Share News

కొలువుదీరే వేళాయె!

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:32 AM

పరిషత్‌ పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలకు అంతా సిద్ధమైంది. గురువారం మండల పరిషత్‌, 20న జిల్లా పరిషత్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలు... అదేసమయంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమి షన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశిం చింది.

కొలువుదీరే వేళాయె!
ఎన్‌జీపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు చేసిన ఏర్పాట్లు

పరిషత్‌ పాలక వర్గాల ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

నేడు మండల, రేపు జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

తొలుత కోఆప్షన్‌ సభ్యులకు.. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులకు

చేతులెత్తే విధానంలో నిర్వహణ

ఒంగోలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలకు అంతా సిద్ధమైంది. గురువారం మండల పరిషత్‌, 20న జిల్లా పరిషత్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలు... అదేసమయంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమి షన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశిం చింది. తదనుగుణంగా జిల్లాలో ఆ కార్యక్రమాల నిర్వహణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పరిషత్‌ల పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 27 జడ్పీటీసీలు, అలాగే 371 ఎంపీటీసీలకు ఎన్నికలు ప్రకటించగా, రెండు జడ్పీటీసీలు, 220 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25 జడ్పీటీసీలు, 151 ఎంపీటీసీ లకు ఈనెల 5న పోలింగ్‌ జరగ్గా 7న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 27 జడ్పీటీసీ సభ్యులు, 27 మండలాల్లోని 371 ఎంపీటీసీ సభ్యులకు రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కాగా మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాలు అధికారం చేపట్టడంతోపాటు వాటికి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక చేయాల్సిన ప్రక్రియ ఇప్పటివరకు మిగిలి ఉండగా గురు, శుక్రవారాల్లో దాన్ని కూడా పూర్తిచేసేందుకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. అలా 19న మండల, 20న జిల్లా పరిషత్‌ ప్రక్రియ జరగనుండగా ఇప్పటికే వాటిలో సభ్యులుగా ఉండే ఎంసీటీసీ, జడ్పీటీసీలకు సంబంధిత అధికారులు సమావేశాలకు సంబంధించిన నోటీసులను ఇచ్చారు. ఎస్‌ఈసీ ఆదేశాల ప్రకారం గురువారం జిల్లాలోని 27 మండ లాల్లో మండల పరిషత్‌ల నూతన సభ్యుల ప్రమాణస్వీకారాలు అలాగే కోఆప్షన్‌ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికకు అధికారులు చర్యలు చేపట్టారు. అందుకోసం ఎస్‌ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశపు హాళ్లలో సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు, కొన్నిచోట్ల భవనాలకు కొత్తగా రంగులు వేయడంతోపాటు పర్నిచర్‌ను, ప్రాంగణాలను శుభ్రపరిచారు. కాగా మండల పరిషత్‌ పాలకవర్గాల ప్రమాణస్వీకారం, ఎన్నికల ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచే ప్రారంభం కానుంది. తొలుత మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుని ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ ఇచ్చి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. వాటి పరిశీలన, ఉపసంహరణలు పూర్తిచేసి మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్‌ సభ్యుని పదవికి పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.

చేతులెత్తే పద్ధతిలోనే ఎన్నిక

ఆ వెంటనే నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తొలుత వారి చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం చేతులు ఎత్తే పద్ధతిలో కోఆప్షన్‌ సభ్యుని ఎన్నికను నిర్వహిస్తారు. అనంతరం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు మరోసారి మధ్యాహ్నం మూడుగంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. తొలుత ఉపాధ్యక్ష, తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. పోటీలో ఉండే అభ్యర్థులను సమావేశంలో సభ్యులు ప్రతిపాదిస్తే చేతులు ఎత్తే పద్ధతిలోనే వారి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగడంతో పార్టీ తరఫున ఆ స్థానాలకు అభ్యర్థుల ప్రతిపాదించడం తదనుగుణంగా సభ్యులు ఓటు వేయడం వంటివి ఉంటాయి. అందుకోసం విప్‌ జారీ చేసే అధికారం కూడా ఆయా పార్టీలకు ఉంది.

కొత్త పాలకవర్గాల కోసం ముస్తాబు

జడ్పీ పాలక మండలి ప్రక్రియ ఈనెల 20న జరగనుంది. స్థానిక పాత జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని సమావేశపు హాలు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం పది గంటలకు ఇద్దరు జడ్పీ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియను పూర్తిచేసి మధ్యాహ్నం ఒంటిగంటకు జడ్పీటీసీ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. తొలుత సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి తర్వాత కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహిస్తారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ చేతులెత్తే విధానంలోనే కొనసాగనుండగా విప్‌ జారీచేసే అధికారం పార్టీలకు ఉంది.

కూటమిదే ఆధిపత్యం

అటు ఎంపీటీసీలు, ఇటు జడ్పీటీసీలలో అధికచోట్ల పూర్తి అధిపత్యం టీడీపీ కూటమిదే కావడంతో పాలకవర్లాన్ని వారే కైవసం చేసుకోనున్నారు. జడ్పీ ఎన్నికకు కలెక్టర్‌ రాజాబాబు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనుండగా మండల పరిషత్‌లకు ఆర్డీవోలను కలెక్టర్‌ నియమించారు, ఇదిలాఉండగా జడ్పీ పాలక మండలిలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా జిల్లాకు చెందిన పార్లమెంట్‌, శాసనమండలి, శాసన సభ్యులకు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే వారి పరిధిలోని మండలాల సమావేశాలకు వారు హాజరుకావచ్చు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు. ఆ మేరకు వారికి కూడా అధికారులు ఆహ్వానాలు పంపించారు.

Updated Date - Nov 19 , 2026 | 02:32 AM