గురువే మార్గదర్శి
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:04 AM
విద్యార్థులకు తల్లిదండ్రులు జన్మనిస్తే, వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో గురువులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కలెక్టర్ రాజాబాబు
ఘనంగా గురుపూజోత్సవం
ఉత్తమ టీచర్లకు సన్మానం
ఒంగోలు విద్య, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు తల్లిదండ్రులు జన్మనిస్తే, వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో గురువులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులను వ్రేశపె ట్టిందన్నారు. ఆధునిక సాంకేతికతలను ఉపాధ్యా యులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రతివ్యక్తి సమగ్ర ఎదుగుదలలో గురువు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా ఆయన తన విద్యార్థి జీవితాన్ని గుర్తుచేసుకొని యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో జీఆర్‌ఈ, టోఫెల్ రాసి యూఎస్‌లో ఎంఎస్ చేయాలని కలలు కనేవాడినన్నారు. కానీ తన ప్రొఫెసర్ల సలహాతో ఎంఎస్ ఆలోచనను పక్కనపెట్టి ఐఏఎస్ సాధించి కలెక్టర్‌గా మీ ముందుకు వచ్చానని చెప్పారు. జిల్లాలో ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారన్నారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలపడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఈ అవార్డుల స్ఫూర్తితో మరింత కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని రాజాబాబు అభిలషించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు దైవంతో సమానమన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి పాత్ర అమోఘమని కొనియాడారు. సవాళ్లతో కూడిన విద్యాశాఖను తీసుకొని మంత్రి లోకేష్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఒడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ సమాజంలో జీవిత పాఠాలు నేర్పేది గురువులేనన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ఎన్.కాశిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్న గురువులు సదాస్మరణీయులని పేర్కొన్నారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మిన్నగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన 72మంది టీచర్లు, హెచ్‌ఎంలను కలెక్టర్, ఎంపీ సత్కరించారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. డీఈవో సీవీరేణుక అధ్యక్షతన జరిగిన సభలో ఏపీసీ అనిల్‌కుమార్, ఉప విద్యాధికారులు రంగయ్య, రవి, డీసీబీ కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, ఒంగోలు ఎంఈవో కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.