Share News

తేలని ‘ఇతరుల’ లెక్క

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:07 AM

మార్కాపురం జిల్లాలో భూ వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతి గ్రీవెన్స్‌లోనూ రెవెన్యూ సమస్యలపైనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. వాటిని పరిష్కరిం చడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది.

తేలని ‘ఇతరుల’ లెక్క

భూ సమస్యలకు ఇవే కీలకం

ఆ 80 వేల ఎకరాలు ఎవరివి?

ఖాళీ స్థలాలపై కన్నేస్తున్న కంత్రీలు

వాటిపైనే నిత్యం వివాదాలు

ఇవి పరిష్కరిస్తే గ్రీవెన్స్‌కు తగ్గనున్న ఫిర్యాదులు

మార్కాపురం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాలో భూ వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతి గ్రీవెన్స్‌లోనూ రెవెన్యూ సమస్యలపైనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. వాటిని పరిష్కరిం చడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో (మీ భూమి పోర్టల్‌) రైతుల పేర్లు లేకుండా వివిధ సర్వే నెంబర్లలో ఇతరులు అని చూపిన భూముల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఖాళీగా భూమి కనిపిస్తే వాటిపై కన్నేసే కంత్రీలు అధికమైపోయారు. ఇతరులు అని ఉన్న భూములు చూసుకుని వాటిపై హక్కు ఉన్నట్లు నకిలీ పట్టాలు పుట్టించేవారు కొందరైతే, వారసులకు తెలియకుండా తమకు పూర్వీకులు విక్రయించారని డాక్యుమెంట్లు చూపి అడ్డగించేవారు మరికొందరు. దీంతో వివాదాలు పెచ్చుమీరిపోతున్నాయి. జిల్లాలో దాదాపు 80వేల ఎకరాల భూమి రికార్డు పరంగా రైతులెవరో గుర్తించక ఇతరులు అని నమోదు చేసి ఉంచారు. ఇవి ఎవరివో లెక్క తేల్చలేక అధికారులు సతమతమవుతున్నారు. దీన్ని పరిష్కరిస్తే చాలావరకు సమస్యలు ఉండవని భావిస్తున్నారు.

మార్కాపురం డివిజన్‌లో ఎక్కువ భూములు

జిల్లాలోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో 66,432 సర్వే నెంబర్లలోని 80,181 ఎకరాల భూమికి సంబంధించి ‘ఇతరులు’ అని నమోదై ఉంది. ఇందులో మార్కాపురం డివిజన్‌లోని 15 మండలాల్లో 44,513 సర్వే నెంబర్లలో 50,583 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలుస్తోంది. కనిగిరి డివిజన్‌లోని ఆరు మండలాల్లో 21,919 సర్వే నెంబర్లలో 29,598 ఎకరాలు ఉంది. మార్కాపురం డివిజన్‌లో మార్కాపురం మండలంలో అత్యధికంగా 6,900 ఎకరాలు ఉండగా, కనిగిరి డివిజన్‌లోని పామూరు మండలంలో 8,400 ఎకరాలు ఇతరుల పేరుతో నమోదైంది. ఇవి ప్రస్తుతం అధికారులకు తలనొప్పిగా మారాయి. వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. వీటిలో ముఖ్యంగా ప్రైవేటు భూముల్లో ఇతరులు అని ఉన్న వాటికి సంబంధించి యజమానులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ప్రభుత్వ భూముల్లో కూడా రైతులు ఉంటే వారి వద్ద ఆధారాల మేరకు పరిశీలన చేపట్టి అభ్యంతరాలు లేనిపక్షంలో పరిష్కరించి రికార్డుల్లో రైతుల పేర్లు నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నారు. అయితే వీటికి సంబంధించి లెక్క తేల్చడం తలకుమించిన భారంగా మారింది.

సమస్య పరిష్కారానికి చర్యలు ఇలా

జిల్లాలో ‘ఇతరులు’ కింద ఉన్న భూముల సమస్య పరిష్కారంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. వాటిపై ఓ విధానాన్ని రూపొందించింది. ఆ ప్రకారం భూమిపై ఉన్న రైతుల పేర్ల వివరాలను ఫారం-8 ద్వారా నోటీసు బోర్డులో ఉంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. వాటిపై వివాదాలు నెలకొన్నా, ఫిర్యాదులు వచ్చినా అధికారులు విచారణ చేపడతారు. లేనిపక్షంలో వారం రోజుల గడువు తరువాత ఆ భూమిపై వాస్తవంగా ఉన్న రైతు పేరును ఇతరులు అని ఉన్నచోట నమోదు చేసి భూమిపై హక్కు కల్పిస్తారు. దీనికి ముందుగా అతనికి భూమిపై ఉన్న హక్కు పత్రాలు, అనుభవ స్వభావం, ఇతర అన్ని విషయాలను సమగ్రంగా విచారిస్తారు. ఈ ప్రక్రియను ప్రారంభించి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పలు ఇతర కార్యక్రమాలు, సర్వేలు వంటి పనిభారంతో గడువు పొడిగించబడుతూ వస్తోంది. ఈ సమస్య పరిష్కారమైతే చాలావరకు గ్రీవెన్స్‌కు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

రెవెన్యూ కోర్టుల్లోనూ పెండింగ్‌లో వివాదాలు

జిల్లాలో పలు భూ వివాదాలపై రెవెన్యూ కోర్టులకెక్కిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇవి ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోక పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇటీవల వాటిపై కూడా జిల్లా అధికారులు దృష్టి సారించారు. జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో 270 కేసులు ఉండగా వాటిలో గత వారం 80 కేసులపై ఆయన విచారణ నిర్వహించారు. మార్కాపురం ఆర్డీవో కోర్టులో 38 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వారసత్వ భూములు, పంపకాలు, ఒకే భూమిపై నాకే హక్కు అంటూ ఉత్పన్నమైన సమస్యలే. ఇటువంటి సమస్యలకు రికార్డుల్లో ఇతరులు అని ఉండటం మరింత ఆజ్యం పోస్తోంది. వాటిపై అసలు హక్కుదారులు ఎవరని లెక్క తేల్చడం అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది.

Updated Date - Jul 28 , 2026 | 03:07 AM