Share News

ప్రక్రియ ముగిసింది.. లెక్క మిగిలింది!

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:54 AM

దేశవ్యాప్తంగా చేపట్టిన పులల లెక్కింపు ప్రక్రియ జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు డివిజన్‌లలో ముగిసింది. మూడు దశల్లో 70 రోజులపాటు కొనసాగింది.

ప్రక్రియ ముగిసింది.. లెక్క మిగిలింది!

జిల్లా పరిధిలోని నల్లమలలో ముగిసిన పులుల గణన

70 రోజులపాటు కొనసాగిన లెక్కింపు

ఇప్పటికే రెండు దఫాలు వేర్వేరు పద్ధతుల్లో చేపట్టిన అటవీశాఖ

ప్రస్తుతం మూడో దశలో ట్రాప్‌ కెమెరాల ద్వారా పూర్తి

మార్కాపురం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా చేపట్టిన పులల లెక్కింపు ప్రక్రియ జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు డివిజన్‌లలో ముగిసింది. మూడు దశల్లో 70 రోజులపాటు కొనసాగింది. చివరిసారిగా 2022లో గణన చేపట్టారు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఇప్పుడు జరుగుతోంది. గత ఏడాది డిసెంబరు 1 నుంచి లెక్కింపు మొదలైంది. తొలిదశలో శాకాహార, మాంసాహార జంతువులు, పులుల సంఖ్యను లెక్కిస్తూ వాటి మలమూత్రాల సేకరణ, పాదముద్రలు, నేల రాలిన వెంట్రుకలు తదితరాల సేకరించారు. రెండో దశలో శాటిలైట్‌ వ్యవస్థను వినియోగించి వన్యప్రాణుల స్థితిగతులను తెలుసుకున్నారు. ఇప్పుడు మూడో దశలో ట్రాప్‌ కెమెరాల ద్వారా పులుల వివరాలు సేకరించారు. నల్లమల పరిధి ఉన్న మార్కాపురంతోపాటు గిద్దలూరు అటవీ డివిజన్‌ కూడా ఇప్పుడు మార్కాపురం జిల్లా పరిధిలోకే వచ్చింది. వీటితోపాటు నంద్యాల, ఆత్మకూరు అటవీ డివిజన్‌ ఉంది. వాటిలో ఇప్పుడు మార్కాపురం, ఆత్మకూరులో లెక్కింపు పూర్తయింది. నల్లమలలోని మిగిలిన నంద్యాల, గిద్దలూరు డివిజన్‌లలో ఈనెల 20 నుంచి లెక్కింపు చేపట్టనున్నారు.

703 ప్రాంతాల్లో 1,406 ట్రాప్‌ కెమెరాలు

ప్రస్తుతం జరిగిన లెక్కింపు ప్రక్రియలో ట్రాప్‌ కెమెరాలను ఉపయోగించారు. మార్కాపురం డివిజన్‌ పరిధిలోని నల్లమల డీప్‌ ఫారెస్ట్‌లో 703 ప్రాంతాలను గుర్తించారు. వాటివద్ద చెట్లకు రెండు వైపులా (కుడి, ఎడమ) కనిపించే విధంగా ఒక్కోచోట రెండు చొప్పున 1,406 ట్రాప్‌ కెమెరాలను అమర్చారు. రెండు వైపులా ఏర్పాటు చేయడం ద్వారా జంతువుల పూర్తి చిత్రం తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. వాటి సంచారం కూడా గుర్తించబడుతుందంటున్నారు. అటవీశాఖ సిబ్బందితోపాటు నల్లమల పరిరక్షణ కోసం పనిచేస్తున్న చెంచు గిరిజనుల్లోని ప్రొటెక్షన్‌ వాచర్లు, ఇతరులు కలిపి మొత్తం 350 మంది సిబ్బంది ఈ సాహసోపేత పనిలో పాల్గొన్నారు.

గణనకు ముందు నల్లమలలో 86 పెద్దపులులు

మూడు దశల్లో వచ్చిన ఫలితాలను నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీకి పంపిస్తారు. వారు అన్ని కోణాల్లో విశ్లేషణ చేసిన తరువాత తుది వివరాలను ప్రకటిస్తారు. గణనకు ముందు నల్లమల పరిధిలో దాదాపు 86 పెద్దపులులు ఉన్నట్లు అధికారుల అంచనా. కానీ అధికారిక లెక్కల తరువాత పూర్తిస్థాయి వివరాలు వెల్లడవుతాయి.

Updated Date - Feb 10 , 2026 | 02:54 AM