వైద్యశాఖ అప్రమత్తం
ABN , Publish Date - May 21 , 2026 | 03:35 AM
ఎండల తీవ్రతపై వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించడంతో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తలు
వైద్యశాలల్లో సెలైన్‌లు, ఐస్ ప్యాడ్స్, ఇతర మందులు సిద్ధం
108 వాహనంతోపాటు బెడ్లు ఏర్పాటు
ఒంగోలు కలెక్టరేట్, మే 20 (ఆంధ్రజ్యోతి) : ఎండల తీవ్రతపై వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించడంతో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. వడదెబ్బ బారిన పడిన వారికి వెంటనే వైద్యం అందించాలని సూచించింది. దీంతో జిల్లాలోని వైద్యారోగ్యశాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో 39 పీహెచ్‌సీలు ఉండగా ఒక్కో కేంద్రంలో వడదెబ్బ బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా రెండు బెడ్‌లను ఏర్పాటు చేశారు. సెలైన్ బాటిళ్లు, శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఐస్ ప్యాడ్స్, ఇతర మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసరమైతే మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వచ్చే ఐదు రోజులు ఎండతీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో కరపత్రాల పంపిణీకి కూడా చర్యలు తీసుకున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసరమై బయటకు రావాల్సి వస్తే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.