పాకల తీరం పిలుస్తోంది..
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:08 AM
శివరాత్రి పర్వదినం సందర్భంగా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో నిర్వహించతలపెట్టిన బీచ్ ఫెస్టివల్‌కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు ఆ ప్రాంత కీలక నేతలు, ఇటు జిల్లా ఉన్నతాధికారులు ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
బీచ్ ఫెస్టివల్‌కు భారీ ఏర్పాట్లు
14, 15 తేదీల్లో సాగరాన నిర్వహణ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం
తాజాగా కందుకూరు, కనిగిరి, పొదిలిలో 2కే రన్‌ల నిర్వహణ
ముఖ్య నేతలు, అధికారులు హాజరు
తొలిరోజు తరలిరానున్న మంత్రులు
విభిన్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు
విన్యాసాలు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు
నిర్వహణలో కీలకంగా దామచర్ల సత్య
రోజుకు 50వేల మంది వస్తారని అంచనా
ఒంగోలు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : శివరాత్రి పర్వదినం సందర్భంగా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో నిర్వహించతలపెట్టిన బీచ్ ఫెస్టివల్‌కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు ఆ ప్రాంత కీలక నేతలు, ఇటు జిల్లా ఉన్నతాధికారులు ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇతర జిల్లాలతో పోల్చితే మన జిల్లాలో పెద్దగా బీచ్‌లు లేవు. ఒంగోలు సమీపంలో కొత్తపట్నం పల్లెపాలెం, సింగరాయకొండ మండలం పాకల వద్దనే అంతో ఇంతో బీచ్ వాతావరణం ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో నాడు కొండపి ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ స్వామి పాకల వద్ద పలు అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆయ న మంత్రిగా ఉన్నారు. కొండపి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు చూస్తున్న దామచర్ల సత్య రాష్ట్రప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మారిటైం బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఆప్రాంతానికే చెందిన నూకసాని బాలాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఈనేపథ్యంలో పాలక బీచ్ ఫెస్టివల్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ రాజాబాబు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఫెస్టివల్‌పై విస్తృత ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయాశాఖల నుంచి నిధుల సాధన, ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వామి, సత్య, కలెక్టర్ రాజాబాబు ఉమ్మడి ప్రయత్నంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈక్రమంలో టూరిజం శాఖ, మారిటైం బోర్డు ద్వారా కొంతమేర నిధులు కూడా సమకూరుతున్నాయి. దీంతో బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. బీచ్ ఫెస్టివల్‌పై విస్తృత ప్రచారం చేపట్టారు. ఈనెల 8న పాకల బీచ్ ప్రాంతంలో మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు, కార్పొరేషన్ చైర్మన్లు దామచర్ల సత్య, నూకసాని బాలాజీలు పాల్గొని బీచ్ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి కార్యక్రమాన్ని వేలాదిమంది విద్యార్థులతో నిర్వహించారు. అలాగే బీచ్ ఫెస్ట్‌వల్ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు, ప్రచారానికి సంబంధించిన ఏవీని విడుదల చేశారు.
కోలాహలంగా 2కే రన్‌లు
బీచ్ ఫెస్టివల్‌పై ప్రచారంలో భాగంగా మంగళవారం కందుకూరు, కనిగిరి, పొదిలిలలో 2కే రన్‌లు కోలాహలంగా సాగాయి. కనిగిరిలో వందలాది మందితో అక్కడి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సారధ్యంలో రన్ నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సారథ్యంలో 2కే రన్ ఉత్సాహంగా సాగింది. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సబ్‌కలెక్టర్ హిమవంశీ ఇతర అధికారులు, వివిధ రంగాల వారు పాల్గొన్నారు. సాయంత్రం పొదిలిలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సారథ్యంలో 2కే రన్ చేపట్టారు. దామచర్ల సత్య, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మితోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. రాత్రి ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్‌లో బీచ్ ఫెస్టివల్‌పై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి బీచ్ ఫెస్టివల్‌కు వచ్చేవారికి ఉచితంగా వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సాంస్కృతికం.. ఆహ్లాదకరం..
పాకల బీచ్ వద్ద రెండు రోజులపాటు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్, రైడింగ్, బోటు రైడింగ్, పారా రైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులపాటు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సాధారణంగా పండుగ సమయంలో పది వేల మంది వరకు పాకల బీచ్‌ను సందర్శిస్తుండగా ఈ ఫెస్టివల్ శివరాత్రి సమయంలో నిర్వహిస్తుండటంతో రోజుకు 30 వేల నుంచి 50 వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులు అనేకమంది తరలివస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల కార్యక్రమంలో 15వతేదీ శివరాత్రి పర్వదినం కావడంతో ప్రముఖలంతా తొలిరోజైన 14న హాజరుకానున్నారు. ఆ రోజు శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రతిపాదన ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం శాసనసభకు హాజరై సాయంత్రం బీచ్ ఫెస్టివల్‌కు వస్తారని సమాచారం. మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి ఆ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆయనతోపాటు జిల్లాకు చెందిన మరో మంత్రి డాక్టర్ గొట్టిపాటి రవికుమార్, ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇతర మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌లు వస్తున్నట్లు సమాచారం. కాగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కీలకంగా వ్యవహరిస్తూ అక్కడ ఏర్పాట్లు, నేతలతో సమన్వయం చేస్తున్నారు.