Share News

అదే తీరు..

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:15 AM

పొగాకు మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తెస్తున్న ఒత్తిడిని వ్యాపారులు అంతగా పట్టించుకొంటున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో స్వయంగా సీఎం ఒకటికి రెండుసార్లు సమీక్షలు చేసి పలు ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్రమంత్రుల బృందం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలోని కీలక మంత్రులు హామీలు ఇచ్చి తద నుగుణంగా వ్యాపారులకు సూచనలు చేసినా ఇక్కడ మార్కెట్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు.

అదే తీరు..

వ్యాపారులపై పనిచేయని ప్రభుత్వాల ఒత్తిడి

మెరుగుపడని పొగాకు కొనుగోళ్లు

పలు కేంద్రాల్లో 30నుంచి 45శాతం బేళ్లు నోబిడ్‌

రూ.200కు దిగువగానే నాణ్యమైన గ్రేడ్‌ల ధర

నేటి నుంచి ఎస్‌కేఎం ఆధ్వర్యంలో రైతు సంఘాల ప్రచారయాత్ర

ఒంగోలు, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తెస్తున్న ఒత్తిడిని వ్యాపారులు అంతగా పట్టించుకొంటున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో స్వయంగా సీఎం ఒకటికి రెండుసార్లు సమీక్షలు చేసి పలు ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్రమంత్రుల బృందం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలోని కీలక మంత్రులు హామీలు ఇచ్చి తద నుగుణంగా వ్యాపారులకు సూచనలు చేసినా ఇక్కడ మార్కెట్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. దక్షిణాదిలోని రెండు రీజియన్ల పరిధిలో వేలం తీరును పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. నోబిడ్‌లు లేకుండా చూడటం, కిలో సగటు ధర రూ.200కు తగ్గకుండా ఇవ్వడం, కొనుగోళ్లు వేగవంతం వంటి ఆదేశాలు, సూచనలు ప్రభుత్వం నుంచి పదేపదే వస్తున్నా ఇక్కడ మార్కెట్లో మాత్రం పరిస్థితి మెరుగుపడటం లేదు. ఒక రోజు సగటున 25శాతం నోబిడ్‌లు ఉంటే మరోరోజు 30శాతం ఉంటోంది. పేరుకు గరిష్ఠ ధర కిలో రూ.250 పలుకుతున్నప్పటికీ నాణ్యమైన గ్రేడ్‌లలో అధికశాతం బేళ్లకు కిలో రూ.200 కన్నా తక్కువగానే ధరలు దక్కుతున్నాయి. ఆ ప్రభావం సగటు ధరలపై పడుతోంది. దక్షిణాది మార్కెట్లో బుధవారం కొనుగోళ్ల తీరును పరిశీలిస్తే సగం కేంద్రాల్లో 30 నుంచి 45శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. ఈ ప్రాంతంలోని 11 కేంద్రాలకు బుధవారం 7,107 బేళ్లు వేలానికి తీసుకురాగా 4,694 కొనుగోలు చేశారు. మిగిలిన 2,413లో 1,981 నోబిడ్‌ అయ్యాయి. అంటే వేలంకు వచ్చిన బేళ్లలో సుమారు 27.80 శాతంను అధికారులు సూచించిన ధరలకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్‌ అయ్యాయి. గరిష్ఠంగా కనిగిరిలో 45.67శాతం నోబిడ్‌ కాగా పొదిలిలో 43.73శాతం, ఒంగోలు-1లో 38.62శాతం, టంగుటూరులో 37.86శాతం, వెల్లంపల్లిలో 37.55శాతం ఒంగోలు-2లో 30.71శాతం నోబిడ్‌ అయ్యాయి. అధికశాతం బేళ్ల ధరలు కిలో రూ.160 నుంచి రూ.200లోపుగానే పలుకుతున్నాయి.

రెండో దశ ఆందోళనకు సిద్ధం

పొగాకు రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) భాగస్వామ్య రైతు సంఘాలు రెండో దశ ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు ఇచ్చి కొనుగోళ్లకు రావాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 29న జాతీయ రహదారుల దిగ్బంధంకు పిలుపునిచ్చిన ఆ సంఘాలు అందుకు రైతులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇటీవల వారంరోజులపాటు ప్రధాన గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించిన వారు గురువారం నుంచి పొగాకు అధికంగా పండే గ్రామాల్లో ప్రచార బైక్‌ ర్యాలీలు చేపడుతున్నాయి. ఒంగోలు రూరల్‌ మండలం కరవదిలో గురువారం ఈ కార్యక్రమం ప్రారంభమై ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు మండలాల్లో నుంచి రాత్రికి మద్దిపాడు మండలం దొడ్డవరం వరకు సాగనుంది. 24న చీమకుర్తి, ఎస్‌ఎన్‌పాడు, 25న కొండపి, జరుగుమల్లి, వీవీపాలెం, 26న వీవీపాలెం, కందుకూరు మండలాల్లోని గ్రామాల్లో సాగనుంది.

Updated Date - Jul 23 , 2026 | 03:15 AM