సభ సూపర్
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:03 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మార్కాపురంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి విజయోత్సవ సభ సక్సెస్ అయ్యింది. కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.
రెండేళ్ల పాలనపై మార్కాపురంలో జిల్లా స్థాయి విజయోత్సవాలు
మంత్రులు ఆనం, గొట్టిపాటి, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నేతలు హాజరు
జిల్లా ఇవ్వడం నమ్మకం, వెలిగొండతో మరింత అభివృద్ధి అని వ్యాఖ్య
వైసీపీ సిగ్గులేని పార్టీ అని ధ్వజం
భారీగా తరలివచ్చిన ప్రజానీకం
మార్కాపురం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మార్కాపురంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి విజయోత్సవ సభ సక్సెస్ అయ్యింది. కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు మాట్లాడారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తికాబోతోందని, ఈ ప్రాంతం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని పునరుద్ఘాటించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలు, మోసాలను ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘రెండేళ్ల నమ్మకం-సంక్షేమం, అభివృద్ధి’ పేరుతో మార్కాపురంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో బుధవారం జిల్లాస్థాయి విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి ప్రణాళిక నివేదికను కలెక్టర్ ఎం.విజయసునీత వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎన్నో అంశాలను తన దృష్టికి తెస్తారని చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు ప్రారంభించామని చెప్పారు. కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లాలో 13 దేవాలయాలను కామన్ గుడ్‌ఫండ్ ద్వారా రూ.16.84 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక భజన మందిరం నిర్మించేలా నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శ్రీశైలం వెళ్లే భక్తుల ప్రయాణానికి అసౌకర్యం లేకుండా త్వరలో శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, గత రెండేళ్లలో చేసిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు.
వెలిగొండపై నమ్మకంతో పంటలు కూడా మారాయి: విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్
ప్రజా ప్రభుత్వం త్వరలోనే వెలిగొండను పూర్తి చేస్తుందన్న నమ్మకంతో రైతులు వేసే పంటలు కూడా మారుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గతంలో వర్షాల కోసం ఎదురుచూసి పంటలు సాగు చేసే రైతులు ఇటు వెలిగొండ, అటు హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో కోకో, పామాయిల్, ఉద్యానపంటలపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. వెలిగొండ పూర్తి చేయకుండానే గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని విమర్శించారు. అసలు వెలిగొండ ప్రాధాన్యత గురించి జగన్‌కు తెలియదన్నారు. నికరజలాలు కావాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేంద్రంతో టీడీపీ పోరాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజా సమస్యలపై పార్టీకి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇటీవలే ప్రభుత్వం నిర్వాసితుల కోసం రూ.905 కోట్ల పరిహారం కూడా మంజూరు చేసిందని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు వాటిని నిర్వాసితులకు అందజేస్తారన్నారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఈ ప్రాంత ప్రజానీకం ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.
కలెక్టరేట్ అభివృద్ధికి రూ.5 కోట్లు : ఎంపీ మాగుంట
ప్రజా ప్రభుత్వ హయాంలో జిల్లా ఏర్పాటు చేయటం శుభపరిణామమని, జిల్లా అభివృద్ధి పట్ల కూడా సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో ఇంకా పలు సౌకర్యాలు ఏర్పాటు కావాల్సి ఉందని, అందుకు ఎంపీ నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. అధికారులు పనుల అంచనాలు తయారు చేయాలని సూచించారు. అందరూ కలసి వస్తే మార్కాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కూడా అవకాశాలున్నాయన్నారు.