రొయ్యల ధర ఢమాల్
ABN , Publish Date - May 26 , 2026 | 01:30 AM
జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ.లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేసి తీరా అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కేజీకి రూ.40దాకా పడిపోయిన వనామీ రకం రేటు
అసలు కొనేందుకు ముందుకు రాని వ్యాపారులు
ఒంగోలు నగరం, మే 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ.లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేసి తీరా అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వనామీ రొయ్యలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావ డం లేదు. ప్రస్తుతం జిల్లాలో వనామీ సాగు తక్కువగానే ఉన్నప్పటికీ ఆ కొద్ది రొయ్య లను కూడా అమ్ముకోవాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పదిహేను రోజులుగా వనామీ రొయ్యల ధర కేజీ రూ.40 వరకూ పడిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా దక్కని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పదిహేను రోజుల క్రితం వనామీ రొయ్యలు 100 కౌంటు రూ.270 ఉండగా ఇప్పుడు రూ.230కే వ్యాపారులు అడుగుతున్నారు. 60 కౌంటు ధర నిన్నటి వరకు రూ.320 ఉండగా ఇప్పుడు రూ.280 ఇస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి రొయ్యలను చెరువులో ఉంచుకుంటే అదనపు భారం పడుతుంది. దీంతో వచ్చిన కాడికే దక్కుదల అని అమ్ముకునేందుకు రైతులు సిద్ధపడుతున్నప్పటికీ వ్యాపారులు ముందుకు రావడం లేదు. పంటను అమ్ముకోవాలంటే రైతులు వారం పది రోజులు వ్యాపారుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. గోదావరి జిల్లాల్లో వనామీ పంట చేతికొచ్చి పుష్కలంగా లభిస్తుండటంతో వ్యాపారులు అందరూ అక్కడ తక్కువకే కొనుగోలు చేస్తూ ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అరకొరగా ఉన్న పంటను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. దీంతో వనామీ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం మండుతున్న ఎండలు, వడగాలులకు చెరువుల్లో ఆక్సిజన్ సమస్య తలెత్తి ఎక్కడ పూర్తిస్థాయిలో నష్టం వస్తుందోనన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది.