బతుకు వల బుగ్గి
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:37 AM
ఉవ్వెత్తున ఎగిసిన అగ్నికీలలను చూసి ఊరు ఊరంతా ఘొల్ల్లుమంది. అంతా నిద్రపోతున్న వేళ మత్స్యకారుల జీవనాన్ని బుగ్గి చేసిన విషాద ఘటన మంగళవారం రాత్రి కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం తీరంలో చోటుచేసుకుంది.
బతుకు వల బుగ్గి
కడలి తీరాన అగ్నిప్రమాదం
దగ్ధమైన మత్స్యకారుల వలలు
ప్రమాదంలో రూ.10కోట్ల నష్టం
కొత్తపట్నం పల్లెపాలెంలో అర్ధరాత్రి ఘటన
జీవనాధారం కోల్పోయిన మత్స్యకారులు
వారికి నిత్యావసర సరుకులు పంపిణీ
ఉవ్వెత్తున ఎగిసిన అగ్నికీలలను చూసి ఊరు ఊరంతా ఘొల్ల్లుమంది. అంతా నిద్రపోతున్న వేళ మత్స్యకారుల జీవనాన్ని బుగ్గి చేసిన విషాద ఘటన మంగళవారం రాత్రి కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం తీరంలో చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో గ్రామంలోని 60 మంది మత్స్యకారులకు సంబంధించిన 300 వలలు పూర్తిగా ఆహుతయ్యాయి. వీటితోపాటు అవే భవనాల్లో మత్స్యకారులు ఉంచిన వలలను చుట్టే మిషన్లు కూడా కాలిపోయాయి. మొత్తం నష్టం రూ.10కోట్లపైనే ఉంటుంది. ఈ ప్రమాదంతో మత్స్యకారులు జీవనాధారం కోల్పోయారు.
కొత్తపట్నం (ఒంగోలునగరం), నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కె.పల్లెపాలెం గ్రామంలోని మత్స్య కారులు వేటకు విరామం పలికారు. వేట సాగే సమయంలో అయితే ఎక్కువ మంది తమ వలలను సముద్రంలోనే ఉంచుకొంటారు. ఇటీవల వరుస తుఫాన్లతో పది రోజులుగా వేటకు వెళ్ల కుండా తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు చేర్చు టకున్నారు. వలలను తీరంలో ఉన్న షెడ్లలో భద్రపరుచుకున్నారు. మంగళవారం రాత్రి ఒక్క సారిగా అక్కడ మంటలు చెలరేగాయి. అగ్నికీల లకు దాదాపు మత్స్యకారులందరికీ చెందిన వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కొక్కరివి రూ.30లక్షల విలువైన వలలు అక్కడ ఉన్నాయి. వలలకు నిప్పంటుకుని మంటలు ఎత్తున లేచి పడుతుంటే మత్స్యకారులు నిస్సాహులై దూరంగా చూస్తూ ఉండిపోయారు. వారి కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లల రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి.
వల లేకుంటే వేట కష్టమే...
మత్స్యకారుల ప్రధాన జీవనాధారం సము ద్రంలో వేట చేయడమే. వారికి ఇతర వృత్తులపైన పెద్దగా అవగాహన ఉండదు. వేటకు ముఖ్య ఆయుధమైన వలలే ఈ ప్రమాదంలో వారికి దూరమయ్యాయి. అనేక రకాలైన వలలు మంటల్లో మాడి మసైపోయాయి. రింగు, ఐలా, సన్నాలు ఇలా అనేక రకాలైన వలలు ఈ ప్రమాదంలో బుగ్గయ్యాయి. పడవలు మాత్రం ప్రమాదానికి గురికాలేదు. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు తమ పడవలను తీరంలో ఎత్తైన ప్రాంతాలకు చేర్చుకున్నారు. వలలను మాత్రం తీరంలోని పెద్ద ఓపెన్ హాలుల్లో భద్రపరుచుకున్నారు. అగ్నిప్రమాదం అక్కడే చోటుచేసుకుంది. వలలు అగ్నికి తగలబడిపోయి ప్లాస్టిక్ ద్రవంగా మారి ఆ ప్రాంతంలో ప్రవహించింది.
బోరున విలపించిన మత్స్యకారులు
ఈ సంఘటతో మత్స్యకారులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారంపై అగ్నికీలలు ఎగిసిపడుతుంటే చూస్తూ ఉండటమే గాని ఏమీ చేయలేకపోయామని వారు ఘొల్లుమన్నారు. ప్రమాదం విషయం ఆ రాత్రి సమయంలోనే గ్రామంలో దావానలంగా వ్యాపించింది. మహిళలు, చిన్నా పెద్దా అందరూ వందల సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. గ్రామంలో ఇళ్లకు కూడా నిప్పంటుకుందేమో అన్న ఆందోళనతో వారు వణికిపోయారు.
వెంటనే వచ్చిన అధికారులు, ఎమ్మెల్యే
ప్రమాదం గురించి తెలుసుకున్న జేసీ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్థన్‌రాజు అర్ధరాత్రే తీరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారులకు ధైర్యం చెప్పారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దనరావు కూడా విషయం తెలిసిన వెంటనే కె.పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులను ఓదార్చారు. బుధవారం ఉదయం కలెక్టర్ రాజాబాబు కె.పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించి ప్రమాదంలో తగలబడిపోయిన వలలను పరిశీలించారు. ఘటన గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీవనాధారం పూర్తిగా కోల్పోయిన మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆప్కాస్ ఛైర్మన్ యాటగిరి రాంప్రసాదు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేత
అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేసింది. ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, కొత్తపట్నం తహసీల్దార్ రామానాయుడు మత్స్యకార కుటుంబాలకు బియ్యం. కూరగాయలు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. బుధవారం రెవెన్యూ అధికారులు గ్రామంలో ఏఏ మత్స్యకారులకు చెందిన వలలు ఎన్ని కాలిపోయాయో అనే వివరాలను నమోదు చేశారు. రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు తహసీల్దార్ రామానాయుడు తెలిపారు.