స్పందన అంతంతే!
ABN , Publish Date - Jun 18 , 2026 | 02:56 AM
ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) అంతంతమాత్రంగానే సాగుతోంది. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ‘సర్’
ప్రకాశంలో 1.47లక్షల మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల అందజేత
బీఎల్వోలకు తిరిగొచ్చింది కేవలం 4,213
మార్కాపురంలో 1,31,152 పంపిణీ
3,018 మంది సమాచారం డిజిటలైజేషన్
ఒంగోలు కలెక్టరేట్ / మార్కాపురం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) అంతంతమాత్రంగానే సాగుతోంది. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. ప్రకాశంలో 1,649 పోలింగ్ కేంద్రాల పరిధిలో 13.99 లక్షల మంది ఓటర్లు ఉండగా బూత్ లెవల్ అధికారులు 1,586 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం సర్వే చేశారు. ఈనెల 15వతేదీ నుంచి బుధవారం వరకు 1,47,155 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. అయితే వాటిని పూర్తిచేసి కేవలం 4,213మంది ఓటర్లు మాత్రమే తిరిగి బీఎల్‌వోలకు ఇచ్చారు. సర్ కార్యక్రమాన్ని ఈసారి ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో పోలింగ్ కేంద్రాల పరిధిలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. 2002 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేస్తుండటం, కొంతమంది వద్ద అప్పటి ఓటరు ఐడీ కార్డులు లేకపోవడంతో బీఎల్వోలే ఆన్‌లైన్‌లో చూసి ఆ వివరాలను చెప్పాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతుండగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా బీఎల్వోలకు సహకరిస్తున్నారు. అయితే ఎన్యుమరేషన్ ఫాంలను ఓటర్లు తిరిగి ఇవ్వడంలో కొంతజాప్యం జరుగుతుండటంతో వాటిని ఆన్‌లైన్ చేయడం ఆలస్యమవుతోంది.
మార్కాపురం జిల్లాలో..
మార్కాపురం జిల్లాలో ‘సర్’ లో భాగంగా మూడు రోజుల్లో 1,31,152 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. 15వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాలోని 1,103 మంది బూత్ లెవల్ అధికారులు పాల్గొంటున్నారు. 108 మంది సూపర్ వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 9,08,772 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలు జిల్లాకు చేరాయి. ప్రతి ఇంటికీ బీఎల్వోలు మూడు సార్లు వెళ్తారు. వారు ఇచ్చిన ఫారాలు నింపి ఓటర్లు తిరిగి అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ 3,018 మందికి సంబంధించిన సమాచారం డిజిటలైజేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
-------------------------------------------------