌన్సిలర్‌గా గెలిచిన కంపా రజనీ ప్రస్తుతం మళ్లీ కౌన్సిలర్‌గా ఎన్నిక కావటంతో కలిసి వచ్చే అంశంగా ఉంది. మరికొందరు కౌన్సిలర్‌లు ఈ పదవిని ఆశిస్తున్నప్పటికీ ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం దక్కవచ్చని అంచనా. ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యులు, వైస్‌ చైర్మన్‌ల ఎంపికపై పూర్తి స్థాయి కసరత్తు చేసి అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించే విధంగా కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Nov 11 , 2026 | 11:16 PM