శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:03 AM
మహాశివరాత్రి పర్వదిన వేడుకలను పర్చూరు నియోజకవర్గ పరిధిలోని శివాలయాల్లో విశేష పూజలు చేశారు.
పర్చూరు/కారంచేడు, ఫిబ్రవరి 15 (ఆంఽధ్రజ్యోతి) : మహాశివరాత్రి పర్వదిన వేడుకలను పర్చూరు నియోజకవర్గ పరిధిలోని శివాలయాల్లో విశేష పూజలు చేశారు. వేకువజాము నుంచే ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. చెరుకూరు అగస్తేశ్వరస్వామి, పర్చూరు భీమేశ్వరస్వామి, అడుసుమల్లి గౌరీ శంకరస్వామి, నూతలపాడు కోటేశ్వరస్వామి, కారంచేడులోని మల్లే శ్వరస్వామి, కట్టమల్లేశ్వరస్వామివార్ల ఆలయాల్లో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు పర్చూరు గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాణాధికారి దామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో రుద్రాభిషేకం, బిల్వార్చన, లింగార్చన వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మార్టూరు : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచి శివాలయాలకు భక్తు లు బారులు తీరారు. పట్టణంలోని నేతాజీనగర్ సమీపంలోని ఘట్టేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయం ఆవరణలోని శివలింగానికి భక్తులుపూలతో, పాలతో అభిషేకం చేశారు. జాతీయరహదారి పక్కన ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలు చేశారు. నాగరాజుపల్లి శివాలయంలో యద్దనపూడి అనంతవరం గ్రామంలో శ్రీగంగాపార్వతీ భోగమల్లేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి.
ఇంకొల్లు : మండలంలోని శివాలయాలు మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం శివనామస్మరణతో మార్మోగాయి. ఇంకొల్లు, కొణికి, పావులూరు, భీమవరం గ్రామాలలోని శివాలయాలను విద్యుత్‌దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి శివాలయాల్లో భక్తులు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. గంగవరం శివాలయ ఆవరణలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఇంకొల్లు భీమలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో దాతల సహాకారంతో ప్రసాదాలను పంపిణీ చేశారు. భీమవరం పుట్టవద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చినగంజాం : మండలంలోని సోపిరాల గ్రామంలోని లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వరస్వామి ఆలయం, కొత్తపాలెం గ్రామంలోని బాలకోటేశ్వర స్వామి ఆలయాలలో మహాశివరాత్రి తిరునాళ్లను ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. భక్తులు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. లింగోద్భవ కాలం నుంచే భక్తులు కైలాసనాధుని దర్శించుకొన్నారు. ఆలయాల వద్ద డిజిటల్ విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన శివపార్వతులు, కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి, అయ్యప్పస్వామి, దేవాలయాల కటౌట్‌లు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరునాళ్ల సందర్భంగా రామకోటేశ్వరస్వామి ఆలయం వద్ద ఎనిమిది భారీ డిజిటల్ ప్రభలు, బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆరు భారీ విద్యుత్ ప్రభలను పోటాపోటిగా ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రభల వద్ద టీవీ కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ యాంకర్‌లచే నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు భక్తులను ఆలరింపజేశాయి. కడవకుదురు గంగా పార్వతి గోకర్ణేశ్వరస్వామి, చినగంజాం గంగా పార్వతి సమేత చిదంబరేశ్వరాలయం, పెదగంజాం ఈశ్వరాలయం, సంతరావూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. తిరునాళ్ల సందర్భంగా చినగజాంలో చీరాల డీఎస్పీ మహమ్మద్ మెయిన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోపిరాల గ్రామంలోని లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వరస్వామి ఆలయంలో, హరిహర సుత్ర అయ్యప్పస్వామిని, కొత్తపాలెం గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి ఆలయాలలోని స్వామి వార్లను ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు దేవాలయాల కమిటి చైర్మన్‌లు డాక్టర్ టీ.ఎస్.ఆర్.ఆంజనేయులు, కుక్కల రామకృష్ణారెడ్డి, చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.