Share News

ముచ్చటగా మూడో విడత రూ.250 కోట్లు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:32 PM

ముప్పయ్యేళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా వాసుల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం కాబోతుంది. ఈ నెల 31వ తేదీన వెలిగొండ మొదటి దశను ప్రారంభించి నీరు విడుదల చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు శనివారం ప్రకటించారు.

ముచ్చటగా మూడో విడత రూ.250 కోట్లు
నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కు అందజేస్తున్న సీఎం చంద్రబాబు, పక్కన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు,

వెలిగొండ నిర్వాసితులకు నష్టపరిహారం అందించిన సీఎం చంద్రబాబు

48 రోజుల్లోనే పలుదఫాలుగా రూ.768 కోట్లు చెల్లింపు

31న సీఎం చేతుల మీదుగా ప్రాజెక్ట్‌ ద్వారా నీళ్లు

బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న పశ్చిమ ప్రాంత ప్రజలు

మార్కాపురం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : ముప్పయ్యేళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా వాసుల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం కాబోతుంది. ఈ నెల 31వ తేదీన వెలిగొండ మొదటి దశను ప్రారంభించి నీరు విడుదల చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు శనివారం ప్రకటించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో మూడో విడత రూ.250 కోట్లు విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు వెలిగొండ నిర్వాసితులకు చెక్కును అందజేశారు. మొత్తం 11 గ్రామాల్లోని 7,321 మంది నిర్వాసితుల్లో ఇప్పటివరకు 6,206 మందికి రూ.768 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. తొలివిడతలో 2,557 మందికి రూ.318 కోట్లు, రెండోవిడత 1,622 మందికి రూ.200 కోట్లు, ఇప్పుడు మూడోసారి 2,027 మందికి రూ.250 కోట్లు పరిహారం సీఎం చేతుల మీదుగా అందుకున్న నిర్వాసితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక కేవలం రూ.132 కోట్లు మాత్రమే నిర్వాసితులకు అందించాల్సి ఉంది. ఈ నెల 31న ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌లో 10.7 టీఎంసీలు నింపబోతున్నారని, అదీ స్వయంగా సీఎం చంద్రబాబు చేతులమీదుగా జరగబోతోందని తెలుసుకున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు, ప్రజాప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

జిల్లా సస్యశ్యామలం కాబోతోంది : సీఎం

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా నీళ్లు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. జిల్లా వాసుల 30 ఏళ్ల కల సాకారం చేస్తున్నామని, 1996లో శంకుస్థాపన చేసిన తానే 2026లో ప్రారంభించబోతున్నానని సీఎం చెప్పారు. గత పాలకులు చేసిన డ్రామాల కారణంగా ప్రాజెక్టు తొలిదశకు ఇన్నాళ్లు పట్టిందని విమర్శించారు. వెలిగొండ తొలిదశ పూర్తి చేసి ప్రారంభించేందుకు ఈ రెండేళ్లలోనే రూ.2,250 కోట్లు ఖర్చు చేశామన్నారు. నిర్వాసితులకు మేలు చేకూర్చామని చెప్పారు. మార్కాపురం జిల్లాలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిలతో నీరు ఇవ్వబోతున్నామన్నారు. సెప్టెంబరులో హార్టికల్చర్‌ హబ్‌కు ఫౌండేషన్‌ వేయబోతున్నామని, రామాయపట్నం పోర్టు ద్వారా ఉద్యానపంటల ఎగుమతులు చేసుకునే అవకాశం ఏర్పడబోతుందని చెప్పారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తముల అశోక్‌రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు నిర్వాసితులు ఉన్నారు.


కల.. కళ్లముందుకొచ్చింది

బోగెం శ్రీనివాసులు, గుండంచర్ల నిర్వాసితుడు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన వెలిగొండ ప్రాజెక్టుగా కలగా మిగిలిపోతుందనుకున్నాం. కానీ ఇప్పుడది కళ్లముందే కనిపిస్తుండటంతో చాలా ఆనందంగా ఉంది. మన ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధైర్యపడొద్దని గతంలో చంద్రబాబునాయుడు చెప్పారు. చెప్పినట్టుగానే ప్రాజెక్టు పూర్తి చేయటమే కాకుండా నిర్వాసితులమైన మాకు పరిహారం కూడా ఇచ్చారు. మా కుటుంబంలో ఐదు ప్యాకేజీలు రావాల్సి ఉంటే అందరికీ పరిహారం అందింది.

నిర్వాసితులకు అండగా ప్రభుత్వం

ఉషమ్మ, సుంకేసుల నిర్వాసితులు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావటం చాలా సంతోషం. అంతకన్నా తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిర్వాసితుల కాలనీల్లో వసతులు కూడా కల్పిస్తున్నారు. అన్ని విధాలా అందరికీ ఉపయోగపడేలా ప్రాజెక్టును పూర్తిచేసిన ప్రజా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

Updated Date - Aug 22 , 2026 | 11:32 PM