Share News

రాళ్లపాడు ప్రాజెక్టును ఆధునికీకరించాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:14 AM

రాళ్లపాడు ప్రాజె క్టును నిర్మించి 70 ఏళ్లు పూర్తికావస్తున్నందున దాని భద్రత దృష్ట్యా ఆధునికీకరణ చేపట్టాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎడమకాలువ పొడిగింపు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాలలో మంగళవారం ఆయన రాళ్లపాడు రిజర్వాయర్‌ సమస్యలను ప్రస్తావించారు.

రాళ్లపాడు ప్రాజెక్టును ఆధునికీకరించాలి

ఎడమ కాలువను పొడిగించాలి

అసెంబ్లీలో ప్రస్తావించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి

కందుకూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాళ్లపాడు ప్రాజె క్టును నిర్మించి 70 ఏళ్లు పూర్తికావస్తున్నందున దాని భద్రత దృష్ట్యా ఆధునికీకరణ చేపట్టాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎడమకాలువ పొడిగింపు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాలలో మంగళవారం ఆయన రాళ్లపాడు రిజర్వాయర్‌ సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గంలోని వందకు పైగా గ్రామాలకు తాగునీరు, 25వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరందించడం ద్వారా తమ ప్రాంతానికి రాళ్లపాడు జీవనాడిగా ఉందన్నారు. అలాంటి ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక పరిస్థితి ఆందోళనకరంగా

మారిందని తెలిపారు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల్లో భాగంగా సివిల్‌ పనులు పూర్తిచేసినప్పటికీ మెకానికల్‌ పనులను సాంకేతిక ఇబ్బందుల కారణంగా చేయకుండా వదిలేశారని చెప్పారు. స్టాప్‌లాక్‌ గేట్లు దశాబ్దాలుగా ఆపరేట్‌ చేయలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భారీ వరద వస్తే ప్రాజెక్టు భద్రతకే ముప్పు పొంచి ఉందని ఎమ్మెల్యే వివరించారు. 1994లో ఒకసారి, 1996లో మరోసారి ఈ ప్రాజెక్టుకు గండ్లుపడగా అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో యుద్ధప్రాతిపదికన పునర్నిర్మాణం చేయడంతో పాటు అదనంగా రేడియల్‌ గేట్లు ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం వరద నీటి నిర్వహణకు ఈ గేటే ్ల ఆధారంగా ఉన్నాయని వివరించారు. స్టాప్‌లాక్‌ గేట్లకు పూర్తిస్థాయి మరమ్మతులతోపాటు కుడి, ఎడమ కాలువల హెడ్‌ రెగ్యులేటర్లను కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని కోరారు. గత సీజన్‌లో కుడికాలువ గేటు విరిగిపడిపోతే రైతులకు సాగు నీరందించేందుకు నానాప్రయాస పడాల్సి వచ్చిన దుస్థితిని గుర్తుచేశారు. అలాగే ఎడమకాలువ కింద ప్రస్తుతం 1,500 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉందన్నారు. లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లోని మెట్టప్రాంత రైతులకు మేలు జరిగేలా మరో 4వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఈకాలువ పొడిగింపు పనులు మంజూరై ఉన్నా ప్రారంభించలేదని చెప్పారు. దీనిపై ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ.. రిజర్వాయరు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Feb 18 , 2026 | 02:14 AM