స్పందన అంతంతే!
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:35 AM
ఇంటర్మీడియట్‌లో ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సంస్కరణలకు విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చింది.
ఇంటర్‌లో సబ్జెక్టుల మార్పునకు ఆసక్తి చూపని విద్యార్థులు
జిల్లాలో ఏడుగురు మాత్రమే సుముఖత
ఒంగోలు విద్య, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్‌లో ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సంస్కరణలకు విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చింది. ఏళ్లు గా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులకు భిన్నంగా విద్యా ర్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించింది. సైన్స్‌లో ఇప్పటివరకు బైపీసీ, ఎంపీసీ గ్రూపులు మాత్రమే ఉండేవి. ఎంపీసీ విద్యార్థులు మాత్రమే జేఈఈ (ఇంజనీరింగ్), బైపీసీ విద్యార్థులకే నీట్ (మెడిసిన్) ప్రవేశపరీక్ష రాసే అవకాశం ఉంది. అయితే ఎంపీసీ, బైసీపీ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన జేఈఈ నీట్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా ఎంబైపీసీ కోర్సును ప్రారంభించారు. దీనికి తోడు ద్వితీయ భాషస్థానంలో తమకు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఈ వెసులుబాటు ఉన్నందున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు. ఇంటర్మీడియట్ విద్యతో తాజా సంస్కరణలతో హెచ్‌ఈసీ విద్యార్థికి గణితంలో ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. బైపీసీ విద్యార్థికి చరిత్రపట్ల ఆసక్తి ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు. అయితే నూతన సంస్కరణలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేకపోయారు. ఫలితంగా కొత్త కోర్సులో కొత్త సబ్జెక్టులకు విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన లేదు. కేవలం ఏడుగురు మాత్రమే సంస్కరణల వైపు మొగ్గు చూపి కొత్త సబ్జెక్టులను అందిపుచ్చుకున్నారు. జిల్లాలో 15,274 మంది ఎంపీసీ విద్యార్థుల్లో కేవలం ఐదుగురు మాత్రమే ఎంబైపీసీ, 3,162 మంది బైపీసీ విద్యార్థుల్లో ఒకరు గణతం, ఎంపీసీ ఒకరు బయాలజీ సబ్జెక్టును ఎంచుకున్నారు. సైన్స్ విద్యార్థులు ఎవ్వరూ ఆర్ట్ సబ్జెకుల వైపు ఆసక్తి కనబర్చలేదు. ఆర్ట్, ఒకేషనల్ విద్యార్థులెవ్వరూ గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీ సబ్జెక్టులను ఎంపిక చేసుకోలేదు.