మిల్లర్ల మాయాజాలం
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:46 AM
వరి పండించిన రైతులు మార్కెట్ మాయాజాలంలో చిక్కి విలవిల్లాడుతున్నారు. మిల్లర్లు, వ్యాపారుల చేతిలో దగాకు గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట చేతికి వచ్చేవరకు అనేక ఇబ్బందులు పడటం పరిపాటైంది.
ధాన్యం రైతు దిగాలు
వారి అవసరాలను ఆసరాగా చేసుకొని కొర్రీలతో నిలువుదోపిడీ
ప్రభుత్వ కేంద్రాల్లో మందకొడిగా కొనుగోళ్లు
పంటను కాపాడుకొనేందుకు నానా అగచాట్లు
నిల్వ చేసుకొనే వీలులేక ఆరు బయటే రాశులు
కనపర్తి ఎత్తిపోతల పథకం రైతుల ఆవేదన
అధికారుల తీరుపై విమర్శలు
వరి పండించిన రైతులు మార్కెట్ మాయాజాలంలో చిక్కి విలవిల్లాడుతున్నారు. మిల్లర్లు, వ్యాపారుల చేతిలో దగాకు గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట చేతికి వచ్చేవరకు అనేక ఇబ్బందులు పడటం పరిపాటైంది. ఆ తర్వాత పంట దాచుకొందామంటే తగిన వసతులు లేక, అమ్మి అప్పులు తీర్చుకొందామంటే మద్దతు ధర లభించక అల్లాడుతున్నారు. దీనికి తోడు డిమాండ్ లేదంటూ వ్యాపారులు ధర దిగ్గోసి కొంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకుందామంటే అక్కడంతా మందకొడి వ్యవహారమే. దీంతో అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు.
నాగులుప్పలపాడు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్న పలువురు మిల్లర్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనలేమని తెగేసిచెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారులు, మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేసేలా సివిల్ సప్లయీస్ అధికారులు ఒత్తిడి తీసుకురాకపోవడంతో అంతా మిల్లర్ల ఇష్టారాజ్యంగా మారింది. దీంతో దిక్కుతోచని పరిస్థితితో అన్నదాతలు దిగాలు పడుతున్నారు. వివరాల్లోకెళితే.. ఆదర్శ ఎత్తిపోతల పఽథకంగా పలుమార్లు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకొన్న కనపర్తి ఎల్‌ఐ పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులు ఐదు వేల ఎకరాలలో 1271, 1262, కేఎన్‌ఎం 1638, నెల్లూరు సన్నాలు రకాలను సాగు చేశారు. నెల క్రితం పంట కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అప్పట్లో ఏర్పాటు కాలేదు. దీంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పది రోజుల్లో మూడు లారీలే కొనుగోలు
కొందరు రైతులు ధాన్యాన్ని ఇళ్లకు తరలించుకొని వాటిని కాపాడుకొనేందుకు నానాతిప్పలు పడుతున్నారు. రైతుల అభ్యర్థనలతో ఆలస్యంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ కొనుగోళ్లు మాత్రం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టి మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోళ్లు మందకొడిగా చేస్తుండటంతో మళ్లీ అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనలేమని ఽజిల్లాకు చెందిన మిల్లర్లు కొనుగోళ్లను నిలిపివేశారు. గతంలో తెలంగాణకు చెందిన వ్యాపారులు, మిల్లర్లు బస్తా (76కేజీలు) ధాన్యాన్ని రూ.1.550 వరకు కొనగా ఇప్పుడు ఇక్కడి మిల్లర్లు రూ.1,300 మాత్రమే ఇవ్వగలమని చెప్పడంతో రైతు నెత్తిన పిడుగుపడినట్లయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా గత పది రోజుల్లో కేవలం మూడు లారీల సరుకును మాత్రమే కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వ్యాపారులు, మిల్లర్ల మాయాజాలం
కనపర్తి ఎత్తిపోతల పఽథకం పరిధిలో సాగుచేసిన వరి పంట కొనుగోళ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో నిలిచిపోయాయి. ఇదే అదనుగా పలువురు మిల్లర్లు తమ దళారులను పంపించి రైతుల వద్ద నేరుగా బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా కొన్నట్లుగా నమోదు చేసుకొంటున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మిల్లర్లు కూటమి కట్టి పూర్తిగా ఆరిపోయిన ధాన్యం బస్తాకు ఐదు కేజీల తారం ఇస్తేనే ఽకొనుగోలు చేస్తామని, తేమ శాతం 17కన్నా ఎక్కువ ఉంటే ఒక్క శాతానికి ఒక కిలో చొప్పున తారం (తరుగు కింద) అదనంగా ఇవ్వాలని షరతులు విధించారు. దీనిపై సివిల్ సప్లయీస్ అధికారులు నోరు మెదపకపోవడం వెనక ఆంతర్యమేమిటో తెలియడం లేదు. అంతా కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము లారీలు సైతం ఏర్పాటుచేయలేమని రైతులే ఏర్పాటు చేసుకోవాలని మిల్లర్లు హుకుం జారీచేయడం కొసమెరుపు. మిల్లర్లు, వ్యాపారులు, సివిల్ సప్లయీస్ అధికారుల సమష్టి దోపిడీపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే ప్రత్యేక దృష్టిసారించి కనపర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సివిల్ సప్లయీస్ డీఎంను వివరణ కోసం ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.