Share News

బడిగంట మోగింది

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:03 AM

వేసవి సెలవుల అనంతరం శుక్రవారం మళ్లీ బడి గంటలు మోగాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు స్కూళ్లలోకి అడుగుపెట్టారు. కొన్ని పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల కేరింతలతో పండుగ వాతావరణం నెలకొంది.

బడిగంట మోగింది
ఒంగోలులో పాఠశాలకు హాజరైన విద్యార్థినులకు చాక్లెట్లను అందజేస్తున్న డీఈవో రేణుక

మొదటి రోజు ఆటపాటలతో సరదాగా సాగిన తరగతులు

466 మంది టీచర్లు ఆలస్యంగా రాక

ఒంగోలు విద్య, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : వేసవి సెలవుల అనంతరం శుక్రవారం మళ్లీ బడి గంటలు మోగాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు స్కూళ్లలోకి అడుగుపెట్టారు. కొన్ని పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల కేరింతలతో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు తరగతి గదులు, పాఠాల జోలికి వెళ్లకుండా ఉపాధ్యాయులు ఆటపాటలతో సరదాగా గడిపారు. చిన్నారులతో మమేకమై వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుని పాఠశాలల్లోకి స్వాగతించారు. మొదటి రోజు శుభసూచికంగా మధ్యాహ్న భోజనంలో స్వీట్‌ పొంగల్‌ వడ్డించారు. కొత్తగా పాఠశాలల్లో చేరిన వారు నూతన వస్త్రాలు ధరించి బుడిబుడి అడుగులతో బడిబాట పట్టారు. తొలిరోజు విద్యార్థుల హాజరుపై సెంటిమెంట్‌ ప్రభావం పడింది. శుక్రవారం ద్వాదశి తిధి కావడంతో సెంటిమెంట్లు చూసే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఇష్టపడలేదు. దీనికితోడు రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో ద్వితీయ విజ్ఞం ఉండకూడదని కొందరు పంపలేదు. సోమవారం అమావాస్య కావడంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో బుధవారం నుంచి బడులకు హాజరుకానున్నారు. జిల్లాలోని మొత్తం 1,980 పాఠశాలల్లో మొదటి రోజు 2,04,269 మందికి 1,47,412 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు 60శాతం ఉంది. మొత్తం 6,744 మంది టీచర్లకు ఉదయం పది గంటలకు 6,278 మంది హాజరు కాగా 466 మంది గైర్హాజరయ్యారు.

తొలిరోజే పుస్తకాల పంపిణీ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లలో కొన్నింటిని అందజేశారు. పాఠ్య, నోటు పుస్తకాలు, డిక్షనరీలు, మూడు జతల యూనిఫాంను పంపిణీ చేశారు. విద్యార్థిమిత్ర కిట్లలోని బ్యాగులు, షూలు ఇంకా పాఠశాలలకు సరఫరా కాకపోవడంతో వాటిని మాత్రం తర్వాత అందజేస్తారు. డీఈవో రేణుక మొదటి రోజు స్థానిక బండ్లమి ట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను, సంతనూ తలపాడు మండలం ఎండ్లూరు ఎంపీయూపీ స్కూలును సందర్శించారు. విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కొన్ని చోట్ల చాక్లెట్లను ఇచ్చారు. ఒంగోలులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇప్పటి వరకు 155మంది కొత్త విద్యార్థులు చేరిక పట్ల హెచ్‌ఎం, సిబ్బందిని డీఈవో అభినందించారు.

Updated Date - Jun 13 , 2026 | 03:03 AM