Share News

స్పందన అంతంతే!

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:31 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచరు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)కు అభ్యర్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.

స్పందన అంతంతే!

ఎయిడెడ్‌ సీబీటీకి రాని అభ్యర్థులు

14 పోస్టుల భర్తీకి పరీక్షలు

మొత్తం 1,937 మంది దరఖాస్తు

20శాతం లోపుగానే హాజరు

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచరు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)కు అభ్యర్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఆశించిన సంఖ్యలో హాజరుకావడం లేదు. ఒంగోలు ఏబీఎం హైస్కూలు గ్రేడ్‌-1 తెలుగు, హిందీ ఒక్కొక్కటి, ఎస్జీటీ 2, పీఈటీ ఒకటి మొత్తం 5 పోస్టులకు... కనిగిరి చిత్తరంజన్‌ అరబిక్‌ ఎలిమెంటరీ స్కూలులో 3 ఎస్జీటీ పోస్టులు, చీరాల ఎంఎస్‌ హైస్కూలులో స్కూలు అసిస్టెంట్‌ సోషల్‌, గణితం, తెలుగు ఒక్కొక్కటి కలిపి 3 పోస్టులు, జె.పంగులూరు మండలం ముప్పవరం పీఎస్‌ఎన్‌సీసీ హైస్కూలులో స్కూలు అసిస్టెంట్‌ తెలుగు, గణితం, సైన్స్‌ ఒక్కొక్కటి చొప్పున 3 మొత్తం 14 పోస్టులు భర్తీ చేసేందుకు విద్యాశాఖ సీబీటీ నిర్వహిస్తోంది. ఈ 14 పోస్టులకు మొత్తం 1,937 మంది అంటే సగటున ఒక్కో పోస్టుకు 138 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒంగోలు, కనిగిరి పాఠశాలల పోస్టులకు ఒంగోలులో, చీరాల, ముప్పవరంలోని పోస్టులకు వేటపాలెం సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీబీటీ నిర్వహిస్తున్నారు.

పరీక్షకు తక్కువ మంది హాజరు

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ పట్టుదలగా నిర్వహిస్తున్న సీబీటీకి అభ్యర్థులు హాజరు అంతంత మాత్రంగానే ఉంది. శనివారం సెయింట్‌ ఆన్స్‌లో మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 10.30 వరకు జరిగిన పరీక్షకు 117 మందికి 20మంది, రెండో సెషన్‌ మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు జరిగిన పరీక్షకు 117 మందికి 18మంది, మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు నిర్వహించిన పరీక్షకు 120మందికి 30మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఆదివారం ఒంగోలు సెంటర్‌లో నగరంలోని ఏబీఎం స్కూలులో ఎస్జీటీ పోస్టుకు మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 220మందికి 83మంది అభ్యర్థులు మాత్రమే వచ్చారు. సోమవారం ఒంగోలు పరీక్షా కేంద్రంలో ఏబీఎం హైస్కూలులో పీఈటీ పోస్టు భర్తీకి నిర్వహించిన సీబీటీకి 57కి 30మంది, అదే పాఠశాలలో గ్రేడ్‌ 1 తెలుగు పండిట్‌ పోస్టుకు నిర్వహించిన పరీక్షకు 139 మందికి కేవలం 31మంది మాత్రమే హాజరయ్యారు. మధ్యాహ్నం కనిగిరిలోని చిత్తరంజన్‌ అరబిక్‌ ఎలిమెంటరీ స్కూలులో మూడు సెకండరీ గ్రేడు టీచరు పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 48 మందికి 11 మంది హాజరయ్యారు. వివిధ పోస్టులకు ఈనెల 26 వరకు పరీక్షలు జరగనున్నాయి.

Updated Date - Feb 25 , 2026 | 02:31 AM