ఏరు మాదే.. పొలాలూ మావే!
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:27 AM
పాలేరు తీర గ్రామాల మధ్య ఇసుక వ్యవహారం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పుడు ఏకంగా ఓ గ్రామం వారి రక్షిత నీటి పథకం పైపులైన్లు, రాకపోకలు సాగించే రోడ్డును పాలేరు తీరంలోని మరోవైపు గ్రామం వారు ధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ భూముల్లోని జామాయిల్ చెట్లను కూడా తొలగించారు.
దావగూడూరు వాసులకు రామనాథపురం గ్రామస్థుల బెదిరింపులు
పాలేరులో రాకపోకలు సాగకుండా ఎక్స్‌కవేటర్‌తో అడ్డుగా కాలువలు
రక్షిత తాగునీటి పథకం పైపులైన్లు, విద్యుత్ లైన్లు ధ్వంసం
పొలాల్లోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ రైతులు
జామాయిల్ చెట్లను అక్రమంగా తొలగించి ఇసుక తవ్వకాలు
పాలేరులోకి రాకుండా రోడ్డు ఛిద్రం, పశుపోషకులకు హెచ్చరికలు
రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని రైతుల వేడుకోలు
దావగూడూరు (కొండపి), జూలై 6 (ఆంధ్రజ్యోతి) : పాలేరు తీర గ్రామాల మధ్య ఇసుక వ్యవహారం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పుడు ఏకంగా ఓ గ్రామం వారి రక్షిత నీటి పథకం పైపులైన్లు, రాకపోకలు సాగించే రోడ్డును పాలేరు తీరంలోని మరోవైపు గ్రామం వారు ధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ భూముల్లోని జామాయిల్ చెట్లను కూడా తొలగించారు. దీంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జరుగుమల్లి మండలంలోని పాలేరుకు ఉత్తరం వైపున కిలోమీటర్ దూరంలో దావగూడూరు గ్రామం ఉంటుంది. దక్షిణం వైపున ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో కందుకూరు మండలంలోని రామనాథపురం ఉంది. దావగూడూరుకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఇతర రైతులకు చెందిన 125ఎకరాల భూములు పాలేరుకు దక్షిణం వైపున ఉన్నాయి. ఈ ఇసుక భూముల్లో దశాబ్దాలుగా జామాయిల్ చెట్లను పెంచుతున్నారు. దావగూడూరుకు చెందిన రక్షిత తాగునీటి పథకం బావి, మోటార్ షెడ్డు కూడా పాలేరుకు దక్షిణం ఒడ్డున ఉన్నాయి. దావగూడూరు గ్రామానికి చెందిన రైతులు పాలేరులో నుంచి రోడ్డు ఏర్పాటు చేసుకొని తమ పొలాలకు రాకపోకలు సాగించడం, పంట ఉత్పత్తులను తెచ్చుకోవడం, పశుపోషకులు ఏటి వెంట మేపుకోవడం చేస్తుంటారు.
ఇసుకపై కన్నేసి.. రోడ్డును తవ్వేసి..
పాలేరుకు దక్షిణం వైపున ఉన్న ఎస్సీ, ఎస్టీల భూముల్లో ఇసుక ఉంది. దానిపై రామనాథపురం గ్రామానికి చెందిన కొందరు ఇసుక వ్యాపారులు కన్నేశారు. పాలేరు తమ గ్రామానికి చెందినదని, మీరు ఏరు దాటి రావడానికి వీలు లేదంటూ గతనెల 23న ఏటిలో నుంచి దావగూడూరు వాసులు రాకపోకలు సాగించే రోడ్డును ఎక్స్‌కవేటర్‌తో తొలగించి కాలువ మాదిరిగా తవ్వారు. జమాయిల్ చెట్లను తొలగించి పెద్దపెద్ద గోతులు చేసి ఇసుకను తవ్వారు. ఏరు మాదని, మీరు భూముల్లోకి రావడానికి వీలు లేదంటూ పదేపదే తమను బెదిరిస్తున్నారని దావగూడూరు గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు కొమ్ము ఏలియా, సురేష్, చినబాబు, మధుబాబు ఆంరఽధజ్యోతికి తెలిపారు. తమ జామాయిల్ చెట్లను కొట్టేసి ఇసుక తీసుకెళ్లిన గుంతలను వారు చూపించారు.
ఎక్స్‌కవేటర్ అడ్డగింత...
దావగూడూరు రక్షిత పథకం పైపులైన్లను, విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేయడంతో తాము తమ గ్రామం వైపు పాలేరు ఒడ్డున బోరు ఏర్పాటు చేసుకుని తాగునీటి పథకానికి అనుసంధానం చేసుకున్నామని గ్రామానికి చెందిన రైతు బండ్లమూడి నర్సింగరావు తెలిపారు. గడచిన నెల 23న పాలేరులోని రోడ్డులో రాకపోకలు సాగించకుండా ఎక్స్‌కవేటర్‌తో పెద్ద కాలువను తవ్వుతుండగా తమ గ్రామానికి చెందిన 40మంది అడ్డుకున్నామని వివరించారు. పాలేరు నుంచి తమ గ్రామానికి చెందిన వారు ఇసుక తోలుకోకుండా ఏటిలో కందకాలు తవ్వుతున్నారన్నారు. తమకు హక్కు ఉన్నా ఒక్క ట్రాక్టరు ఇసుకను ఇళ్ల నిర్మాణాలకు తోలుకోలేకపోతున్నామని వాపోయారు. రామనాథపురం గ్రామానికి చెందిన ఇసుక వ్యాపారులు తమ గ్రామ ఎస్సీ, ఎస్టీ రైతుల భూముల్లోని చెట్లను తొలగించి ఇసుక ఎత్తుకుపోయి విక్రయించుకుంటున్నారని, అదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మంత్రి స్వామి, రెవెన్యూ జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.