ముహూర్తం కుదిరింది
ABN , Publish Date - Jul 12 , 2026 | 02:16 AM
జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఎనిమిది మాసాల అనంతరం ఈనెల 15వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైనప్పటికీ ప్రత్యేకంగా అక్కడ డీఆర్సీ పెట్టడం లేదు. ఆ జిల్లాకు ఇంకా ఇన్‌చార్జి మంత్రి నియామకం జరగలేదు.
ఈనెల 15న రెండు జిల్లాలకు కలిపి ఒంగోలులోనే డీఆర్సీ
అలా నిర్వహణపై భిన్నాభిప్రాయాలు
ఎనిమిది ప్రధాన అంశాలతో అజెండా
నివేదికలను సిద్ధంచేస్తున్న అధికారులు
అదేరోజు సాయంత్రం నేతివారిపాలెంలో
ఎన్‌టీఆర్, దామచర్ల విగ్రహాల ఆవిష్కరణ
జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఎనిమిది మాసాల అనంతరం ఈనెల 15వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైనప్పటికీ ప్రత్యేకంగా అక్కడ డీఆర్సీ పెట్టడం లేదు. ఆ జిల్లాకు ఇంకా ఇన్‌చార్జి మంత్రి నియామకం జరగలేదు. పాలనా వ్యవహారాలలో ఉమ్మడి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన ఆనం రామనారాయణరెడ్డి ఆ జిల్లాకు కూడా ప్రస్తుతం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 15న ఒంగోలులోనే రెండు జిల్లాల డీఆర్సీ సమావేశాన్ని సంయుక్తంగా ఏర్పాటుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఒంగోలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశానికి ముహూర్తం కుదిరింది. తాజాగా నిర్వహించనున్న డీఆర్సీ సమావేశం ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నాల్గోసారి. వాస్తవానికి ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహించాలి. జిల్లా స్థాయిలో కీలక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి. అయితే ఈ విడత కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో డీఆర్సీ సమావేశాలు సక్రమంగా జరగడం లేదు. తొలి సమావేశం 2024 నవంబరు మొదటి వారంలో, రెండో సమావేశాన్ని 2025 మేలో, మూడోసారి 2025 నవంబరు 5న నిర్వహించారు. ఆ తర్వాత డీఆర్సీ ఊసే లేకుండాపోయింది. మరోవైపు గత డిసెంబరు 31న జిల్లాల పునర్విభజన జరిగి కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుతోపాటు ప్రకాశంలో ఇతర ప్రాంతాలు కలిశాయి. అలాంటి సమ యంలో కీలకమైన డీఆర్సీ నిర్వహణ అత్యంత అవసరం కాగా అందుకు బాధ్యులైన కీలక ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పరిస్థితి లేదు.
రెండేళ్ల పాలన వేడుకలతో ఆలస్యం
ఆ పరిస్థితిపై గతనెల 11న ‘ఆంధ్రజ్యోతి’లో డీఆర్సీ ఊసే లేదంటూ ప్రచురించిన కథనం ఇటు ప్రజాప్రతినిధుల్లోనే, అటు అధికారవర్గాల్లోనూ విస్తృత చర్చకు దారితీసింది. దీంతో మరుసటి వారంలో డీఆర్సీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వేడుకలు జరుగుతున్నాయి. మంత్రులు తమ ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల్లో బాధ్యతలు ఉన్నచోట హాజరుకావడంతో డీఆర్సీకి ముహూర్తం కుదరలేదు. ఆతర్వాత నిర్వహించే ప్రయత్నం చేసినా గత నెలాఖరులో సీఎం చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ(సర్) జరుగుతూ కీలక అధికారులు అందులో నిమగ్నమై ఉన్నారు. అలా డీఆర్సీ సమావేశం నిర్వహించాలని భావించిన అనంతరం దాదాపు నెలరోజులు పరిస్థితి అనుకూలించక ఆలస్యమైంది. కాగా ఈనెల 14తో సర్ ముగుస్తుంది. దీంతో 15న డీఆర్సీ నిర్వహించాలని వారం క్రితం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
నివేదికలు సిద్ధం
ఈసారి డీఆర్సీ సమావే శానికి ఎనిమిది కీలక శాఖలకు సంబంధించిన మొత్తం 17 అంశాలను అజెండాగా నిర్ణయించారు. అందులో తాగునీరు. వ్యవసాయ అనుబంధ శాఖలు, పంచాయతీరాజ్, విద్యుత్, డ్వామా, జలవనరుల శాఖ, హైవే, రెవెన్యూ శాఖలకు చెందిన అంశాలు ఉన్నాయి. ఆ మేరకు రెండు జిల్లాలకు విడివిడిగా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
విడివిడిగా అయితేనే చర్చకు అవకాశం
డీఆర్సీ సమావేశం ఏర్పాటుకు జిల్లా అధికారులకు ఇన్‌చార్జి మంత్రి అనం ఆదేశాలు జారీ చేశారు. అయితే రెండు జిల్లాలకు విడివిడిగా జరపాల్సిన ఈ సమావేశాన్ని అందుకు విరుద్ధంగా కలిపి ఒంగోలులోనే ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా సమావేశాన్ని అక్కడ నిర్వహించడం ద్వారా ఆ జిల్లాలో తొలి కీలక సమావేశం అవుతుంది. అదేసమయంలో కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత అక్కడ సౌకర్యాలు, ఇతర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి తగు చర్యలకు అవకాశం ఉండేది. అందుకుభిన్నంగా ఒంగోలులోనే నిర్వహించనుండటంతో ఇటు ప్రకాశం, అటు మార్కాపురం ఏ ఒక్క జిల్లాకు సంబంధించిన అంశాలపైనా వివరంగా చర్చించే అవకాశం పెద్దగా ఉండకపోవడమే కాక ఒక జిల్లా అంశాలపై చర్చ సమయంలో ఇంకొక జిల్లావారు మౌనంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాక మార్కాపురం జిల్లాకు చెందిన కీలక అధికారులు అనేకమంది ఈ సమావేశం కోసం ఒంగోలుకు రావాల్సి వస్తుంది. దానికి బదులు ఇన్‌చార్జి మంత్రి ఒక్కరు మార్కాపురం వెళ్లి ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేతివారిపాలెంలో విగ్రహావిష్కరణలు
డీఆర్సీ సమావేశం అనంతరం అదేరోజు సాయంత్రం కొండపి మండలం నేతివారిపాలెంలో జరిగే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రులు హాజరుకానున్నారు. ఆ గ్రామంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఉమ్మడి జిల్లా కీల ప్రజాప్రతినిధులు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతోపాటు పలువురు ఇతర చైర్మన్లు 15వ తేదీ సాయంత్రం ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.