రైలొస్తోంది..
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:52 AM
జిల్లాలోని కనిగిరి ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే సౌకర్యం అందు బాటులోకి రానుంది. గుంటూరు నుంచి కనిగిరి వరకూ కొత్తగా నిర్మాణం పూర్తయిన మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
గుంటూరు - కనిగిరి మధ్య త్వరలో రాకపోకలు
దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారుల గ్రీన్‌సిగ్నల్
సీహెచ్‌జీ వివేకానంద ఎల్లప్ప ఉత్తర్వులు
కనిగిరి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని కనిగిరి ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే సౌకర్యం అందు బాటులోకి రానుంది. గుంటూరు నుంచి కనిగిరి వరకూ కొత్తగా నిర్మాణం పూర్తయిన మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ ట్రాన్స్‌పోర్టేషన్ బ్రాంచ్ ఏటీఎం/ సీహెచ్‌జీ ఎం.వివేకానంద ఎల్లప్ప శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతిపాదన ప్రకారం గుంటూరు - కనిగిరి మధ్య డెమో రైలును వారానికి ఆరు రోజులపాటు నడపనున్నారు. ఈ సేవలను గుంటూరు నుంచే ప్రారంభించి, అదేచోట ముగించడం నిర్వహణపరంగా సులభతరం కానుంది. ఉదయం 8:30 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 01:00 గంటకు కనిగిరికి చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 02:00 గంటలకు కనిగిరి నుంచి బయల్దేరి సాయంత్రం 07:00 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. ఈమేరకు షెడ్యూల్‌ను తయారు చేశారు. రైలును ప్రారంభించాల్సిన తేదీ, స్టేషన్‌ల వారీ స్టాప్‌ల వివరాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వివేకానంద ఎల్లప్ప గుంటూరు రైల్వే డివిజన్ అధికారులను ఆదేశించారు. ఈ రైలు ప్రారంభమైతే కనిగిరి నుంచి గుంటూరుకు రవాణా మెరుగవుతుంది. విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.