Share News

అభివృద్ధి బాధ్యత నాది

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:04 AM

‘మార్కాపురం జిల్లా ఇచ్చా. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్‌ హబ్‌లో చేర్చా. వెలిగొండను పూర్తి చేస్తా.. ఇన్ని ఇచ్చిన నాకు మీరు అండగా నిలవాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. వెలిగొండ నిర్వాసితులకు పరిహారం కింద మంజూరు చేసిన రూ.905 కోట్లలో శనివారం రూ.300 కోట్లను సీఎం దోర్నాల మండలం గంటవానిపల్లిలో విడుదల చేశారు.

అభివృద్ధి బాధ్యత నాది
దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ నిర్వాసితులనుద్దేశించి మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

మార్కాపురానికి అన్నీ చేస్తా

మీ భవిష్యత్తుకు అండగా ఉంటా

జిల్లా ఇచ్చా, హార్టికల్చర్‌ హబ్‌లో చేర్చా

జూలై ఆఖరుకు వెలిగొండ తొలిదశ పూర్తి

రైతులు, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు

మార్కాపురం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘మార్కాపురం జిల్లా ఇచ్చా. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్‌ హబ్‌లో చేర్చా. వెలిగొండను పూర్తి చేస్తా.. ఇన్ని ఇచ్చిన నాకు మీరు అండగా నిలవాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. వెలిగొండ నిర్వాసితులకు పరిహారం కింద మంజూరు చేసిన రూ.905 కోట్లలో శనివారం రూ.300 కోట్లను సీఎం దోర్నాల మండలం గంటవానిపల్లిలో విడుదల చేశారు. నమూనా చెక్కును నిర్వాసితులకు అందజేశారు. అంతకుముందు సీఎం వెలిగొండ ఫీడర్‌ కాలువను పరిశీలించారు. అనంతరం గంటవానిపల్లి సమీపంలోని పొలాల్లో రైతులు, నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. మార్కాపురం కలెక్టరేట్‌కు నూతన భవన నిర్మాణం చేపట్టబోతున్నామని, అదికూడా నిర్వాసితుల కాలనీలో ఏర్పాటు కావడం మీరు ఊహించనిదని చెప్పారు. ఈ కరువు ప్రాంత జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తిగా అనంతపురానికి చెందిన మహిళా కలెక్టర్‌ను ఇక్కడ నియమించానని అన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి చెందేలా హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటైందని, ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఆగ్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. రామాయపట్నం పోర్టు కూడా జిల్లాకు అందుబాటులో ఉందని, రైతుల ఎగుమతులకు కూడా అనువుగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. రోడ్లు, రైల్వే లైన్లు కూడా అభివృద్ధి చేసి మార్కాపురానికి అన్ని వైపుల నుంచి కనెక్టవిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంటే మీరు మాత్రం ఎన్నికలు రాగానే కులం, పార్టీ అంటూ వైకుంఠపాళీ ఆడుతున్నారని, దానివల్ల అభివృద్ధి మళ్లీ అట్టడుగుకు చేరుతుందని ప్రజలనుద్దేశించి అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ప్రజలు ఆశీర్వదించి కూటమికి అండగా నిలిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి, అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో బ్రేక్‌ పడిందని చెప్పారు. ఆ తరువాత ఎక్కడా ఎదురు లేకుండా రాయలసీమ వరకు విజయపరంపర కొనసాగిందన్నారు. ‘ఈసారి ప్రజలు ఆలోచించాలి. ఏ పార్టీ ఉంటే మాకెందుకులే అనే భావన పోవాలి. చైతన్యం రావాలి’ అని హితవుపలికారు. ‘మీ బాఽధ్యత నేను తీసుకుంటా.. నాకు అండగా మీరుండాలి’ అని కోరారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఆదరించే నాయకులనే ఎంపిక చేస్తానన్నారు. అందరి ఆమోదంతోనే నాయకులు ఉంటారని, కానీ అలాంటి వారు దొరకడం అరుదుగా ఉందని చెప్పారు.

జూలై 31 నాటికి వెలిగొండ ఫేజ్‌-1 పూర్తి

వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1 పనులు జూలై 31 నాటికి పూర్తి చేస్తామని ఆ తరువాత వరద నీరు రాగానే నల్లమల సాగర్‌కు నీళ్లిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఫేజ్‌-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ప్రాజెక్ట్‌ను విస్మరిస్తే కూటమి అధికారంలోకి వచ్చాక రూ.759 కోట్లు ఖర్చుచేసి పనులు వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పుడు నిర్వాసితుల కోసం రూ.905 కోట్లు మంజూరు చేసి అందులో రూ.300 కోట్లను తొలివిడతగా 2,351 మంది నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్ట్‌ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక్కడే పుట్టినరోజు కూడా జరుపుకున్నారని సీఎం గుర్తుచేశారు. నిర్వాసితుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న ఆయన.. జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. వెలిగొండ ఫేజ్‌-2 పనులు కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేసి శంకుస్థాపన చేసిన నేనే వెలిగొండను ప్రారంభిస్తానని ప్రకటించారు. వెలిగొండ నిర్మాణం ఒక చరిత్రగా నిలుస్తుందని చెప్పారు. ఫేజ్‌-2 ద్వారా 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు అందిస్తామన్నారు. జిల్లాలో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా తాగునీరు అందించే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

గంటకుపైగా రైతులతో ముఖాముఖి

గంటవానిపల్లిలోని హెలిప్యాడ్‌ వద్దకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న సీఎం దాదాపు గంటకు పైగా రైతులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఫీడర్‌ కాలువ పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి ప్రారంభోపన్యాసం చేశారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. నిర్వాసితులకు పరిహారం అందజేస్తున్నందుకు ఆనందభాష్పాలతో కొందరు సీఎంకు పాదాభివందనం చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ ఎం.విజయసునీత, జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 03:04 AM