Share News

మురిపిస్తున్న మిర్చి

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:36 AM

మిర్చి రైతులను మురిపిస్తోంది. ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో తెగుళ్లు తగ్గి దిగుబడులు కూడా ఆశాజనకంగా వస్తున్నాయి. దీంతో పంట సాగుచేసిన వారిలో ఆనందం కనిపిస్తోంది.

మురిపిస్తున్న మిర్చి

ఆశాజనకంగా దిగుబడులు

పెరుగుతున్న ధరలు

అదుపులోకి తెగుళ్లు

ఆనందంలో సాగుదారులు

దర్శి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : మిర్చి రైతులను మురిపిస్తోంది. ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో తెగుళ్లు తగ్గి దిగుబడులు కూడా ఆశాజనకంగా వస్తున్నాయి. దీంతో పంట సాగుచేసిన వారిలో ఆనందం కనిపిస్తోంది. దర్శి ప్రాంతంలో ఈఏడాది మిర్చిని గణనీయంగా సాగుచేశారు. రెండు నెలల క్రితం సంభవించిన మొంథా తుఫాన్‌తో తోటలు దెబ్బతిన్నాయి. అనంతరం తెగుళ్ల దాడి పెరగడంతో రైతులు ఆందోళన చెందారు. ముందులను పిచికారీ చేసి తోటలను కాపాడుకున్నారు. ప్రస్తుతం తెగుళ్లు చాలావరకు తగ్గి తోటలు కళకళలాడుతున్నాయి. దిగుబడులు ఆశాజనకంగా వస్తున్నాయి. అదేసమయంలో మార్కెట్‌లో ధరలు పెరుగుతు న్నాయి. ప్రస్తుతం గుంటూరు యార్డులో మేలు రకమైన యూఎస్‌ 341 రకం మిర్చి క్వింటా రూ.23వేలు పలుకుతోంది. రెండు నెలల క్రితం ఈ రకం ధర రూ.15 వేల వరకే ఉంది. ప్రస్తుతం క్వింటాకు రూ.8వేలు పెరగటంతో రైతులు ముమ్మరంగా విక్రయిస్తున్నారు. తేజ రకం కాయలను బట్టి క్వింటా రూ.15వేల నుంచి రూ.18 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇది గత రెండు నెలలతో పోల్చితే క్వింటాకు రూ.6వేలు పెరిగింది. ఈ ఏడాది మిర్చి సాగుకు ఎకరాకు సగటున రూ.3లక్షల వరకు ఖర్చయింది. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేసూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు, వడ్డీలు పోను కొంతమేర లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jan 24 , 2026 | 01:36 AM