Share News

ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:32 AM

పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి రావడంతో మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఆ ప్రకారం ఈనెల 19న మండల, 20న జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాఽధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నారు.

ముహూర్తం ఖరారు

19న మండల, 20న జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

14న నోటిఫికేషన్‌... షెడ్యూల్‌ ప్రకటించిన ఎస్‌ఈసీ

23న డిప్యూటీ మేయర్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక

ఒంగోలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి రావడంతో మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఆ ప్రకారం ఈనెల 19న మండల, 20న జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాఽధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 14న రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. ఎస్‌ఈసీ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం 19వతేదీ ఉదయం 10 గంటల నుంచి మండల పరిషత్‌లలో ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. తొలుత కోఆప్షన్‌ సభ్యుని ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోటీలో ఉన్న అభ్యర్థులను నిర్ధారించి అనంతరం మండల పరిషత్‌ ప్రాదేశికాల (ఎంపీటీసీ) నుంచి ఎన్నికైన సభ్యులతో సమావేశం నిర్వహిస్తారు. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆతర్వాత కోఆప్షన్‌ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. చేతులు ఎత్తే పద్ధతిలో ఇది సాగుతుంది. ఆ వెంటనే వారితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏదైనా కారణం చేత ఆ రోజున ఎన్నిక జరగక వాయిదా పడితే మరుసటి రోజున నిర్వహిస్తారు.

20న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక

జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఈనెల 20న జరగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం జడ్పీకి ఇరువురు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించి ఉపసంహరణల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీ సభ్యుల సమావేశం నిర్వహిస్తారు. తొలుత వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ వెంటనే కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు జడ్పీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. సభ్యులు చేతులేత్తే విధానంలో ఈ ఎన్నిక సాగనుంది. ఏదైనా కారణం చేత ఆ ప్రక్రియ వాయిదాపడితే ఆ మరుసటి రోజైన 21న నిర్వహిస్తారు. ఆ మేరకు ఎస్‌ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం జిల్లాలోని 27 మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే ఒక్కో మండలానికి ఒక కోఆప్షన్‌ సభ్యుని ఎన్నిక ఈనెల 19న జరగనుంది. అలాగే జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తోపాటు ఇరువురు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక 20వ తేదీ నిర్వహిస్తారు.

23న డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు

మున్సిపల్‌ ఎన్నికలు వారంక్రితం ముగియగా వాటిలో తదుపరి ప్రక్రియ అయిన డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు ఇప్పటికే ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. కార్పొరేషన్‌ మేయర్‌ అలాగే మున్సిపల్‌, నగరపంచాయతీల చైర్మన్లకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే. ఇక కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్‌, మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఆ ఎన్నికలను ఈనెల 23న నిర్వహించేలా ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రోజున నూతనంగా ఎన్నికైన కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లుతో కార్పొరేషన్‌, మునిసిపల్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. తొలుత వారి చేత ప్రమాణస్వీకారం చేయించి అనంతరం డిప్యూటీ మేయర్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. వీటిలోనూ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సౌకర్యం ఉంది. జిల్లాలో అటు పరిషత్‌, ఇటు మున్సిపల్‌ తదుపరి ఎన్నికల ప్రక్రియ అంతా కలెక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతుంది.

Updated Date - Nov 11 , 2026 | 01:32 AM