Share News

‘పది’ మూల్యాంకనం వినూత్నం

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:37 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈనెల 6నుంచి ప్రారంభంకానున్న మూల్యాంకనాన్ని వినూత్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

‘పది’ మూల్యాంకనం వినూత్నం

సాంకేతికతకు పెద్దపీట

ట్యాబ్‌ల ద్వారా మార్కుల నమోదు

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈనెల 6నుంచి ప్రారంభంకానున్న మూల్యాంకనాన్ని వినూత్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మార్కుల నమోదు, కూడికల్లో తేడాలు రాకుండా కచ్చితత్వం కోసం సాంకేతికతను వినియోగిస్తోంది. పదో తరగతి మూల్యాంకన చరిత్రలో ప్రథమంగా మాన్యువల్‌తోపాటు ట్యాబ్‌ల ద్వారా కూడా మార్కులు నమోదు చేయాలని నిర్ణయించింది. దీనికోసం మూల్యాంకనంలో గతంలో ఒక గ్రూపులో ఒక సీఈ పరిధిలో ప్రతి ముగ్గురు ఏఈలకు ఒక స్పెషల్‌ అసిస్టెంట్‌ను నియమించేవారు. ప్రస్తుతం ట్యాబ్‌లలో మార్కుల నమోదు కారణంగా పనిభారం పెరిగినందున ప్రతి ఇద్దరు అసిస్టెంట్‌ ఎగ్జామినర్లకు ఒక స్పెషల్‌ ఆసిస్టెంట్‌ను కేటాయించారు. ప్రతిరోజూ మూల్యాంకనం చేయాల్సిన జవాబు పత్రాలు, దానికి అవసరమైన సమయం విషయంలోనూ ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు.

ప్రతి పేపరుకు 12 నిమిషాలు

జవాబుపత్రాల మూల్యాంకనంలో ప్రతి పేపర్‌కు స్పష్టమైన సమయాన్ని కేటాయించారు. ప్రతి జవాబుపత్రం మూల్యాంకనానికి 12 నిమిషాల సమయం కేటాయించారు. ప్రతిరోజూ గరిష్ఠంగా 40 పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేయాలి. గతంలో రోజుకు 50 నుంచి 60 వరకూ చేసేవారు. దీంతో మూల్యాంకనంలో నాణ్యత తగ్గి విద్యార్థులకు మార్కుల కేటాయింపులో తేడాలు వచ్చేవి. పలితంగా విద్యార్థులు నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ మూల్యాంకనం విధానాన్ని పదో తరగతికి వర్తింపజేస్తున్నారు. ప్రారంభమైన మొదటిరోజు నుంచి చివరిరోజు వరకు పూటకు 20 చొప్పున రోజుకు 40 జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించాలని నిర్ణయించారు. ఈసారి మూల్యాంకనంలో, మార్కుల్లో తేడాలు వస్తే జరిమానాలు, శిక్షలు ఉంటాయి.

ట్యాబ్‌ల ద్వారా మార్కులు

మూల్యాంకనంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. నమోదు, కూడికల్లో తేడాలతో విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో మార్కులను ట్యాబ్‌ల ద్వారా కూడా చేస్తున్నారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ జవాబుపత్రాలన్నింటినీ దిద్ది ప్రతి ప్రశ్నకు మార్కులు వేస్తారు. జవాబుపత్రానికి అనుసంధానం చేయబడిన ఓఎరఆర్‌ షీట్‌ పార్ట్‌-2లో ప్రశ్నల వారీగా మార్కులు నమోదు చేస్తారు. ఈ మార్కులను స్పెషల్‌ అసిస్టెంట్‌ ముందు మాన్యువల్‌గా పరిశీలించి ఆతర్వాత ట్యాబ్‌లో ఉన్న ప్రశ్నల వారీగా నమోదు చేస్తారు. మాన్యువల్‌గా కూడిన మార్కులతో ట్యాబ్‌లో నమోదుచేసిన మార్కులు సరిపోవాల్సి ఉంటుంది. ఏమైనా తేడా వస్తే అక్కడ వెంటనే పునఃపరిశీలన చేసి సరిచేయాలి. దీంతో విద్యార్థులకు మార్కుల్లో నష్టం జరిగే అవకాశం లేదు. తప్పులకు అవకాశం లేకుండాపోతుంది.

Updated Date - Apr 04 , 2026 | 02:37 AM